ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి పొరుగు రాష్ట్రంలో మద్యం మత్తులో నానాయాగి చేశాడు. చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, శాంతిభద్రతలను కాపాడే పోలీసుల పట్లే అత్యంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించి తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి చెందిన 'కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ' ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ బెంగళూరులో హంగామా చేయటం చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగిందంటే..?

బెంగళూరులోని రెసిడెన్సీ రోడ్డులో ఉన్న ‘కావూర్ పబ్’లో ఈ ఘటన చోటుచేసుకుంది. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ పబ్‌లో అర్ధరాత్రి వేళ పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పబ్‌లో ఉన్న ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ తీవ్ర మద్యం మత్తులో ఉన్నారు. తనిఖీలు చేయడానికి వచ్చిన కర్ణాటక పోలీసులను చూసి ఆయన ఒక్కసారిగా రెచ్చిపోయారు.
విధుల్లో ఉన్న పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర పదజాలంతో దూషిస్తూ…. వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. గొడవను సర్దుమణిగేలా గురిచేసేందుకు పోలీసులు యత్నించినప్పటికీ…. తాను ఒక ఉన్నతాధికారిననే అహంకారంతో పోలీసులపైకే దాడికి యత్నించినట్లు సమాచారం.
కేసు నమోదు….
శాంతిభద్రతల పరిరక్షణకు వచ్చిన పోలీసుల పట్ల అత్యంత అహంకారపూరితంగా వ్యవహరించి, వారి విధులకు తీవ్ర భంగం కలిగించిన వికాస్ మర్మత్ తీరుపై బెంగళూరు పోలీసులు చర్యలు చేపట్టారు. విధుల్లో ఉన్న అధికారులపై దాడికి యత్నించడం, అడ్డంకులు సృష్టించడం, బహిరంగ ప్రదేశంలో మద్యం మత్తులో వీరంగం వేయడం వంటి తీవ్ర ఆరోపణలపై బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
బాధ్యతాయుతమైన ఐఏఎస్ హోదాలో…. అదీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కుప్పం అభివృద్ధి అథారిటీ పీడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారి ఇలా ప్రవర్తించి క్రిమినల్ కేసు ఎదుర్కొనడం చర్చనీయాంశంగా మారింది.