గోదావరి పుష్కరాలపై ఏపీ సర్కార్ ఫోకస్ - ఇప్పట్నుంచే ప్రణాళికలు..!
గోదావరి పుష్కరాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పట్నుంచే తగిన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్ విజయానంద్ సమీక్షించారు. అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు.
2027 జూన్ 26 నుండి జూలై 7వతేదీ వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేసే పనిలో పడింది. ఈ పుష్కరాలను విజయంవంతంగా నిర్వహించేందుకు ఆయా శాఖలు,జిల్లాల వారీగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.

సీఎస్ కీలక సమీక్ష….
గోదావరి పుష్కరాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యదర్శుల కమిటీ సమావేశం శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ విజయానంద్ అధ్యక్షతన జరింగింది.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గోదావరి పుష్కరాల సహ్నాహక ఏర్పాట్లకు సంబంధించి ఇది మొదటి ప్రాథమిక సమావేశం కావున ఇప్పటి నుండే తగిన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని అన్నారు.గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో మంతృల బృందాన్ని,కార్యదర్శుల బృందాన్ని ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ జి.వీరపాండ్యను ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందని తెలిపారు.
జిల్లా స్థాయిలో కూడా ఆయా శాఖల అధికారులతో జిల్లా కమిటీలను కూడా ఏర్పాటు చేసుకోవాలని సీఎస్ సూచించారు. ఎప్పటికప్పుడు పనుల పర్యవేక్షణకు చర్యలు తీసుకోవాలని కలక్టర్లకు దిశానిర్దేశం చేశారు.ఇప్పటినుండే ఆయా జిల్లాల వారీగా స్నాన ఘట్టాల వారీగా శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై మైక్రో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా స్నాన ఘట్టాలను గుర్తించడం,తాగునీరు,పారిశుద్ధ్యం,రవాణా,వైద్య శిబిరాలు,భద్రత,జనసమూహ నిర్వహణ,ట్రాఫిక్ నిర్వహణ,అత్యవసర సేవల సమన్వయం చేయడం వంటి అంశాలపై వివరణాత్మక డిపిఆర్ లను సిద్ధం చేసి పంపడం వంటి చర్యలు చేపట్టాలని కలక్టర్లను ఆదేశించారు.
అల్లూరి జిల్లాలో ప్రవేశించి…
మన రాష్ట్రంలో గోదావరి నది… అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రవేశించి ఏలూరు, తూర్పు గోదావరి,కాకినాడ,పశ్చిమ గోదావరి,అంబేద్కర్ కోనసీమ జిల్లాల మీదగా ప్రవహిస్తుంది. ఈ ఆరు జిల్లాల్లో వివిధ స్నాన ఘట్టాల వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేదుంకు తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని సీఎస్ విజయానంద్ సూచించారు. ముఖ్యంగా ఏఏ తేదీల్లో అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందో ఆతేదీల్లో జన సమూహ సమర్ధనిర్వహణకు తగిన ప్రణాళికు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా గోదావరి పుష్కరాలు జరగునున్నందున మహా కుంభమేళాలో ఏర్పాటు చేసిన విధంగా వివిధ ప్రాంతాలను గుర్తించి అక్కడ తాత్కాలిక టెంట్ సిటీలు ఏర్పాటు చేయాలని సీఎస్ పేర్కొన్నారు. అధిక సంఖ్యలో భక్తులకు తాత్కాలిక వసతి కల్పనకు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి ప్రతి జిల్లాల్లో జెసి స్థాయి అధికారిని ప్రత్యేకంగా ఇన్చార్జిగా నియమించాలని…..ప్రతి జిల్లాకు ఒక సవివర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయాలని సిఎస్ విజయానంద్ కలక్టర్లకు సూచించారు.
ఈసమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి హరి జవహరలాల్ పుష్కరాల ఏర్పాట్లపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించిన సందర్భంలో గోదావరి పుష్కరాలు జరుగుతాయని ఆప్రకారం 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకూ 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలను నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగిందని చెప్పారు. గోదావరి పుష్కరాలను దక్షిణ భారతదేశపు ప్రధాన కుంభమేళాగా పేర్కొంటారని అన్నారు.పు
పుష్కరాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు పాల్గొని గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించడం,తమ పూర్వీకుల పేరిట పిండ ప్రదానాలు,కర్మకాండలు నిర్వహించడం వంటివి నిర్వహిస్తారని వివరించారు.
గోదావరి నది అల్లూరి సీతారామ రాజు జిల్లా గుండాల వద్ద రాష్ట్రంలో ప్రవేశిస్తుందని అక్కడ మొదటి స్నానఘట్టం ఉంటుందని అన్నారు.గోదావరి పుష్కరాలకు సంబంధించి లోగోను రూపొందించాల్సి ఉందని ఇందుకు సంబంధించి త్వరలో విద్యార్ధులు,ప్రజల నుండి ఎంట్రీలు ఆహ్వానించి మంచి లోగోను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.గోదావరి నది వెంబడి ఎ కేటగిరికి సంబంధించి 36,బి కేటగిరి 48, సి కేటగిరి కింద 285 స్నాన ఘట్టాలున్నాయని చెప్పారు. గత 2015 గోదావరి పుష్కరాల్లో 1412 కోట్ల రూ.లతో 2వేల 529 వివిధ పనులను చేపట్టడం జరిగిందని వివరించారు.

E-Paper












