AP DEECET 2026 : ఏపీ డీఈఈసెట్ అప్డేట్ - దరఖాస్తుల గడువు పొడిగింపు
AP DEECET Application 2026 : ఏపీ డీఈఈసెట్ - 2026 దరఖాస్తు గడువును పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 30వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
AP DEECET Application 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డైట్ (DIET) కళాశాలల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే డీఈఈసెట్ (DEECET-2026) దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. ఈ నెల 30వ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డీఈఈసెట్ కన్వీనర్ లింగేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించారు.

గతంలో పొడిగించిన గడువు ఈ నెల 26తో ముగియాల్సి ఉంది. అయితే.... రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది విద్యార్థులు దరఖాస్తు ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గడువు పొడిగించాలని వచ్చిన విజ్ఞప్తుల మేరకు విద్యాశాఖ సానుకూలంగా స్పందించింది. అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించారు.
ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉపాధ్యాయ శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నిర్ణీత ఫీజు చెల్లించి అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తులను స్వీకరించబోమని కన్వీనర్ స్పష్టం చేశారు. హాల్ టికెట్ల విడుదల మరియు పరీక్షా తేదీల్లో మార్పులు ఉంటే త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.
ప్రాథమిక పాఠశాలల్లో (1 నుంచి 5వ తరగతి వరకు) ఉపాధ్యాయులుగా సేవలందించేందుకు ఈ రెండేళ్ల డిప్లొమా కోర్సు అత్యంత కీలకం. డీఈఈసెట్‌లో సాధించే ర్యాంకు ఆధారంగానే ప్రభుత్వ డైట్ కళాశాలల్లో సీట్ల కేటాయింపు జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది సీట్ల కోసం ఈ పోటీ పరీక్ష నిర్వహించనున్నారు.
ఏపీ డీఈఈసెట్ 2026 అప్లికేషన్ ఫీజు కింద రూ. 1000 చెల్లించాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమాన పరీక్షల్లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు 45 శాతం ఉంటే సరిపోతుంది. 2026 సెప్టెంబర్ నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. ఎలాంటి గరిష్ట వయో పరిమితి లేదు.
ఏపీ డీఈఈసెట్ 2026 - దరఖాస్తు విధానం:
- అభ్యర్థులు https://apdeecet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని పేమెంట్ లింక్ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.
- ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ లింక్ పై క్లిక్ చేసి ప్రాసెస్ చేయాలి.
- అభ్యర్థి వివరాలతో లాగిన్ కావాలి. ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్ పూర్తి చేయాలి.
- అభ్యర్థి ఫొటో, సంతకం కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- చివరగా సబ్మిట్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందొచ్చు.
ఏపీ డీఈఈసెట్ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రం తెలుగు, ఉర్దూ, తమిళం, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఇస్తారు. దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థి… ఆప్షన్ ఎంచుకోవాలి. ఇతర వివరాల కోసం హెల్ప్ లైన్ నంబర్ 7995869743ను సంప్రదించవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

