ఆంధ్రా ఫుట్‌బాల్: వైజాగ్‌ నుంచి 'టైగర్ IKF స్కౌట్ ఆన్ వీల్స్' యాత్ర

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, టైగర్ క్యాపిటల్ మద్దతుతో ఇండియా ఖేలో ఫుట్‌బాల్ (IKF) “టైగర్ IKF స్కౌట్ ఆన్ వీల్స్” కార్యక్రమాన్ని వైజాగ్ నుండి ప్రారంభించింది. 45 రోజుల ఈ ఫుట్‌బాల్ యాత్ర, యువ ప్రతిభను వెలికితీస్తూనే, ఆర్థిక అక్షరాస్యత, ఆరోగ్య అవగాహనపై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. 

Published on: Nov 06, 2025 3:52 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తీరప్రాంత నగరం విశాఖపట్నం కేంద్రంగా... భారత ఫుట్‌బాల్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. టైగర్ క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సంయుక్త సహకారంతో ఇండియా ఖేలో ఫుట్‌బాల్ (IKF) “టైగర్ IKF స్కౌట్ ఆన్ వీల్స్” అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక ఫుట్‌బాల్ ప్రచారం కాదు, రాబోయే 45 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ నలుమూలలకూ ఆశ, ప్రతిభ, సాధికారత అనే స్ఫూర్తిని తీసుకెళ్లే ఒక ఫుట్‌బాల్ ఉద్యమం.

ఆంధ్రా ఫుట్‌బాల్: వైజాగ్‌ నుంచి 'టైగర్ IKF స్కౌట్ ఆన్ వీల్స్' యాత్ర
ఆంధ్రా ఫుట్‌బాల్: వైజాగ్‌ నుంచి 'టైగర్ IKF స్కౌట్ ఆన్ వీల్స్' యాత్ర

ఈ చారిత్రక కార్యక్రమానికి వేదికైంది ఆంధ్ర విశ్వవిద్యాలయం. తొలిరోజునే 160 మందికి పైగా యువ క్రీడాకారులు ఉత్సాహంగా ఫుట్‌బాల్ ట్రయల్స్‌లో పాల్గొన్నారు. తమలో దాగివున్న ప్రతిభను మైదానంలో నిరూపించుకున్నారు. దీనితో పాటు IKF నిర్వహించిన ‘360 అవగాహన ప్రచారం’లో భాగమయ్యారు.

ఫుట్‌బాల్, ఆర్థిక స్వేచ్ఛ

ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణం సందడిగా మారిపోయింది. యువ క్రీడాకారుల ఉత్సాహం ఉరకలేసింది. ఫుట్‌బాల్‌ కేవలం ఆట మాత్రమే కాదని, ఇది అవకాశాలు, ఆత్మవిశ్వాసం, సాధికారతకు మార్గం అని అక్కడి వాతావరణం చెప్పకనే చెప్పింది. ఈ సందర్భంగా కేవలం ఆట గురించి మాత్రమే కాకుండా, కీలకమైన ఇతర అంశాలపై వర్క్‌షాప్‌లు నిర్వహించారు. ఫుట్‌బాల్‌లో కెరీర్ అవకాశాలు, బాలికల ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రత్యేక సెషన్లు నిర్వహించారు. టైగర్ క్యాపిటల్ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల కోసం ఆర్థిక అక్షరాస్యతపై కీలకమైన వర్క్‌షాప్‌లు కూడా నిర్వహిస్తున్నారు.

వైజాగ్ నుంచి మొదలైన ఈ “స్కౌట్ ఆన్ వీల్స్” వాహనం... వచ్చే 45 రోజుల్లో ఏడు ప్రధాన నగరాలు, పది పట్టణాల గుండా ప్రయాణించనుంది. ఈ యాత్రలో ఫుట్‌బాల్ ట్రయల్స్‌తో పాటు అవగాహన క్లినిక్‌లు, సమాజ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తారు. విశాఖపట్నం నుండి ప్రారంభమై తిరుపతిలో ముగియనున్న ఈ సుదీర్ఘ యాత్ర, వేలాది మంది యువ ఆటగాళ్లు, వారి తల్లిదండ్రులు, స్థానిక సమాజాలను భాగం చేస్తుంది.

ప్రతిభకు ర్యాంకింగ్‌లతో పని లేదు: ఐకేఎఫ్ వ్యవస్థాపకుడు

భారత ఫుట్‌బాల్ పటంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు పెద్దగా గుర్తింపు లేదు. కానీ, ఇండియా ఖేలో ఫుట్‌బాల్ (IKF) మాత్రం ఇక్కడ దాగివున్న అపారమైన సామర్థ్యాన్ని గుర్తించింది.

"ఈ ప్రాంతంలో అపారమైన సహజ ప్రతిభ ఉంది. మేము కేవలం ర్యాంకింగ్స్ ఆధారంగా కాకుండా, వారి వాంఛ, పట్టుదల, ఎదగాలనే తపన ఆధారంగా ముందుకు వెళ్తాం. ఆంధ్రప్రదేశ్.. భారత ఫుట్‌బాల్ పటంలో ఒక గుర్తింపుగా కాకుండా, ఒక ప్రేరణాత్మక ఉద్యమంగా నిలబడాలి," అని IKF వ్యవస్థాపకులు ఫణి భూషణ్ తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు.

ఈ బృహత్తర ప్రచారంలో మూడు కీలక భాగస్వామ్యాలు పాలుపంచుకుంటున్నాయి:

  • టైగర్ క్యాపిటల్: ఆర్థిక అక్షరాస్యత, కెరీర్ సిద్ధత వర్క్‌షాప్‌లకు నాయకత్వం.
  • ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ: స్థానిక వ్యాప్తిని బలోపేతం చేస్తూ, రాష్ట్ర యువతను ప్రోత్సహించడం.
  • రాజ్ న్యూస్: ఆశ, మార్పు కథనాలను ప్రజలతో పంచుకోవడం.

ఆర్థిక స్వేచ్ఛే ప్రధాన లక్ష్యం: టైగర్ క్యాపిటల్

ఈ చొరవలో టైగర్ క్యాపిటల్ పాత్ర చాలా కీలకం. కేవలం క్రీడలకే పరిమితం కాకుండా, కమ్యూనిటీలను ఆర్థికంగా శక్తివంతం చేయాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు.

"ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం ఆర్థిక స్వేచ్ఛ ద్వారా కమ్యూనిటీలను శక్తివంతం చేయడం. మా వాలంటీర్లు తల్లిదండ్రులు, ఆటగాళ్లతో నేరుగా మమేకమై ఆర్థిక అక్షరాస్యత, యువతకు అప్రెంటిస్‌షిప్‌లు, కుటుంబాలకు ఉద్యోగ అవకాశాల కల్పనపై కృషి చేస్తున్నారు. ఇది కేవలం అప్పులు ఇవ్వడం గురించి కాదు, కుటుంబాలకు కలలు కనే స్వేచ్ఛ ఇవ్వడం గురించి" అని టైగర్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గౌరవ్ గుప్తా వివరించారు.

ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ప్రాంతంలో బాలురు, బాలికలకు ఫుట్‌బాల్ ట్రయల్స్, కెరీర్ 360 వర్క్‌షాప్‌లు, బాలికల సాధికారత సెషన్లు, తల్లిదండ్రుల భాగస్వామ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆటగాళ్ల డేటాను IKF సాంకేతిక భాగస్వామి మైఫస్ట్‌కిక్ డిజిటల్‌గా సేకరిస్తోంది. దీనివల్ల స్కౌటింగ్ ప్రక్రియలో పారదర్శకత, దీర్ఘకాలిక ప్రతిభ ట్రాకింగ్ సాధ్యమవుతుంది.

రాజమండ్రిలో మహిళా క్రీడాకారుల జోష్

వైజాగ్‌లో విజయవంతంగా ప్రారంభమైన అనంతరం, టైగర్ IKF స్కౌట్ ఆన్ వీల్స్ ప్రచారం నవంబర్ 2న రాజమండ్రి చేరుకుంది. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే... భారీ సంఖ్యలో మహిళా క్రీడాకారిణులు పాల్గొనడం. ఈ ప్రాంతంలో మహిళా ఫుట్‌బాల్ అభివృద్ధికి ఇది ఒక కీలక ముందడుగు.

రాజమండ్రిలో 100 మందికి పైగా క్రీడాకారులు ట్రయల్స్‌లో పాల్గొన్నారు. 360 అవగాహన ప్రచారంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సైతం చురుగ్గా పాల్గొని, ఫుట్‌బాల్ ద్వారా వచ్చే అవకాశాల గురించి తెలుసుకున్నారు.

ఈ చొరవకు EMotorad అనే ప్రముఖ ఎలక్ట్రిక్ సైకిల్ బ్రాండ్ ఒక ప్రత్యేక స్పర్శను జోడించింది. వైజాగ్, రాజమండ్రి ఈవెంట్లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పర్యావరణ అనుకూల ఇ-సైకిళ్లను బహుమతిగా అందించింది.

చదువు, ఆట - రెండూ ముఖ్యమే

ప్రోస్ ఎడ్యు వ్యవస్థాపకుడు సంజు వినూత్న ఆన్‌లైన్ లెర్నింగ్ సిస్టమ్‌ల ద్వారా విద్య, క్రీడలను సమతుల్యం చేసుకునే మార్గాలపై ప్రత్యేక సెషన్ నిర్వహించారు.

"ప్రోస్ ఎడ్యు కోర్సులు ప్రత్యేకంగా యువ అథ్లెట్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవి. వీటి ద్వారా విద్యార్థులు తమ విద్యా, క్రీడా లక్ష్యాలను ఒకదానితో రాజీ పడకుండా రెండింటినీ ఏకకాలంలో కొనసాగించవచ్చు" అని ఆయన వివరించారు.

ఈ ఉద్యమం యొక్క ప్రధాన దృష్టి... ఫుట్‌బాల్ జీవితాలను మార్చగలదని నిరూపించడం. రైతు బిడ్డ కూడా పెద్ద కలలు కనగలరని, తల్లిదండ్రులు క్రీడను ఒక నిజమైన వృత్తి మార్గంగా చూడగలరని, అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలు కూడా మైదానంలో సత్తా చాటగలరని చూపించడమే లక్ష్యం.

45 రోజుల ఈ ప్రచారం ముఖ్య లక్ష్యాలు:

  • ఏడు నగరాలను చేరుకోవడం.
  • 5,000 మందికి పైగా తల్లిదండ్రులు, కమ్యూనిటీ సభ్యులను నిమగ్నం చేయడం.
  • 1,500 మంది ఆటగాళ్లను స్కౌట్ చేయడం.
  • 500 మంది బాలికలను శక్తివంతం చేయడం.

లక్ష్యం ఒక్కటే: "ఆప్ ఖేలో, మౌకా హమ్ దేంగే"

భారతదేశంలో అతిపెద్ద ఫైజిటల్ ఫుట్‌బాల్ స్కౌటింగ్, కెరీర్ ఎకోసిస్టమ్ అయిన ఇండియా ఖేలో ఫుట్‌బాల్ (IKF) ఇప్పటికే 297 పట్టణాలను కవర్ చేసి, 35,000 మందికి పైగా ఆటగాళ్లను భాగం చేసింది. ISL, I-లీగ్ మరియు అంతర్జాతీయ అకాడమీల్లో ఆటగాళ్లకు ప్లేస్‌మెంట్‌లను కూడా కల్పించింది.

“ఆప్ ఖేలో, మౌకా హమ్ దేంగే” (మీరు ఆడండి, అవకాశం మేం ఇస్తాం) అనే నినాదం ద్వారా IKF ప్రతి ఆటగాడికి, వారి నేపథ్యాన్ని పట్టించుకోకుండా, ఎదగడానికి న్యాయమైన అవకాశాలను కల్పిస్తోంది.

ప్రస్తుతం, స్కౌట్ ఆన్ వీల్స్ ప్రచారం ఆంధ్రప్రదేశ్ అంతటా విజయవంతంగా కొనసాగుతోంది. ఈ స్ఫూర్తిదాయక ఉద్యమం నవంబర్ 30 నాటికి తిరుపతిలో ముగియనుంది. అప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఫుట్‌బాల్, కమ్యూనిటీ సాధికారతకు చిహ్నంగా నిలుస్తుంది. మరింత సమాచారం కోసం సంస్థ వెబ్‌సైట్ సందర్శించవచ్చు.