డ్వాక్రా మహిళలకు శుభవార్త - మీకోసమే మరో కొత్త పథకం, రూ. 3 లక్షల వరకు రుణం, రాయితీ కూడా...!

AP DWCRA Women Scheme : ఏపీలోని కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. PMFME , స్త్రీనిధి అనుసంధానంతో సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. రూ.3 లక్షల వ్యయంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రుణాలతో పాటు సబ్సిడీ అందించనుంది. 

Published on: Aug 14, 2026, 14:02:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP DWCRA Women Scheme : రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ, ఉద్యోగాలు వెతుక్కునే స్థాయి నుంచి ఇతరులకు ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్) రంగాన్ని విస్తృతంగా ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్' (PMFME) పథకాన్ని, రాష్ట్రంలోని 'స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్'తో అనుసంధానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

డ్వాక్రా మహిళలకు శుభవార్త
డ్వాక్రా మహిళలకు శుభవార్త

ఈ కొత్త అనుసంధాన పథకం ద్వారా అర్హులైన ప్రతి డ్వాక్రా మహిళ గరిష్టంగా రూ.3 లక్షల అంచనా వ్యయంతో ఆహార శుద్ధి యూనిట్లను నెలకొల్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టులకు కావలసిన ఆర్థిక రక్షణను స్త్రీనిధి సంస్థ రుణ రూపంలో అందిస్తుంది. అదే సమయంలో PMFME పథకం కింద అందుబాటులో ఉండే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ కూడా నేరుగా లబ్ధిదారులకు వర్తిస్తుంది. దీనివల్ల డ్వాక్రా స్వయం సహాయక సంఘాల సభ్యులపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది.

ఏ ఏ వ్యాపారాలు ప్రారంభించవచ్చు..?

ఈ పథకంలో భాగంగా మహిళలు తమ ప్రాంతంలో సులభంగా లభించే ముడి సరుకులతో అనేక రకాల ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు.

  • పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్
  • చిరుధాన్యాలు (మిల్లెట్స్), పప్పుధాన్యాల ప్రాసెస్డ్ ఉత్పత్తులు
  • నాణ్యమైన మసాలాలు, సాంప్రదాయ పచ్చళ్లు
  • రకరకాల పిండి పదార్థాలు, పిండి వంటలు, స్నాక్స్ తయారీ

పథకం అమలు పారదర్శకంగా జరగడానికి ప్రతి జిల్లాలోని 'జిల్లా సమాఖ్యల'ను డిస్ట్రిక్ట్ రిసోర్స్ ఆర్గనైజేషన్స్ (DROs)గా వ్యవహరిస్తారు. ఈ సంస్థల ద్వారా వ్యాపార రంగంపై ఆసక్తి, స్వయం ఉపాధి సాధించే సామర్థ్యం ఉన్న డ్వాక్రా మహిళలను ప్రాథమికంగా గుర్తిస్తారు.

కేవలం రుణాలు ఇవ్వడమే కాకుండా, మహిళా పారిశ్రామికవేత్తలు తయారుచేసే ఉత్పత్తులకు సంబంధించి ముడిసరుకు సేకరణ, ఆధునిక ప్యాకేజింగ్, సరైన బ్రాండింగ్, మార్కెటింగ్ సౌకర్యాలను ప్రభుత్వం స్వయంగా కల్పిస్తుంది. వ్యాపారం లాభసాటిగా మారి, నిలదొక్కుకునే వరకు ప్రతి అడుగులోనూ ప్రభుత్వ తోడ్పాటు కొరవడదని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు.

"రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడంతో పాటు, ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రధాన ఆశయం. అర్హత కలిగిన డ్వాక్రా మహిళలందరూ ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకుని సొంతంగా ఎదుగుతూ… మరో పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరాలి" అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More