ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు.. ప్రాజెక్టులకు పెరిగిన వరద.. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటి విడుదల

పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కృష్ణా నదిలోకి నీటి ప్రవాహం పెరిగింది. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి అధికారులు నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.

Published on: Sep 25, 2026, 09:57:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. గురువారం సాయంత్రానికి బ్యారేజీ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అధికారులు గేట్లు ఎత్తి మిగులు నీటిని విడిచిపెడుతున్నారు. రాత్రి 9 గంటల సమయానికి బ్యారేజీకి 26,024 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా, అధికారులు 20 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 14,500 క్యూసెక్కుల అదనపు నీటిని దిగువ కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల
ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల

అధికారులు కేఈ ప్రధాన కాలువలోకి 5,738 క్యూసెక్కులు, కేడబ్ల్యూ ప్రధాన కాలువలోకి 5,527 క్యూసెక్కులు, గుంటూరు కాలువలోకి సుమారు 259 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ మూడు కాలువలలో కలిపి మొత్తం 11,524 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

ఇతర ప్రధాన జలాశయాలలకు కూడా నీరు వస్తోంది. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల కేవలం ప్రకాశం బ్యారేజీ మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఎగువ నుండి వరద వస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి కూడా నీరు చేరుతోంది. ఎగువన ప్రాణహిత, ఇంద్రావతి ఉప్పొంగడంతో ధవళేశ్వరం వద్ద గోదావరి హోరెత్తుతోంది.

ప్రకాశం బ్యారేజీ నుండి నీటి విడుదల పెరగడంతో దిగువన ఉన్న దివిసీమ మరియు కృష్ణా నది పరివాహక లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదిలోకి దిగవద్దని, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కాలువలకు నీటి విడుదల పెరగడంతో ఖరీఫ్ పంటలకు ఈ నీరు ఎంతో మేలు చేస్తుందని కృష్ణా డెల్టా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుడమేరు వాగు ఉగ్రరూపం దాల్చుతోంది. కృష్ణా జిల్లాలోని నందివాడ మండల పరిధిలో బుడమేరు ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వాగు ఉద్ధృతికి వందలాది ఎకరాల్లోని పంట పొలాలు నీట మునిగి తీవ్ర పంట నష్టం వాటిల్లింది.

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీటితో పాటు కొట్టుకువచ్చిన గుర్రపుడెక్క పుట్టగుంట వంతెన వద్ద పేరుకుపోవడంతో ప్రవాహానికి తీవ్ర అడ్డంకిగా మారింది. నీరు ముందుకు సాగక ప్రవాహ తీవ్రత మరింత పెరుగుతోంది. రంగంలోకి దిగిన నీటిపారుదల శాఖ అధికారులు ప్రొక్లైనర్ యంత్రాల సహాయంతో వంతెన వద్ద చేరుకున్న గుర్రపుడెక్కను హుటాహుటిన తొలగిస్తున్నారు.

వరద మట్టం ఇదే రీతిలో కొనసాగితే గుడివాడ - హనుమాన్ జంక్షన్ మధ్య వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు, పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

మరోవైపు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. జిల్లాలో మొత్తం 217.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సగటున 7.7 సెంటీమీటర్లుగా రికార్డైంది. ఏలూరు పరిధిలోని ఐదు మండలాల్లో ఏకంగా 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అధికంగా చింతలపూడి మండలంలో 16.2 సెంటీమీటర్లు, అత్యల్పంగా జంగారెడ్డిగూడెంలో 4.3 సెంటీమీటర్ల నమోదైంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More