Krishna Godavari Sangamam Jalaharathi : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా-గోదావరి నదుల పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రాంతంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర జలాలకు పుష్పమాలలు, వస్త్రాలు, పసుపు-కుంకుమలు సమర్పించి హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జలహారతి అనంతరం ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే ప్రస్తుత ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూనే, రాష్ట్ర నీటిపారుదల రంగాన్ని పరుగులు పెట్టించేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు.
గతంలో తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రాధాన్యతను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు. "పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు విజయవంతంగా తరలించాం. దీనివల్ల శ్రీశైలం రిజర్వాయర్‌లో కృష్ణా నీటిని పొదుపు చేసుకునే వెసులుబాటు లభించింది. అలా పొదుపు చేసిన నీటిని రాయలసీమ లాంటి కరవు ప్రాంతాలకు తరలించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు వీలు పడింది" అని ముఖ్యమంత్రి వివరించారు.
వ్యవసాయానికి, సాగునీటి రంగానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అగ్రతాంబూలం ఇస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సాగునీటి రంగానికి రూ.68 వేల కోట్లు ఖర్చు చేసిందని గుర్తుచేశారు. అదే బాధ్యతతో 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన రెండేళ్ల కాలంలోనే ఏకంగా రూ.24 వేల కోట్లను నీటిపారుదల ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టామని గణాంకాలతో సహా వెల్లడించారు.
మునుపటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "గత పాలకులు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినా కనీసం పట్టించుకోలేదు. గుండ్లకమ్మ, పులిచింతల ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోతే మాట్లాడిన నాథుడే లేడు. ప్రాజెక్టుల మరమ్మత్తులకు పైసా విదిల్చలేదు సరే కదా, కనీసం గేట్లకు గ్రీజు కూడా పూయని దౌర్భాగ్య స్థితిని చూశాం. ఇలాంటి అతి ముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించడం దేశ ద్రోహం, రాష్ట్ర ద్రోహం కిందకే వస్తుంది. గత పాలకులు ఆంధ్రప్రదేశ్ రైతులకు ఘోరమైన ద్రోహం చేశారు," అని సీఎం మండిపడ్డారు.
{{/usCountry}}మునుపటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "గత పాలకులు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినా కనీసం పట్టించుకోలేదు. గుండ్లకమ్మ, పులిచింతల ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోతే మాట్లాడిన నాథుడే లేడు. ప్రాజెక్టుల మరమ్మత్తులకు పైసా విదిల్చలేదు సరే కదా, కనీసం గేట్లకు గ్రీజు కూడా పూయని దౌర్భాగ్య స్థితిని చూశాం. ఇలాంటి అతి ముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించడం దేశ ద్రోహం, రాష్ట్ర ద్రోహం కిందకే వస్తుంది. గత పాలకులు ఆంధ్రప్రదేశ్ రైతులకు ఘోరమైన ద్రోహం చేశారు," అని సీఎం మండిపడ్డారు.
{{/usCountry}}ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే శిథిలావస్థకు చేరిన ప్రాజెక్టులను బాగు చేసే బాధ్యతను భుజాన వేసుకుందని చంద్రబాబు తెలిపారు. ఇటీవల ప్రమాదంలో పడిన తుంగభద్ర డ్యామ్‌కు రికార్డు సమయంలో కొత్త గేట్లను ఏర్పాటు చేయించామని చెప్పారు. అలాగే, నిన్ననే ధవళేశ్వరం బ్యారేజీకి సైతం రూ.152 కోట్లతో కొత్త గేట్లు ఏర్పాటు చేసే ఆధునికీకరణ పనులను ప్రారంభించామని వెల్లడించారు.
2027 మార్చి నాటికి పోలవరం పూర్తి - సీఎం
ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. 2014-19 కాలంలో తాము పోలవరం ప్రాజెక్టు పనులను 72 శాతం పూర్తి చేశామని, అయితే 2019-24 మధ్య కాలంలో వచ్చిన ప్రభుత్వం కనీసం 2 శాతం పనులు కూడా చేయలేకపోయిందని విమర్శించారు. పైగా వారి నిర్లక్ష్యం వల్ల పోలవరం డయాఫ్రామ్ వాల్ దెబ్బతిని కొట్టుకుపోయే పరిస్థితి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
"పోలవరం ప్రాజెక్టు నా ఆశయం. అందుకోసమే గతంలో 37 సార్లు నేరుగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనులను పర్యవేక్షించాను. 136 సార్లు అధికారులతో సమీక్షా సమావేశాలు జరిపాను. మా నిరంతర శ్రమతో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పనులు 89 శాతం మేర పూర్తయ్యాయి. ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం కోసం ఇప్పటికే రూ.2,250 కోట్లు చెల్లించాం. రాబోయే 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎటువంటి మోటార్లు, పంపులు లేకుండా నేరుగా గ్రావిటీ ద్వారానే నీరు వస్తుంది. పోలవరం పూర్తయితే అది ఏపీ ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేస్తుంది" అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో మరియు దేశంలో నదుల అనుసంధానం జరగాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి బలంగా నొక్కిచెప్పారు. ఉత్తరాన ఉన్న వంశధార నది నుంచి దక్షిణాదిన ఉన్న పెన్నా నది వరకూ రాష్ట్రంలోని అన్ని నదులను అనుసంధానం చేయాలన్నదే తన జీవిత ఆకాంక్ష అని ప్రకటించారు. దేశంలో గతంలో వాజపేయి ప్రభుత్వం తెచ్చిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ (స్వర్ణ చతుర్భుజి) రహదారుల ప్రాజెక్టు దేశ ఆర్థిక వ్యవస్థను ఏవిధంగా మార్చివేసిందో, నదుల అనుసంధానం కూడా అంతే విప్లవాత్మక మార్పులు తెస్తుందని చెప్పారు.
భవిష్యత్తులో గంగా-కావేరీ నదులు కూడా అనుసంధానమైతే భారతదేశ ప్రగతికి తిరుగుండదని ఆశాభావం వ్యక్తం చేశారు. సముద్రంలోకి వృథాగా పోతున్న వరద నీటిని మళ్లించి సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తే పెద్ద ఎత్తున సంపద సృష్టి జరుగుతుందని వివరించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ప్రాధాన్యతా క్రమంలో గుర్తించిన 36 సాగునీటి ప్రాజెక్టులను వచ్చే మూడేళ్ల కాలంలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.