...
...
Next Story

AP Robotics and Physical AI Policy : ఏపీలో రోబోటిక్స్ అండ్ ఫిజికల్ ఏఐ పాలసీ.. ఎందుకోసం ఇది?

AP Robotics and Physical AI Policy - 2026-36 : రోబోటిక్స్ రంగంలో ఏపీ సరికొత్తగా అడుగులు వేస్తోంది. 'రోబోటిక్స్ అండ్ ఫిజికల్ ఏఐ పాలసీ (2026-36)'కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Published on: Nov 17, 2026, 17:03:31 IST
Advertisement

భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో రోబోటిక్స్, ఫిజికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Physical AI) రంగాలను పరుగులు పెట్టించే లక్ష్యంతో రూపొందించిన 'ఆంధ్రప్రదేశ్ రోబోటిక్స్ అండ్ ఫిజికల్ ఏఐ పాలసీ (2026–36)కి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. తయారీ రంగం కేంద్రంగా రాబోయే పదేళ్లలో రాష్ట్రంలో సమగ్రమైన రోబోటిక్స్ ఎకోసిస్టమ్‌ను నిర్మించేందుకు ఉద్దేశించిన ఈ పాలసీకి సంబంధించి ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ జీవో జారీ చేశారు.

రోబోటిక్స్ అండ్ ఫిజికల్ ఏఐ పాలసీ (Unsplash)
రోబోటిక్స్ అండ్ ఫిజికల్ ఏఐ పాలసీ (Unsplash)

ఈ దశాబ్దంలో తయారీ, ఉత్పాదకత రంగాలను సమూలంగా మార్చే అత్యంత కీలక సాంకేతికతగా రోబోటిక్స్ అవతరిస్తోందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కేవలం పరిశ్రమలకే పరిమితం కాకుండా లాజిస్టిక్స్, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాల్లో ఇండస్ట్రియల్ రోబోలు, కొలాబరేటివ్ రోబోలు, అటానమస్ మొబైల్ రోబోలు, ప్రత్యేక సర్వీస్ రోబోల వినియోగం వేగంగా విస్తరిస్తోంది.

ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నమూనాలను రోబోటిక్స్, సెన్సార్లు, సిమ్యులేషన్, హార్డ్‌వేర్‌తో అనుసంధానించే ఫిజికల్ ఏఐ సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. దీని ద్వారా రోబోలు తమ చుట్టుపక్కల పరిసరాలను గుర్తించి, పరిస్థితిని అర్థం చేసుకుని, విశ్లేషించి, ప్రణాళిక ప్రకారం భౌతిక ప్రపంచంలో స్వయంగా పనిచేయగలుగుతాయి. రాష్ట్రంలో విడిభాగాల తయారీ, రోబోట్ ప్లాట్‌ఫారమ్‌లు, సిస్టమ్ ఇంటిగ్రేషన్, పరిశోధన అండ్ అభివృద్ధి, మానవ వనరుల నైపుణ్యాభివృద్ధి, రోబోల వినియోగాన్ని ప్రోత్సహించేలా ఈ పాలసీని తీర్చిదిద్దారు.

దేశంలో రోబోటిక్స్ రంగం వృద్ధి చెందుతున్నప్పటికీ, అంతర్జాతీయ స్థాయితో పోలిస్తే మనం ఇంకా చాలా వెనకబడి ఉన్నామని జీవో గణాంకాలతో సహా వివరించింది. 2024లో భారతదేశం రికార్డు స్థాయిలో 9,123 ఇండస్ట్రియల్ రోబోలను ఏర్పాటు చేసుకుని, వార్షిక ఇన్‌స్టాలేషన్ల పరంగా ప్రపంచంలో 6వ స్థానంలో నిలిచింది.

జాతీయ స్థాయిలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అక్టోబర్ 2023లో 'డ్రాఫ్ట్ నేషనల్ స్ట్రాటజీ ఆన్ రోబోటిక్స్'ను విడుదల చేసింది. అనంతరం ఫిబ్రవరి 2026లో Principal Scientific Adviser నేతృత్వంలోని టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్ భవిష్యత్ 'నేషనల్ రోబోటిక్స్ మిషన్' కోసం కన్వర్జెన్స్ ఆర్కిటెక్చర్‌ను ప్రతిపాదించింది. అయితే రోబోల తయారీకి అత్యంత కీలకమైన యాక్యుయేటర్లు, సెన్సార్లు, ట్రాన్స్‌డ్యూసర్లు, చిప్‌సెట్లు, ప్రెసిషన్ గేర్ల సరఫరా గొలుసులో తీవ్రమైన లోటుపాట్లు ఉన్నాయని నిపుణుల బృందం ఎత్తిచూపింది. ఈ లోటును భర్తీ చేస్తూ ఏపీని తయారీ కేంద్రంగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే డ్రోన్, స్పేస్, ఎలక్ట్రానిక్స్ తయారీ, సెమీకండక్టర్ అండ్ డిస్‌ప్లే ఫ్యాబ్, సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఐటీ అండ్ జీసీసీ పాలసీలతోపాటు 'అమరావతి క్వాంటమ్ వ్యాలీ' వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు అమలవుతున్నాయి. వీటి ద్వారా రాష్ట్రంలో సాంకేతిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

ఆయా పాలసీలన్నీ కేవలం వాటి నిర్దిష్ట ఉత్పత్తులు లేదా రంగాలకే పరిమితమయ్యాయి. రోబోట్ ప్లాట్‌ఫారమ్‌లు, రోబోటిక్స్ విడిభాగాలు, హార్డ్‌వేర్-ఇన్-ది-లూప్ టెస్టింగ్, రోబోటిక్స్‌కు ప్రత్యేకమైన మానవ వనరుల శిక్షణకు వాటిలో స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. ఈ కొరతను అధిగమించి, ఏపీని దేశంలోనే అగ్రగామి రోబోటిక్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఈ ప్రత్యేక రోబోటిక్స్ అండ్ ఫిజికల్ ఏఐ పాలసీ (2026-36)ని రూపొందించింది. ఈ పాలసీ అమలుతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, యువతకు అత్యాధునిక సాంకేతిక రంగాల్లో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks