ఏపీకి భారీగా పెట్టుబడులు - విశాఖ వేదికగా కీలక ఒప్పందాలు..! వచ్చే కంపెనీలు, ఉద్యోగాల లెక్కలివే
విశాఖ వేదికగా రెండు రోజుల్లో భారీ ఎత్తున ఏపీ ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది. వీటిలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలున్నాయి. 400 ఎంఓయూల ద్వారా రాష్ట్రానికి రూ. 11,91,972 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా ప్రకటించింది.
విశాఖ భాగస్వామ్య సదస్సు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 400 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ మేరకు జరిగిన ఒప్పందాల ద్వారా రూ. 11,91,972 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. 13,32,445 ఉద్యోగాలపై హామీ పొందింది. ఇవీ గత రెండు రోజులుగా వివిధ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూల విలువ.

7 రంగాల్లో భారీగా పెట్టుబడులు..
మొత్తంగా 7 రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఏపీసీఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐ అండ్ ఐ, పరిశ్రమలు - వాణిజ్యం, ఐటీ, మున్సిపల్ శాఖల్లో ప్రభుత్వం వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో విశాఖ సమ్మిట్ మొదటి రోజునే బిగ్ హిట్ అయింది. ప్రభుత్వ అంచనాలకు మించి పరిశ్రమలు స్పందించాయి. రూ. 10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకుంది. అయితే ఆ అంచనాలకు మించి పారిశ్రామిక వేత్తల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
సదస్సు తొలి రోజైన శుక్రవారం నాడు 365 ఎంఓయూలు కుదుర్చుకోగా... వీటి ద్వారా రూ. 8,26,668 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అలాగే ఈ ఎంఓయూల ద్వారా 12,05,175 మందికి ఉద్యోగాలు ఇచ్చేలా వివిధ పరిశ్రమల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ఇదంతా ఒక్క రోజులోనే జరిగింది. ఇవాళ సీఎం సమక్షంలో 41 ఎంఓయూల ద్వారా రూ. 3.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరగనున్నాయి. వీటి ద్వారా మరో 4.16 లక్షల ఉద్యోగవకాశాలు లభించనున్నాయి.
సీఎం సమక్షంలో కీలక ఒప్పందాలు…
భాగస్వామ్య సదస్సు సందర్భంగా గత రెండు రోజుల్లో సీఎం సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా రూ. 7,15,490 కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగింది. 5,42,761 మంది ఉద్యోగాలకు హామీ పొందింది. భాగస్వామ్య సదస్సు తొలి రోజున వివిధ రంగాలకు చెందిన కంపెనీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస భేటీలు నిర్వహించారు. గురువారం వరుసగా 15 భేటీలు నిర్వహిస్తే.. శక్రవారం కూడా దాదాపు అదే స్థాయిలో ముఖ్యమంత్రి వరుస సమావేశాల్లో పాల్గొన్నారు.
శుక్రవారం సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంఓయూలు చేసుకున్న సంస్థల్లో ఏఎం గ్రీన్ మెటల్స్ అండ్ మెటీరియల్స్, ఎకోరెన్ ఎనర్జీ, జాక్సన్ గ్రీన్, జీఎంఆర్ ఎనర్జీ, ఎస్సార్ రెన్యువబుల్స్, వారీ గ్రూప్, సీసన్ గ్లోబల్ ట్రేడింగ్, ఎస్ఏఈఎల్, జెఎం బాక్సీ, శ్రీ సిమెంట్, రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్, హిందుస్థాన్ షిప్‌యార్డ్, టాటా పవర్, పతంజలి ఫుడ్, ఇండస్ కాఫీ, కెల్లాగ్ ఇండియా తదితర సంస్థలు ఉన్నాయి.
ఇక విడివిడిగా నిర్వహించిన భేటీల్లో రాష్ట్రంలో ఉన్న పెట్టుబుడులను ఆయా కంపెనీలకు చెందిన ప్రతినిధులకు వివరించారు. పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. అలాగే పారిశ్రామికాభివృద్ధికి చేపడుతున్న చర్యలను వివరించారు. వీటితో పాటు.. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి రాయితీలు వచ్చే పరిస్థితి ఉంటే.. వాటిని కూడా వచ్చేలా తాము సహకరిస్తామని సీఎం ఆయా కంపెనీల ప్రతినిధులకు వివరించారు.
మరోవైపు వివిధ శాఖలకు చెందిన మంత్రులు కూడా భాగస్వామ్య సదస్సు తొలి రోజున భారీ ఎత్తున ఒప్పందాలు చేసుకుని భారీ పెట్టుబడులను రాబట్టారు. మంత్రులందరూ కలిసి మొత్తంగా 324 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని రూ. 4,76,482 కోట్లు పెట్టుబడులకు హామీ పొందారు. ఈ ఒప్పందాల ద్వారా 7,88,884 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
తొలి రోజు సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న మంత్రుల్లో నారా లోకేష్, టీజీ భరత్, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి, నారాయణ ఉన్నారు. నారా లోకేష్ రూ. 1,38,752 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకోగా... మిగిలిన మంత్రులు కూడా భారీ ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకున్నారని ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా వివరించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

