AP BC Gurukulas : రాష్ట్రంలో కొత్తగా 10 బీసీ గురుకులాలు - 370 ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్

AP BC Gurukulas : బీసీ విద్యార్థుల ఉన్నత విద్యాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Published on: Jun 24, 2026, 08:06:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల (బీసీ) బిడ్డలకు నాణ్యమైన విద్యా సౌకర్యాలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో కొత్తగా పది మహాత్మా జ్యోతిరావు పూలే (ఎంజేపీ) బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం పరిపాలనాపరమైన చర్యలు చేపట్టింది.

రాష్ట్రంలో కొత్తగా 10 బీసీ గురుకులాలు
రాష్ట్రంలో కొత్తగా 10 బీసీ గురుకులాలు

కేబినెట్ ఆమోదం…

మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నూతన గురుకులాల ఏర్పాటుకు అధికారికంగా ఆమోదం తెలిపింది. బడి బయట ఏ ఒక్క బీసీ బిడ్డా ఉండకూడదనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి, సమగ్ర సర్వే అనంతరం ఈ కింది పది ప్రాంతాలలో నూతన ఎంజేపీ బీసీ గురుకులాలను ప్రారంభించాలని మంత్రిమండలి నిర్ణయించింది.

  1. ఎచ్చెర్ల (శ్రీకాకుళం జిల్లా)
  2. నక్కపల్లి (అనకాపల్లి జిల్లా)
  3. మాచెర్ల (పల్నాడు జిల్లా)
  4. గిద్దలూరు (మార్కాపురం)
  5. గుంతకల్లు (అనంతపురం జిల్లా)
  6. రాయచోటి (అన్నమయ్య జిల్లా)
  7. పత్తికొండ (కర్నూలు జిల్లా)
  8. మంత్రాలయం (కర్నూలు జిల్లా)
  9. పెనుకొండ (శ్రీసత్యసాయి జిల్లా)
  10. కదిరి (శ్రీసత్యసాయి జిల్లా)

ఈ పది నూతన గురుకులాలలో ఐదింటిని బాలుర కొరకు, మిగిలిన ఐదింటిని బాలికల కోసం కేటాయించనున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ విద్యాలయాల్లో తరగతులను ప్రారంభించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

370 ఉద్యోగాల భర్తీకి ఆమోదం

కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రతి గురుకుల పాఠశాలలోనూ విద్యా ప్రమాణాలు సజావుగా సాగేందుకు వీలుగా నియామకాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఒక్కో పాఠశాలలో 37 మంది చొప్పున బోధన (టీచింగ్), బోధనేతర (నాన్-టీచింగ్) సిబ్బందిని నియమించనున్నారు. మొత్తంగా ఈ పది స్కూళ్ల ద్వారా 370 కొత్త పోస్టులను భర్తీ చేయడానికి క్యాబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేశారు.

ఎంజేపీ గురుకులాల్లో చేరడానికి విద్యార్థుల నుంచి భారీగా డిమాండ్ వస్తుండటంతో, ప్రభుత్వం ఇటీవల కాలంలోనే ఆరు బీసీ గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసింది. విజయనగరం జిల్లాలోని కొత్తవలస, నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, గోలగముడి, అన్నమయ్య జిల్లాలోని కలికిరి, కడప జిల్లాలోని ఓనిపెంట, శ్రీసత్యసాయి జిల్లాలోని నాసనకోట గురుకులాలను ఇంటర్మీడియట్ స్థాయికి పెంచారు. ఈ విద్యాసంస్థల్లో ఇప్పటికే కొత్త బ్యాచ్‌లకు సంబంధించిన తరగతులు కూడా ప్రారంభమయ్యాయి.

"బడి బయట ఏ ఒక్క బీసీ బిడ్డా ఉండకూడదనే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం అభినందనీయం," అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆమె హర్షం వ్యక్తం చేస్తూ.... నిరుపేద బీసీ విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేకూరుస్తుందని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలల్లో పూర్తి రక్షణతో కూడిన నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని కూడా అందిస్తున్నట్లు తెలిపారు. గత నెలలో విడుదలైన టెన్త్, ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ గురుకులాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని మంత్రి గుర్తుచేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More