ఆగస్టు 7న నేతన్న సేవలో పథకం ప్రారంభం.. రూ.25,000 ఆర్థిక సాయం.. ఆగస్టు 5లోపు అప్లై చేయండి
అర్హులైన చేనేత కార్మికులకు ఏటా రూ.25,000 ఆర్థిక సహాయం అందించే నేతన్న సేవలో పథకం ఆగస్టు 7న ప్రారంభం కానుంది. బాపట్ల జిల్లాలోని చీరాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసేందుకు రెడీ అయింది. చేనేత వృత్తిపై ఆధారపడిన కుటుంబాలకు ఆర్థిక ఊరట కలిగించేందుకు ‘నేతన్న సేవలో’ పథకాన్ని త్వరలోనే ప్రారంభించనుంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 7న బాపట్ల జిల్లా చీరాల వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి ఏడాదికి రూ.25,000 ఆర్థిక సాయం నేరుగా అందనుంది. చేనేత రంగాన్ని పునరుద్ధరించడం, నేతన్నలు ఆత్మగౌరవంతో జీవించేలా చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.
‘నేతన్న సేవలో’ పథకం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై చేనేత, జ్యూట్ శాఖ మంత్రి ఎస్.సవిత సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జ్యూట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియాతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నేతన్నల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అర్హత కలిగిన నేతన్నలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అర్హులైన చేనేత కార్మికులు ఆగస్టు 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా తమ దరఖాస్తులను తప్పనిసరిగా సమర్పించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అప్పుడే ఆగస్టు 7న నేరుగా వారి ఖాతాల్లో ఆర్థిక సాయం జమ అవుతుందని తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు నేతన్నల లబ్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి వివరించారు. 50 ఏళ్లు దాటిన అర్హులైన చేనేత కార్మికులకు ‘ఎన్టీఆర్ భరోసా’ కింద నెలకు పింఛను సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.
చేనేత మగ్గాల నిర్వహణకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్‌లకు (Powerlooms) 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొ్న్నారు. అలాగే పొదుపు నిధి మద్దతు, ముద్రా రుణాలు వంటి ప్రయోజనాలను కూడా ప్రభుత్వం కల్పిస్తోందని ఆమె చెప్పారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు ప్రజల ప్రయోజనం కోసం అదనపు సంక్షేమ కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని సవిత తెలిపారు. చేనేత కార్మికుల జీవనోపాధిని మెరుగుపరచడానికి, వారు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నేతన్న సేవలో పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి వివరించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


