అక్టోబర్‌లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. డిసెంబర్‌లో పరీక్షలు
ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 2026లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 2026లో నియామక పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిపింది.
రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా అక్టోబర్ నెలలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు, డిసెంబర్ నెలలో పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు.

రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, శాప్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ భరణితో కలసి మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ-2025 నియామకాలపై మరొకసారి సమగ్ర వివరణ ఇచ్చారు. డీఎస్సీ-2025 నియామకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్లు, స్పోర్ట్స్ కోటా, దివ్యాంగుల కోటా అమలుపై కొంత మంది అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న సందేహాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
2024లో నోటిఫై చేసిన సుమారు 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తికాకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల మేరకు హారిజాంటల్ రిజర్వేషన్ల అమలులో పూర్తి చట్టబద్ధత, స్పష్టత, నిబంధనల అనుసరణను నిర్ధారించాల్సిన అవసరం ఏర్పడటంతో పాటు, టెట్–డీఎస్సీ ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించి అభ్యర్థులకు ఎటువంటి గందరగోళం లేకుండా పరిపాలనా సౌలభ్యాన్ని కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ రెండు అంశాల నేపథ్యంలో నియామక ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సి రావడంతో పోస్టుల భర్తీ ఆలస్యమైనట్లు ఆయన స్పష్టం చేశారు.
డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడిందని కోన శశిధర్ తెలిపారు. సిస్టమ్‌కు పరిమిత సంఖ్యలో మాత్రమే అధికారిక యాక్సెస్ ఉంటుందని, కేవలం ఇద్దరు నియమిత శాశ్వత ఉద్యోగులు మాత్రమే డేటా అప్‌లోడ్ చేసే అధికారం కలిగి ఉంటారని తెలిపారు. పాస్‌వర్డులు నిరంతరం మార్చబడుతూ ఉంటాయని, అనధికార ప్రవేశానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. అందువల్ల డేటా లీకేజీ లేదా పేపర్ లీకేజీకి ఎటు వంటి అవకాశం ఉందన్నారు.
డీఎస్సీ ఎంపికల్లో టెట్ మార్కులకు 20 శాతం, డీఎస్సీ మార్కులకు 80 శాతం వెయిటేజీ ఇచ్చి జనరల్ మెరిట్ లిస్ట్ రూపొందించినట్లు ఆయన తెలిపారు. టెట్ మార్కులను ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కాల్ లెటర్ రావడం అంటే అభ్యర్థి ఎంపికైనట్లుగా కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. హారిజాంటల్ రిజర్వేషన్లు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, అర్హత నిర్ధారణ తదితర అంశాల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఒక అభ్యర్థికి కాల్ లెటర్ వచ్చినప్పటికీ, వెరిఫికేషన్ సమయంలో అనర్హత తేలితే తదుపరి అభ్యర్థికి అవకాశం దక్కవచ్చని వివరించారు.
అభ్యర్థుల అభ్యంతరాల పరిష్కారం కోసం ప్రభుత్వం మూడు స్థాయిల్లో గ్రీవెన్స్ మెకానిజాన్ని ఏర్పాటు చేసినట్లు కోన శశిధర్ తెలిపారు. జిల్లా స్థాయి పరిశీలన, రాష్ట్ర స్థాయి కమిటీ, కమిషనర్ స్థాయి తుది పరిశీలనతో అభ్యర్థుల అభ్యంతరాల పరిష్కారించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రతి ఫిర్యాదును నిష్పాక్షికంగా పరిశీలించినట్లు ఆయన వెల్లడించారు.
స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలో ప్రభుత్వం అమలులో ఉన్న నిబంధనలు, జీఓల ప్రకారం పూర్తిస్థాయి పారదర్శకతతో ఎంపికలు నిర్వహించినట్లు రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జీఓ ఎంఎస్ నెం.4 ప్రకారం ఇంటర్-కాలేజియేట్ పోటీల్లో పాల్గొనడం లేదా సాధించిన విజయాలను ఉద్యోగాల కోసం అర్హతగా పరిగణించలేదని తెలిపారు. అయితే 2012 ఆగస్టు 9న జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం.74 ప్రకారం నిర్వహించిన గత నియామకాలలో ఇంటర్-కాలేజియేట్ పోటీలు, ఇంటర్-డిస్ట్రిక్ట్ పోటీలు, రూరల్ స్పోర్ట్స్, మహిళా క్రీడా ఉత్సవాలు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు వంటి విభాగాల్లో పాల్గొనడం లేదా పతకాలు సాధించడం కూడా ఉద్యోగ అర్హతకు పరిగణనలోకి తీసుకున్నట్లు వివరించారు. అదే విధానం 2019లో గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా చేపట్టిన సుమారు 1.20 లక్షల నియామకాలలో కూడా అమలులో ఉన్నట్లు ఆయన పేర్పొన్నారు.
ప్రస్తుత నియామకాల్లో జాతీయ క్రీడలు, జాతీయ ఛాంపియన్‌షిప్‌లు, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలు, సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలు, రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్‌లు, అంతర్జాతీయ స్థాయి పోటీలలో సాధించిన విజయాల ఆధారంగా మాత్రమే ప్రాధాన్యత కేటాయించినట్లు అజయ్ జైన్ తెలిపారు. డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 382 మంది అభ్యర్థులు ఎంపిక ప్రక్రియలో భాగమయ్యారని వెల్లడించారు. వీరిలో 22 మంది బంగారు పతక విజేతలు, 40 మంది రజత పతక విజేతలు, 43 మంది కాంస్య పతక విజేతలు, 275 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు ఉన్నారని తెలిపారు. ఖో-ఖో, బాల్ బ్యాడ్మింటన్, జూడో, సాప్టుబాల్, అథ్లెటిక్స్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, హాకీ తదితర 34 క్రీడా విభాగాలకు చెందిన క్రీడాకారులు ఈ ఎంపికల్లో భాగమయ్యారని వెల్లడించారు.
సమర్పించిన ప్రతి క్రీడా సర్టిఫికేట్‌ను స్క్రూటినీ కమిటీ, రాష్ట్ర స్థాయి కమిటీ, సంబంధిత క్రీడా సంఘాలు, యూనివర్సిటీలు, ఇతర అధికారిక రికార్డుల ద్వారా పరిశీలించి మాత్రమే అర్హత నిర్ణయించినట్లు అజయ్ జైన్ తెలిపారు. 1996 నుంచి 2025 వరకు జారీ చేసిన సర్టిఫికెట్లను కూడా ధృవీకరణలో భాగంగా పరిశీలించినట్లు పేర్కొన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


