...
...
Next Story

AP Forest Drone Seed Balls : చింతూరు అడవుల్లో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ - ఏపీ అటవీ చరిత్రలో ఇదే తొలిసారి..!

AP Forest Drone Seed Balls : రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా అటవీశాఖ సరికొత్త సాంకేతికతను రంగంలోకి దించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చింతూరు మారుమూల అడవుల్లో డ్రోన్ల ద్వారా విత్తన బంతులను వెదజల్లే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

Published on: Jul 14, 2026 01:43 PM IST
Advertisement

AP Forest Department Drone Seed Balls : రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ సమతుల్యతను కాపాడడం, క్షీణించిన అడవులను పునరుద్ధరించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన సీడ్ బాల్స్ (విత్తన బంతులు) తయారీ, పంపిణీ కార్యక్రమం ఇప్పుడు క్షేత్రస్థాయిలో వేగంగా ముందుకు సాగుతోంది.

చింతూరు అడవుల్లో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్
చింతూరు అడవుల్లో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్

పర్యావరణ పరిరక్షణలో భాగంగా అటవీ శాఖకు నిర్దేశించిన లక్ష్యాలను మించి అధికారులు, ప్రజలు భాగస్వామ్యమయ్యారు. తొలుత రాష్ట్రవ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా…. ప్రజల క్రియాశీల భాగస్వామ్యంతో ఏకంగా 3.80 కోట్ల సీడ్ బాల్స్ సిద్ధం చేశారు.

ప్రస్తుతం వర్షాకాలం అనుకూలించడంతో ఈ విత్తన బంతులను అటవీ ప్రాంతాల్లో వెదజల్లే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే 90 లక్షల సీడ్ బాల్స్ ను అటవీ సిబ్బంది…. స్థానికుల సహాయంతో మనుషులు చేరుకోగల ప్రాంతాల్లో విజయవంతంగా చల్లారు. అయితే, మనుషులు ప్రవేశించడానికి వీలులేని దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పునరుద్ధరించడానికి అటవీశాఖ తొలిసారిగా అత్యాధునిక డ్రోన్ సాంకేతికతను వాడుతోంది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సోమవారం రోజు…. చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ జారవిడిచే కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ చరిత్రలో డ్రోన్ టెక్నాలజీ సాయంతో విత్తన బంతులను చల్లడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

చింతూరు అడవుల్లో…

మిగిలిన అత్యంత మారుమూల, దుర్గమ ప్రాంతాలలో డ్రోన్ల సాయంతో విత్తనాలను జారవిడుస్తున్నారు. లక్కవరం రిజర్వ్ ఫారెస్ట్ లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ డ్రోన్ సీడింగ్ కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తుండడంతో…. వాతావరణ పరిస్థితులను బట్టి దీనిని కంసులూరు, మర్రిగూడ, దేవరపల్లి, రేపాక, వాలి సుగ్రీవ, భద్రాచలం అటవీ బ్లాకులకు సైతం విస్తరించడానికి అటవీశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.

జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ, వితరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా పర్యావరణ అనూకూల, దేశీయ జాతుల విత్తనాలతో తయారు చేసిన సీడ్ బాల్స్, వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో తక్షణం వెదజల్లే పక్రియ ప్రారంభించాలని సూచించారు. వేప, చింత, నేరేడు, నోని, నల్లమద్ది, ఉసిరి, రేలా, తాని తదితర వృక్ష జాతుల విత్తనాలు సోమవారం డ్రోన్ ద్వారా వెదజల్లిన వాటిలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంపొందించడం, జీవ వైవిధ్యాన్ని కాపాడడం, వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా అటవీశాఖ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe