...
...
Next Story

గంజాయి అమ్మేవారిని పట్టిస్తే రూ.5 వేలు, తాగేవారిని పట్టిస్తే రూ.1,500

గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. గంజాయి తెచ్చేవారిని, విక్రయించేవారిని పట్టిస్తే రూ.5 వేలు, గంజాయి తాగేవారిని పట్టిస్తే రూ.1,500 ఇస్తామని ప్రకటించారు.

Published on: Aug 24, 2026, 09:53:55 IST
Advertisement

విజయవాడ నగరంలో గంజాయి విక్రయాలు, వాడకంపై పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. మాదకద్రవ్యాల మూలాలను మట్టుబెట్టేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్, ఈగల్ విభాగం సంయుక్తంగా ‘ఈగల్ ఛాలెంజ్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాయి. అజిత్ సింగ్ నగర్‌లోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీ ఎస్.వి.రాజశేఖరబాబు, ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ పాల్గొని కీలక వివరాలు వెల్లడించారు.

గంజాయి
గంజాయి

గంజాయిని నగరానికి తీసుకువచ్చినా లేదా విక్రయిస్తున్నా పోలీసులకు సమాచారం అందిస్తే రూ.5,000 నగదు పారితోషికం అందిస్తారు. గంజాయి తాగుతున్న వారి వివరాలు తెలిపిన వారికి రూ.1,500 రివార్డు ఇస్తారు.

స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల 469 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించగా 128 మందికి పాజిటివ్ వచ్చింది. గంజాయి తాగే 129వ వ్యక్తిని పట్టించి చూపించిన వారికి అజిత్‌సింగ్‌నగర్ సీఐ చంద్రశేఖర్ రూ. 1,500 తక్షణ బహుమతి ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న 32 మంది తీవ్రమైన నేరస్థులపై కఠినమైన పిట్ ఎన్డీపీఎస్ చట్టాన్ని ప్రయోగించినట్లు సీపీ వెల్లడించారు. ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 వేల విద్యాసంస్థల్లో ‘ఈగల్ క్లబ్స్’ ఏర్పాటు చేశామని ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ ఎక్కువగా వినియోగించే 849 కేంద్రాలను (హాట్‌స్పాట్లు) గుర్తించి నిఘా పెట్టారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 1972 కాల్ సెంటర్‌కు బాధితుల తల్లిదండ్రుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని, దాని ఆధారంగా తక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఈగల్ ఎస్పీ మహేశ్వరరాజు వివరించారు.

నేటి సమాజంలో ముఖ్యంగా యువత, విద్యార్థులు క్షణికానందం, మానసిక ఒత్తిడి లేదా స్నేహితుల ఒత్తిడికి లోనై గంజాయి బారిన పడుతున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తి ఆరోగ్యానికే కాకుండా, కుటుంబ జీవితానికి, సమాజ భవిష్యత్తుకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది. గంజాయి అలవాటు పడటం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, మానసిక ఆందోళన, డిప్రెషన్, భ్రమలకు గురికావడం వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. ఇది శ్వాసకోశ సమస్యలకు, గుండె సంబంధిత జబ్బులకు కూడా దారితీస్తుంది.

తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో వస్తున్న మార్పులను నిశితంగా గమనించాలి. వారితో స్నేహపూర్వకంగా ఉంటూ, మంచి చెడులను వివరించాలి. కళాశాలలు, పాఠశాలల్లో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై క్రమం తప్పకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలి. మీ పరిసరాల్లో గంజాయి విక్రయాలు లేదా వినియోగం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe