డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయాలి - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
అమూల్ బ్రాండ్ తరహాలోనే డ్వాక్రా ఉత్పత్తుల కోసం రూపొందించిన స్వయం బ్రాండ్‌ను తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అమూల్ తరహాలోనే సహకార విధానంలో ఈ ఉత్పత్తుల మార్కెటింగ్ జరగాలని కలెక్టర్ల సదస్సులో చెప్పారు.
అమూల్ బ్రాండ్ తరహాలోనే డ్వాక్రా ఉత్పత్తుల కోసం రూపొందించిన స్వయం బ్రాండ్‌ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో రెండు రోజుల పాటు జరగనున్న 6వ జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. తొలిరోజు చర్చలో భాగంగా వివిధ అంశాల్లో జరిగిన ప్రగతిని ఆయా శాఖలకు చెందిన అధికారులు ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అంశాల్లో కొన్ని కీలక సూచనలు చేశారు.

బ్రాండింగ్ పెంచాలి - సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...”డ్వాక్రా, మెప్మాలోని స్వయం సహాయ సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను స్వయం పేరిట బ్రాండింగ్ చేస్తున్నాం. దీని కోసం మహిళా దినోత్సవం రోజున లోగోను కూడా ఆవిష్కరించాం. మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీ ఉత్పత్తులకు ఎలాంటి బ్రాండింగ్ లభిస్తుందో... డ్వాక్రా ఉత్పత్తులకూ అదే స్థాయిలో బ్రాండింగ్ తెచ్చేలా కృషి చేస్తున్నాం. అమూల్ తరహాలోనే సహకార విధానంలో ఈ ఉత్పత్తుల మార్కెటింగ్ జరగాలి" అని సూచించారు.
"డ్వాక్రా మహిళలు తీసుకునే రుణాలను తప్పకుండా తిరిగి చెల్లిస్తారు. డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తాయి. ఇంతటి క్రెడిబులిటీ ఉన్న డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. బ్రాండ్ లేకపోతే ఉత్పత్తి విలువ సగానికి తగ్గిపోతుంది. గ్లోబల్ మార్కెట్టుకు చేరేలా డ్వాక్రా ఉత్పత్తుల ప్రమాణాలు పెరగాలి. ఈ ఉత్పత్తులకు ట్రేసబిలిటి, సర్టిఫికేషన్ కూడా ఉండేలా చూడాలి. 28 జిల్లాలు... 28 బ్రాండ్లను రూపొందించి పోటీని పెంచాలి. స్వయం బ్రాండ్ ఎస్టాబ్లిష్ కావాలంటే నాణ్యతా ప్రమాణాలే అత్యంత కీలకం” అని సీఎం వెల్లడించారు.
జిల్లా స్థాయిలో ఆర్టీజీఎస్ కేంద్రాలు….
“జిల్లా స్థాయిలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని ఉద్యోగుల పని తీరును విశ్లేషించుకోవాలి. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగానికీ కంప్యూటర్ అవగాహన తప్పనిసరి అర్హతగా చేర్చేలా సాధారణ పరిపాలన శాఖ చర్యలు తీసుకోవాలి. ప్రతి జిల్లాల్లో హెచ్ఆర్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా సిబ్బంది ఉద్యోగుల సామర్ధ్యాలను పెంపొందించుకోవచ్చు. ప్రణాళికా విభాగం ఆన్ లైన్ కోర్సులు తీసుకువచ్చినా ప్రాక్టికల్ నాలెడ్జి వచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి"అని సీఎం దిశానిర్దేశం చేశారు.
రైల్వే ప్రాజెక్టుల పరంగా నిధులకు సమస్య లేదని సీఎం చంద్రబాబు…. అభిప్రాయపడ్డారు. ఇచ్చాపురం నుంచి చెన్నై వరకూ 4 లేన్ల మార్గం చేస్తున్నారని గుర్తు చేశారు. అన్ని రైల్వే స్టేషన్లనూ ఆధునీకరించే ప్రక్రియను రైల్వే శాఖ చేపట్టిందని… దీనిని అందిపుచ్చుకోవాలని కలెక్టర్లకు సూచించారు.
“లాజిస్టిక్స్ డెవలప్మెంట్ పై ప్రధానంగా దృష్టి సారించాలి. లాజిస్టిక్స్ ప్రాజెక్టుల్లో భాగంగా పోర్టులు, ఎయిర్ పోర్టుల వద్ద పారిశ్రామిక టౌన్ షిప్‌లను అభివృద్ధి చేయాలి. ఎంఎస్ఎంఈ విధానం కింద లాజిస్టిక్స్ పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. ఒక్కో జిల్లాలో 5 ఎకరాల్లో హెలీపోర్టులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి, కేంద్రం దీనికి నిధులు ఇస్తుంది” అని సీఎం పేర్కొన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

