...
...
Next Story

AP Medical Drone Delivery : కొండలు...కోనల్లో 'డ్రోన్ల' ద్వారా వైద్య సేవలు - ఫలిస్తున్న ప్రయత్నాలు

AP Medical Drone Delivery : అల్లూరి సీతారామరాజు జిల్లా మారుమూల గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా వైద్య పరీక్షల నమూనాలు, మందులు వేగంగా రవాణా చేస్తున్నారు. జనవరి 2026 నుంచి ఇప్పటివరకు 24,500 మందికి పైగా రోగులకు లబ్ధి చేకూరింది.

Published on: Aug 31, 2026, 06:02:30 IST
Advertisement

AP Medical Drone Delivery : గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవల కోసం పడే వేదనకు నూతన సాంకేతికత చెక్ పెడుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతాలు, ఎత్తైన కొండలు, సరైన రహదారి సౌకర్యాలు లేని గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలను వేగంగా చేరువ చేసేందుకు ప్రవేశపెట్టిన 'డ్రోన్ ఆధారిత వైద్య రవాణా వ్యవస్థ' అద్భుత ఫలితాలను ఇస్తోంది. గతంలో వైద్య పరీక్షలు లేదా అత్యవసర మందుల కోసం ఎన్నో మైళ్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ ఇబ్బందులను ఈ డ్రోన్ల వ్యవస్థ పూర్తిగా తొలగిస్తోంది.

4 డ్రోన్ల ద్వారా వైద్య సేవలు…..

డ్రోన్‌ ఆధారిత వైద్య రవాణా
డ్రోన్‌ ఆధారిత వైద్య రవాణా

జనవరి 2026లో ప్రారంభమైన ఈ సేవల్లో ఇప్పటివరకు 4 అధునాతన డ్రోన్లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. ఇవి ఇప్పటివరకు 1,800కు పైగా ట్రిప్పులను విజయవంతంగా పూర్తి చేశాయి. దాదాపు 71 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, 2,200కు పైగా వైద్య పరీక్షల నమూనాలను క్షేమంగా ల్యాబ్‌లకు చేరవేశాయి. వీటిలో 596 సికిల్‌సెల్ వ్యాధి పరీక్షల నమూనాలు ఉన్నాయి. ఈ సాంకేతికత ద్వారా 9,000కు పైగా వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం లభించడమే కాకుండా, 24,500 మందికి పైగా రోగులకు సమయానుకూలంగా సేవలు అందించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వివరించారు.

గిరిజన ప్రాంత ప్రజలకు ప్రాథమిక చికిత్స నుంచి మెరుగైన వైద్యం వరకు అందించేందుకు ఒక ప్రత్యేక డ్రోన్ నెట్‌వర్క్‌ను రూపొందించారు. పాడేరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) కేంద్రంగా లోతుగెడ్డ, తాజంగి, సుంకరమెట్ట, భీమవరం, అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), ముంచింగిపుట్టు సమాజ ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ), చింతపల్లి, అరకు ఏరియా ఆసుపత్రులను ఈ డ్రోన్ కనెక్టివిటీకి అనుసంధానించారు.

ఇటీవల ఆగస్టు 29న గన్నెల పీహెచ్‌సీ నుంచి ఆర్‌కే నగర్ గ్రామానికి వైద్య పరీక్షల నివేదికలు, కీలక వ్యాక్సిన్లు, అత్యవసర మందులను డ్రోన్ ద్వారా నేరుగా తరలించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఆదివారం అధికారులతో నిర్వహించిన సమీక్ష అనంతరం మంత్రి సత్యకుమార్ ప్రకటన విడుదల చేస్తూ…. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ మెడికల్ డ్రోన్ సేవలను ఇతర పల్లెలకు కూడా విస్తరిస్తున్నట్లు స్పష్టం చేశారు.

సాంకేతిక పరిజ్ఞానం కలసిరావడంతో వైద్య పరీక్షల నివేదికలు త్వరగా అందుతున్నాయి. దీంతో డాక్టర్లు రోగ నిర్ధారణ చేసి వెంటనే చికిత్స ప్రారంభించే వెసులుబాటు లభించింది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో తీవ్రంగా ఉండే సికిల్‌సెల్ అనీమియా వ్యాధి గుర్తింపు, స్క్రీనింగ్ పరీక్షలు, ప్రజా ఆరోగ్య కార్యక్రమాలకు ఈ విధానం ఎంతో తోడ్పడుతోంది. ఆసుపత్రులకు అవసరమైన నిల్వలను సకాలంలో చేర్చడం ద్వారా ప్రభుత్వ వైద్య సదుపాయాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోగలుగుతున్నారు.

సాంకేతికతను విస్తరించడమే కాకుండా, స్థానిక యువతకు దీని ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. డ్రోన్ నిర్వహణ, సహాయక సేవల విభాగంలో గిరిజనుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇప్పటివరకు 25 మందికి పైగా స్థానిక యువకులకు ప్రత్యేక సాంకేతిక శిక్షణ ఇప్పించినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మారుమూల ప్రాంతాలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని…. భవిష్యత్తులో ఈ మోడల్ మరిన్ని ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe