పోలవరం నిర్మాణం విషయంలో కేంద్రంతో నిరంతరం టచ్‌లో ఉండండి : సీఎం చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియచేయాలి సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణ నాణ్యతలో రాజీ లేదని స్పష్టం చేశారు. ప్రాధాన్యతల వారీగా ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టాలన్నారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో నాణత్య పాటించే అంశంపై రాజీ పడే ప్రసక్తే ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణాలు చేసే క్రమంలో ప్రజా భద్రత ముఖ్యమనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో చేపట్టాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంపై అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో సీఎం చంద్రబాబు సమీక్షించారు. పోలవరం, వెలిగొండ, హంద్రీ-నీవా, పోలవరం-నల్లమల సాగర్ లింక్, చింతలపూడి లిఫ్ట్, వరికపూడిశెల లిఫ్ట్, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల ప్రగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. వివిధ ప్రాజెక్టులకు చేపట్టాల్సిన పునరావాస పనులపైనా చర్చించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 'రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంతో ప్రాధాన్యమిస్తోంది. రకరకాల కారణాలతో రాష్ట్రంలో కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు సుదీర్ఘ కాలంపాటు ఎన్నికల హామీలుగా మిగిలిపోతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాకపోవడం సరికాదు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలి. ప్రాజెక్టులు కట్టాలనే డిమాండ్లు ఎన్నికల హామీలుగా మిగిలిపోకూడదు. ప్రజల అవసరాలను తీర్చేలా ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయాలి. అందుకే ప్రణాళికాబద్దంగా... ప్రాధాన్యతలను సిద్ధం చేసుకుని ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నాం.' అని చంద్రబాబు అన్నారు.
గత ప్రభుత్వంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ దెబ్బతినేలా చేశారని చంద్రబాబు అన్నారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు రిపేర్లు చేసినా సరిపోతుందని నిపుణులు నివేదికలు ఇచ్చినా.. నాణ్యత విషయంలో, ప్రజా భద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామన్నారు. పోలవరం నిర్మాణం విషయంలో కేంద్రంతో నిరంతరం టచ్‌లో ఉండాలని చంద్రబాబు అన్నారు. పోలవరం నిర్మాణానికి సంబంధించిన ప్రతి అప్డేట్ కేంద్రంలోని సంబంధిత వ్యవస్థలకు ఎప్పటికప్పుడు చేర్చాల్సిందేనని స్పష్టం చేశారు.
'ప్రమాణాలు, నాణ్యత పాటించే విషయం సహా నివేదికల పరంగా, సాంకేతికాంశాల పరంగా, డాక్యుమెంటేషన్ పరంగా ఎలాంటి లోపాలు ఉండకూడదు... తేడాలు రాకూడదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రం సహా ఎవ్వరూ వేలెత్తి చూపే పరిస్థితి రాకూడదు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు అంతర్జాతీయ స్థాయీ నిపుణులు తరుచూ సందర్శనకు వచ్చేలా చూడండి. వీలు కాకుంటే వీడియో కాన్ఫరెన్సుల ద్వారానైనా వారి సలహాలను స్వీకరించండి. చారిత్రత్మాక నిర్మాణాలు చేపడుతున్నప్పుడు.. జీవనాడి లాంటి ప్రాజెక్టులను చేపడుతున్నప్పుడు అదే స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రమాణాలు పాటించే విషయంలో చాలా కచ్చితంగా ఉంటాను.' అని చంద్రబాబు అన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై ప్రతి నెలా సమీక్షిస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అధికారులు, కాంట్రాక్టర్లు రిలాక్స్ కావడానికి వీల్లేదన్నారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు మేఘాద్రిగడ్డ వరకు పూర్తి కావాలని చెప్పారు. రైట్ మెయిన్ కెనాల్‌లో ఇంకా రూ. 200 కోట్ల మేర పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. వీటిని కూడా ఈ సీజన్లో పూర్తి చేయాలని తెలిపారు. 41.15 మీటర్ల వరకు నీళ్లను నిలిపేందుకు అవసరమైన నిర్మాణ, పునరావాస పనులు కంప్లీట్ కావాలన్నారు. పునరావాసం విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే... వెంటనే పరిష్కరించుకోవాలి. దీనికి అవసరమైన నిధులు, పరిపాలనా అనుమతుల విషయంలో జాప్యం చేయవద్దన్నారు.
'వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడానికి రూ. 2041 కోట్లు అవసరమవుతాయి. ఓవైపు ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతూనే.. మరోవైపు పునరావాసం పైనా ఫోకస్ పెట్టాలి. దీనికి అవసరమైన మేరకు విడతల వారీగా నిధులను విడుదల అయ్యేలా ఆర్థిక శాఖ అధికారులతో ఇరిగేషన్ అధికారులు సమన్వయం చేసుకోవాలి. హంద్రీ-నీవా ఫేజ్-1 కెనాల్ వైడనింగ్ 92 శాతం పూర్తి అయింది. కుప్పం-పుంగనూరు కాల్వలను 85 శాతం కంప్లీట్ చేసుకున్నాం. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. హంద్రీ-నీవా జలాలు మడకశిర వరకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. నీవా బ్రాంచ్ కెనాల్ ద్వారా చిత్తూరు వరకు నీటిని తీసుకెళ్లాల్సి ఉంటుంది.' అని చంద్రబాబు అన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper












