ఎర్రచందనం స్మగ్లింగ్ ఆపాలి... లేకపోతే ఆపరేషన్ కగార్ తరహాలో ఉక్కుపాదం మోపుతాం - డిప్యూటీ సీఎం పవన్ వార్నింగ్
ఎర్రచందనం స్మగ్లర్లకు డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ కగార్ తరహాలోనే ఎర్ర చందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ లో నలుగురు కింగ్ పిన్స్ ను గుర్తించామని… స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనం చేసుకుంటామని వ్యాఖ్యానించారు.
ఎర్ర చందనం అక్రమంగా రవాణా చేసే వారికి డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వారంతా స్మగ్లింగ్ ఆపకపోతే సంవత్సరంలోగా ప్రత్యేకమైన ఆపరేషన్ ద్వారా ప్రతి ఒక్కరినీ ఏరివేస్తామని హెచ్చరించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధం, ముందున్న అవకాశాలు, అవరోధాలపై అధికారులతో పవన్ చర్చించారు. ఈ మేరకు శనివారం ఐదు జిల్లాల ఎస్పీలు, రెడ్ శాండర్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు, అటవీ అధికారులతో తిరుపతి కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతాం…
సుదీర్ఘంగా సాగిన సమావేశం తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విలేకరులతో మాట్లాడారు. "సిద్ధాంతపరమైన భావజాలం ఉన్న వామపక్ష వాద తీవ్రవాదాన్ని దేశ శ్రేయస్సు దృష్ట్యా "ఆపరేషన్ కగార్" పేరుతో కేంద్ర ప్రభుత్వం తుడిచిపెట్టేయాలని భావిస్తోంది. మేం కూడా ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధాన్ని అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. ఎర్రచందనం అక్రమ రవాణా చేసేవారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. వారు స్వచ్ఛందంగా ఈ అక్రమ రవాణాను మానుకుంటే మంచిది. అలా కాకుంటే మేం కూడా కగార్ తరహా ప్రత్యేక ఆపరేషన్ ద్వారా వచ్చే ఏడాది కాలంలోనే ఎర్రచందనం స్మగ్లర్లు లేకుండా చేస్తాం. ఇదే మా హెచ్చరిక" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
“నేను కుంకి ఏనుగుల నిమిత్తం కర్ణాటక వెళ్ళినప్పుడు అక్కడ అటవీ అధికారులు నాకు కృతజ్ఞతలు చెప్పారు. ఎందుకు అని ఆరా తీస్తే.. ఆంధ్రప్రదేశ్ లో నరికి అక్రమంగా తరలించిన ఎర్రచందనం దుంగలను కర్ణాటక అటవీ అధికారులు పట్టుకొని అక్కడే వేలం వేసి, రూ. 140 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు చెప్పారు. ఇది నాకు ఆశ్చర్యం అనిపించింది” అని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.
“నేను అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నేపాల్ లో ఉన్న వేలకోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను దేశ ఒప్పంద సహకారంతో వెనక్కు తీసుకురాగలిగాం. అలాంటిది రాష్ట్రాల మధ్య ఒప్పందం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సంపదను ఇతర రాష్ట్రాల అధికారులు పట్టుకొని అక్కడే వేలం వేసుకుంటున్నారు. దీనిపై నేను కేంద్ర అటవీ శాఖ మంత్రితో మాట్లాడాను. శేషాచలం నుంచి అక్రమంగా రవాణా అవుతున్న ఎర్రచందనం దేశంలో ఏ రాష్ట్రంలో దొరికిన తిరిగి ఆంధ్రప్రదేశ్ కే దక్కేలా ప్రత్యేకమైన ఆదేశాలు జారీ అయ్యేలా చేశాను. దీంతో ఇటీవల గుజరాత్, ఢిల్లీ హర్యానా, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో దొరికిన సుమారు రూ. 20 నుంచి రూ. 25 కోట్ల విలువ చేసే ఎర్రచందనం తిరిగి రాష్ట్రానికి తీసుకుని వచ్చాం” అని పవన్ కల్యాణ్ వివరించారు.
కింగ్ పిన్స్ ను గుర్తించాం - డిప్యూటీ సీఎం
ఎర్రచందనం అక్రమ రవాణాలో ఆరితేరిన నలుగురు కింగ్ పిన్స్ ను ప్రత్యేకంగా గుర్తించామని పవన్ కల్యాణ్ కామెంట్స్ చేశారు. వారిని ప్రత్యేక వ్యూహంతో పట్టుకుంటామని చెప్పారు.
“కడపలో కొన్ని ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా అధికంగా జరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి కొందరు ప్రత్యేకంగా ఎర్రచందనం నరకడానికి వస్తున్నారు. వారికి ఉపాధి లేకపోతే స్థానికంగా ఉండే అధికారులను కలవాలి. దీనికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. ఉపాధి కోసం శేషాచలంలోని విలువైన ఎర్రచందనం చెట్లను నరికితే సహించేది లేదు. ఆపరేషన్ కగార్ తరహాలోనే... ఎర్రచందనం చెట్లు నరికే అక్రమ రవాణా దారులపై కూడా ప్రత్యేక ఆపరేషన్ మొదలుపెడతాం. ఎవరైనా చెట్టు నరకాలి అంటే భయపడే పరిస్థితులు తీసుకువస్తాం. ప్రత్యేక చట్టంతో ఎర్రచందనం స్మగ్లర్లు ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం” అని పవన్ కల్యాణఅ స్పష్టం చేశారు.
“ఇకనుంచి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధం మీద దృష్టి పెట్టాలి. ఇది హిందువుల మనోభావాలకు, సెంటిమెంట్ కు సంబంధించిన విషయం. చెట్టు నరకక ముందే వన సంపదను కాపాడుకుని నేరాలను నిరోధించాలి. ఎర్రచందనం అక్రమ రవాణా వల్ల తలెత్తే శాంతి భద్రతల సమస్యలను పరిష్కరించాలి" అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

