Andhrapradesh : డ్వాక్రా మహిళలకు శుభవార్త - మీ కోసమే కొత్తగా 2 ప్రభుత్వ పథకాలు..! ఒక్కొక్కరికి రూ.లక్ష

డ్వాక్రా సంఘాలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. వారి కోసం ప్రత్యేకంగా రెండు కొత్త పథకాలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే మార్చి నెలలో వీటిని ప్రారంభించే అవకాశం ఉంది.

Published on: Feb 17, 2026, 10:02:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డ్వాక్రా సంఘాల్లోని మహిళలను మరింత అండంగా ఉండేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. ఇటీవలే కాలంలో పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సమీక్షలు నిర్వహించారు. వారికి మరింత లబ్ధి చేకూర్చే అంశాలపై చర్చించారు. వారి పిల్లల విద్యకు ప్రభుత్వ పరంగా తోడ్పాటు కూడా అందిస్తామని స్పష్టం చేశారు. అయితే వారికోసం ప్రత్యేకంగా మరో 2 కొత్త పథకాలను ప్రారంభించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమవుతోంది. అయితే వీటిని మహిళా దినోత్సవం(మార్చి 8) సందర్భంగా ప్రారంభించాలని యోచిస్తోంది.

డ్వాక్రా మహిళలతో సీఎం చంద్రబాబు(ఫైల్ ఫొటో)
డ్వాక్రా మహిళలతో సీఎం చంద్రబాబు(ఫైల్ ఫొటో)

వచ్చే మార్చి 8వ తేదీ నాటికి సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ) ఏర్పాటై 25ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా పలు వరాలు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా డ్వాక్రా మహిళల కోసం రెండు పథకాలను అమలు చేయనుంది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మీ, ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మీ పేర్లతో పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది.

ఈ 2 పథకాల ద్వారా డ్వాక్రా మహిళల కుటుంబాల్లో చదువుకు, వివాహాలకు చేయూతనిస్తారు. స్త్రీనిధి బ్యాంకు ద్వారా డ్వాక్రా మహిళలకు రూ.లక్ష వరకు పావలా వడ్డీ రుణం ఇస్తారు. డ్వాక్రా సంఘాల్లో ఉన్న వారికి మాత్రమే ఈ స్కీమ్ లు వర్తింపజేస్తారు.

  • ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మీ పథకం : ఈ స్కీమ్ కింద డ్వాక్రా మహిళల కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహం కోసం రుణం తీసుకోవచ్చు. రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది. పావలా వడ్డీకి మాత్రమే ఈ రుణాలు పొందవచ్చు. ఈ రుణాన్ని 48వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. పెళ్లి కార్డు, పెళ్లి ఖర్చు అంచనాలను సమర్పించి… సులభంగా ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకునేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
  • ఎన్టీఆర్ విద్యాలక్ష్మీ పథకం: ఈ స్కీమ్ కింద డ్వాక్రా మహిళలు వారి పిల్లలకు చెల్లించాల్సిన స్కూల్, కాలేజీ ఫీజు కోసం డబ్బులు తీసుకోవచ్చు. ఇద్దరు పిల్లల చదువుకోసం రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం అందిస్తారు. వీటిని కేవలం పావలా వడ్డీకి పొందవచ్చు. ఇలా తీసుకున్న సొమ్మును 48 వాయిదాల్లో చెల్లిస్తే సరిపోతుంది. ఈ రుణం తీసుకునేందుకు డ్వాక్రా మహిళలు వారి పిల్లల అడ్మిషన్ లెటర్‌తో పాటుగా, ఫీజు చెల్లించే విధానం, విద్యా సంస్థ వివరాలు, ఇతర రసీదులు సమర్పించాల్సి ఉంటుంది.

ఇక ఇటీవలే సచివాలయంలో జరిగిన 233, 234వ ఎస్ఎల్బీసీ(బ్యాంకర్ల) సమావేశంలోనూ సీఎం చంద్రబాబు డ్వాక్రా లోన్లపై చర్చించారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసేందుకు సాకారం అందించాలని కోరారు. డ్వాక్రా గ్రూపు బ్యాంక్ ఖాతాలపై 15 రకాల ఛార్జీలు వేస్తున్నారని… బ్యాంకర్లు ఈ ఛార్జీలను తగ్గించాలని కూడా కోరారు. ఈ విషయంలో కూడా డ్వాక్రా మహిళలకు ఊరటనిచ్చేలా ఏపీ సర్కార్ కృషి చేస్తోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More