నేతన్న భరోసా, 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలు చేశారు.
అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనుల పురోగతి నుంచి ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనే ప్రణాళికల వరకు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

చేనేత కార్మికులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ‘నేతన్న భరోసా’ కింద ఏడాదికి రూ.25 వేల చొప్పున సహాయం అందించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 ఏళ్లలోపు ఉన్న బీపీఎల్ పరిధిలోని చేనేత కుటుంబాలకు ఈ ప్రయోజనం చేకూరనుంది.
రాష్ట్రంలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల అంశంపై మరిన్ని వివరాలతో సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ప్రతిపాదనలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించి, తదుపరి భేటీలో సమర్పించాక తుది నిర్ణయం తీసుకోనున్నారు.
బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
నేరడి బ్యారేజీ నిర్మాణ పనుల కోసం రూ.641.10 కోట్ల పరిపాలనా అనుమతులకు ఆమోదం లభించింది. అలాగే హంద్రీ-నీవా రెండో దశ పనుల అంచనా వ్యయాన్ని రూ.241.20 కోట్ల నుంచి రూ.312 కోట్లకు పెంచేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది.
గోదావరి పుష్కరాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్ల కోసం రూ.50 కోట్లు విడుదల చేసేందుకు ఆమోదముద్ర పడింది. శ్రీకాకుళంలో బ్రహ్మకుమారీస్ సంస్థకు మున్సిపల్ స్థల లీజు పొడిగింపునకు, వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు, ఏపీ మార్క్‌ఫెడ్ కోసం సెంట్రల్ బ్యాంక్ నుంచి రూ.300 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ సమ్మతించింది.
విష్ణు ఉమెన్స్ యూనివర్సిటీ, చలపతి యూనివర్సిటీలను ప్రైవేట్ విశ్వవిద్యాలయాల జాబితాలో చేర్చే అంశంపై మంత్రివర్గంలో చర్చ జరిగింది.
రాష్ట్రంలో ఎల్‌నినో వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా, పశువులకు తాగునీరు, మేత కొరత తలెత్తకుండా మంత్రులు, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎల్‌నినో హెచ్చరికలను, ప్రభుత్వం తీసుకుంటున్న ఉపశమన చర్యలను ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలని కోరారు.
మరోవైపు ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలతో మెగా డీఎస్సీ అంశాన్ని ముడిపెట్టి ప్రతిపక్ష వైసీపీ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తోందని, నిరాధార వివాదాలను సృష్టించే వారి కుట్రలపై మంత్రులు జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు.
పాలనలో మంత్రులు మరింత చురుగ్గా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. పొగాకు ధరల వంటి సున్నితమైన అంశాల్లో ప్రతిపక్షాలకు విమర్శలు చేసే అవకాశం ఇవ్వకుండా, ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలను ముందుగానే ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు, కలెక్టర్లు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
అనేక ఏళ్లుగా 22A నిషేధిత జాబితాలో ఉండి, ఇటీవల ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన భూముల అంశాన్ని ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలకు స్పష్టంగా వివరించాలన్నారు ముఖ్యమంత్రి. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) ఆమోదించిన ప్రాజెక్టులు, ప్లానింగ్ బోర్డు సమావేశాల నిర్వహణపై జిల్లాల వారీగా సమీక్షలు చేపడుతూ ప్రగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


