...
...
Next Story

4 రోజులు, 36 కార్యక్రమాలు...! సీఎం చంద్రబాబు ‘దావోస్‌’ పర్యటన ఖరారు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌కు పర్యటనకు వెళ్లనున్నారు. జనవరి 19 నుంచి 22వ తేదీ వరకు టూర్ కొనసాగనుంది. 4 రోజుల పర్యటనలో భాగంగా మొత్తం 36 కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Published on: Jan 17, 2026 05:44 PM IST
Advertisement

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం ఆదివారం దావోస్ బయల్దేరి వెళ్లనుంది. 4 రోజుల పాటు దావోస్‌లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ దావోస్‌లో ప్రపంచ ఆర్ధిక సదస్సులో వివిధ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి ముఖాముఖి భేటీలు, కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

దావోస్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు
దావోస్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆదివారం రాత్రి 8.35 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరి ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు… అక్కడి నుంచి జ్యూరిచ్‌కు వెళ్తారు. ఢిల్లీలో 19 తేదీన రాత్రి 01.45 గంటలకు బయల్దేరి ఉదయం జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకుంటారు. జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో స్విట్జర్లాండ్‌ భారతీయ రాయబారి మృదుల్ కుమార్ మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. అనంతరం ఎరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ కిషోర్ లుల్లా, సహ అధ్యక్షులు రిథిమా లుల్లా, స్వనీత్ సింగ్‌లు కూడా ముఖ్యమంత్రితో సమావేశం అవుతారు.

అనంతరం భారత ఎంబసీ ఆధ్వర్యంలో జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. మొత్తం 20 దేశాల నుంచి వచ్చే ఎన్ఆర్‌టీలతో నిర్వహించే తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని తెలుగు ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గాన దావోస్ వెళ్తారు.

దావోస్‌లో తొలిరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్ధిక, పర్యాటక విభాగాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో వివిధ దేశాల మధ్య జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం టాటాసన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో కలిసి ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కూడా దావోస్ వేదికగా సీఎంతో సమావేశమవుతారు. విదేశీ మీడియా సంస్థ పొలిటికోకు సీఎం.. ప్రత్యేక ఇంటర్యూ ఇస్తారు.

ముఖాముఖి కార్యక్రమాలు….

  • దావోస్ రెండో రోజు పర్యటనలో భాగంగా హోటల్ మోరోసాని ప్రోమెనేడ్‌లో ఇండియా ఎట్ సెంటర్ జియోగ్రఫీ గ్రోత్ - ఏపీ అడ్వాంటేజ్ పేరిట సీఐఐ నిర్వహిస్తున్న బ్రేక్ ఫాస్ట్ సెషన్‌లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.
  • భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ఈ భేటీకి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా హాజరుకానున్నారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌తోనూ సీఎం సమావేశం కానున్నారు. ముఖాముఖి భేటీల అనంతరం ఏపీ లాంజ్‌లో నిర్వహించనున్న వన్ ఫ్యామిలీ- వన్ ఎంటర్ ప్రెన్యూర్ ప్యానల్ డిస్కషన్‌కు సీఎం హాజరుకానున్నారు.
  • ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ బీసీ ఇంటర్నేషనల్‌కు కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక ఇంటర్వూ ఇవ్వనున్నారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్‌లో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డారెన్ టాంక్, అనిల్ మూర్తిలతో సీఎం కొద్దిసేపు సమావేశం అవుతారు.
  • ప్రపంచ ఆర్ధిక సదస్సు సెషన్‌లో ఎనర్జీ ట్రాన్సిషన్ లీడర్స్ సమావేశంలోనూ ముఖ్యమంత్రి పాల్గొంటారు.
  • స్విట్జర్లాండ్ ఆర్ధిక వ్యవహారాల డిప్యూటీ మినిస్టర్ హెలెన్ బడ్లిజెర్ అర్టెడా, రాయబారి ఆండ్రియా రౌబర్‌తో సీఎం చర్చలు జరుపుతారు. అలాగే స్విట్జర్లాండ్ పార్లమెంటు సభ్యుడు, భారత- స్విస్ ఫ్రెండ్ షిప్ గ్రూప్ అధ్యక్షుడు నిక్ గుగ్గర్ సహా ఇతరులతో సీఎం సమావేశం కానున్నారు.
  • ఎన్విడియా ఉపాధ్యక్షుడు కాలిస్టా రెడ్మండ్‌తో సీఎం భేటీ అవుతారు. ఇజ్రాయెల్ ఆర్ధిక పారిశ్రామిక విభాగం మంత్రి నిర్ బర్కత్, ఆ దేశ ట్రేడ్ కమిషనర్ రోయ్ ఫిషర్, స్విట్జర్లాండ్‌లో ఇజ్రాయెల్ ఎకనామిక్ ట్రేడ్ మిన్ హెడ్ షిర్ స్లడ్జ్కీ తోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరపనున్నారు.
  • రెండో రోజు సాయంత్రం జేఎస్ డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ ఎండీ సజ్జన్ జిందాల్, జెఎస్ డబ్ల్యూ సిమెంట్స్, పెయింట్స్ సంస్థల ఎండీ పార్ధ్ జిందాల్‌తోనూ సీఎం భేటీ అవుతారు. అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్స్ సంస్థ మోలర్ మేర్స్క్ సీఈఓ విన్సెంట్ క్లెర్క్ తో సీఎం ముఖాముఖి సమావేశం అవుతారు.
  • ఆ తర్వాత జాన్ కాక్రిల్ సంస్థ గ్రూప్ సీఈఓ జీన్ లక్ మారాంగేతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. విజన్ టు వెలాసిటీ- డెప్లాయింగ్ ఇన్నోవేషన్ ఎట్ స్కేల్ పేరిట నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతారు.

ఆ తర్వాత ఏపీ సీఎన్ఎఫ్ నిర్వహించే హీలింగ్ ప్లానెట్ త్రో రీజెనరేటివ్ ఫుడ్ సిస్టమ్స్ పేరిట జరిగే చర్చా కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఆ తర్వాత ట్రిలియన్ డాలర్ పైవోట్ రీరైటింగ్ మార్కెట్ సిగ్నల్స్ ఫర్ నేచర్ పాజిటివ్ గ్రోత్ అనే అంశంపై చర్చా కార్యక్రమంలోనూ సీఎం పాల్గొంటారు. బ్లూమ్ బెర్గ్ సంస్థ నిర్వహించనున్న ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏఐ మూమెంట్ ట్రాన్సాఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ సెషన్ లో ముఖ్య వక్తగా ప్రసంగించనున్నారు.

ఏపీ లాంజ్ లో నిర్వహించే బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో కలిసి సీఎం హాజరు అవుతారు. వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్ రీజెనరేషన్ మొబిలైజింగ్ కేపిటల్ పేరిట నిర్వహించే మరో కార్యక్రమంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు.

మొత్తంగా దావోస్‌లో 36 కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ప్రభుత్వాల మధ్య జరిగే 3 సమావేశాల్లో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలతో 16 వన్ టు వన్ సమావేశాలు జరగనున్నాయి. 9 రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్లీనరీ సెషన్స్‌లో సీఎం పాల్గొంటారు.

సీఎన్బీసీ ఇంటర్నేషనల్ సహా వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలకు సీఎం చంద్రబాబు ఇంటర్వ్యూలు ఇస్తారు. పర్యటన తొలి రోజున జ్యూరిచ్‌లో తెలుగు డయాస్పొరా మీటింగ్‌లో పాల్గొంటారు. జనవరి 22 తేదీన దావోస్ నుంచి జ్యూరిచ్ కు చేరుకుని స్విడ్జర్లాండ్ కాలమానం ప్రకారం 2.35 గంటలకు స్వదేశానికి బయల్దేరి రానున్నారు. 23వ తేదీ ఉదయం 8.25 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో దావోస్ టూర్ ముగుస్తుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe