అమరావతి వర్సెస్ మావిగన్ : ఇప్పట్నుంచే 2029 ఎన్నికల వేడి..!

 రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ ఇప్పట్నుంచే సిద్ధమయ్యే పనిలో పడింది. ప్రధానంగా రాజధాని అమరావతికి ప్రత్యామ్నాయంగా 'మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు' (మావిగుణ్) కారిడార్‌ను రాజధానిగా అభివృద్ధి చేస్తామనే నినాదంతో ముందుకెళ్లే దిశగా అడుగులు వేస్తోంది. 

Published on: Jul 3, 2026, 15:40:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వ్యవహారం మళ్లీ తెరపైకి వస్తోంది. గత ఐదేళ్లుగా మూడు రాజధానుల చుట్టూ తిరిగిన ఏపీ రాజకీయం….. ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అంగీకరించే ప్రసక్తే లేదని వైసీపీ గట్టిగా చెబుతోంది. తాజాగా కూడా ఇదే విషయాన్ని ఆ పార్టీ అధినేత జగన్ కూడా ప్రస్తావించారు.రాబోయే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ సరికొత్త ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్తుందని కూడా ప్రకటించారు.

అమరావతి వర్సెస్ మావిగన్
అమరావతి వర్సెస్ మావిగన్

మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ 'మావిగన్' (Mavigun - Machilipatnam-Vijayawada-Guntur) కారిడార్‌ను కొత్త రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని జగన్ చెప్పుకొస్తున్నారు. ఇదే తమ ఎన్నికల నినాదమని స్పష్టం చేస్తున్నారు.

అమరావతి వర్సెస్ మావిగన్…!

ఇటీవలే మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్…. వచ్చే ఎన్నికలు కేవలం రెండు పార్టీల మధ్యే కాదు, రెండు భిన్నమైన రాజధాని ఆలోచనల మధ్య జరుగుతాయని పేర్కొన్నారు. "రాబోయే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అనే అంశంపైనే సాగుతాయి. మావిగన్ ప్రాంతాన్ని రాజధానిగా కోరుకునే వారు వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారు, అమరావతిని మాత్రమే కోరుకునే వారు టీడీపీ వైపు నిలుస్తారు. ప్రజల తీర్పు ఎలా ఉంటుందో మనమే చూద్దాం" అని జగన్ సవాల్ విసిరారు.

ఇటీవల వైఎస్సార్సీపీ బృందం అమరావతి ప్రాంతంలో పర్యటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. తమ పర్యటనను రాజధానికి వ్యతిరేకంగా చిత్రీకరించేందుకు కుట్రలు జరిగాయని జగన్ మండిపడ్డారు. అమరావతి పేరుతో సాగుతున్న భారీ అవినీతిని, అక్రమాలను బట్టబయలు చేయడమే తమ పర్యటన ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

జగన్ వ్యాఖ్యలే కాదు… వైసీపీ నేతలు కూడా మావిగన్ అంశాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ నినాదం ఇదే ఉంటుందని చెబుతున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమని గట్టిగా చెబుతున్నారు.

వైసీపీ మావిగన్ ప్రతిపాదనను కూటమి నేతలు కొట్టిపారేస్తున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ రాజధానిపై మళ్లీ కొత్త వివాదానికి తెరలేపుతున్నారని విమర్శిస్తున్నారు. అమరావతి అనేది కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ఏర్పడింది కాదని…. అది ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి, భవిష్యత్తు ఆకాంక్షలకు ప్రతీక చెప్పుకొస్తున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా… జగన్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు.

గతంలో అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు ప్రకటించిన జగన్…. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల డ్రామా ఆడారని, ఇప్పుడు విపక్షంలోకి రాగానే 'మావిగన్' అంటూ కొత్త రాగాన్ని అందుకుంటున్నారని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఇంటి పునాదులు మార్చినట్లుగా, రాజకీయ ప్రయోజనాల కోసం రాజధానిని మార్చడం సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు.

మొత్తంగా చూస్తే ఎన్నికలకు చాలా సమయం ఉండగానే…. వైసీపీ ఎన్నికల మూడ్ లోకి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా రాజధాని విషయంలో ఓ క్లారిటీతో ఉండాలని భావిస్తున్న ఆ పార్టీ…. మావిగన్ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. ప్రజామోదంతో అధికారంలోకి రావాలని చూస్తోంది. మరోవైపు అమరావతిలో పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా ఓవైపు అమరావతి…. మరోవైపు మావిగన్ నినాదాలే వచ్చే ఎన్నికల్లో కీలకంగా ఉంటుందనే చర్చ ఇప్పట్నుంచే మొదలైంది…!

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More