...
...
Next Story

ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఏపీ ప్రకృతి వ్యవసాయం.. రాష్ట్రానికి ఫుడ్ ప్లానెట్ ప్రైజ్

ప్రపంచాన్ని ఏపీ ప్రకృతి వ్యవసాయం ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగానే ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ సాధించింది. ప్రకృతి వ్యవసాయంలో ఏపీకి విశిష్ట స్థానం దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.

Published on: Jun 3, 2026, 15:40:29 IST
Advertisement

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పర్యావరణ పురస్కారంగా గుర్తింపు పొందిన ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్–2026’ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం (APCNF)కు లభించడం రాష్ట్రానికే కాక దేశానికీ గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ అరుదైన అంతర్జాతీయ గుర్తింపుతో ప్రకృతి వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు.

ఏపీ ఫుడ్ ప్లానెట్ ప్రైజ్
ఏపీ ఫుడ్ ప్లానెట్ ప్రైజ్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, రాష్ట్ర ప్రభుత్వం చూపిన చిత్తశుద్ధి, రైతులు, గ్రామీణ మహిళల అంకితభావంతో కూడిన కృషికి ప్రపంచ వేదికపై లభించిన గౌరవమే ఈ పురస్కారమని మంత్రి వివరించారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు, గ్రామీణ మహిళలు, ప్రకృతి వ్యవసాయ ఉద్యమానికి అంకితభావంతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

కర్ట్ బర్గ్‌ఫోర్స్ ఫౌండేషన్ జూన్ 2న స్వీడన్‌లోని బస్తాద్ నగరంలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, రైతు సాధికార సంస్థ (RySS) కార్యనిర్వాహణ అధికారి తల్లం విజయ్ కుమార్ పాల్గొని ఈ అవార్డును స్వీకరించారు. ప్రపంచ ఆహార వ్యవస్థలో పర్యావరణ అనుకూల మార్పులకు దోహదపడుతున్న వినూత్న కార్యక్రమాలను గుర్తించి ఈ పురస్కారం అందజేసారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గనిర్దేశంలో దశాబ్దం క్రితం ప్రారంభమైన ప్రకృతి వ్యవసాయ ఉద్యమం నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అతిపెద్ద వ్యవసాయ పర్యావరణ కార్యక్రమాలలో ఒకటిగా ఎదిగిందని మంత్రి అన్నారు.

ప్రకృతి సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యవసాయ విధానాలను అమలు చేయడం ద్వారా వాతావరణ మార్పులు, పర్యావరణ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని APCNF నిరూపించిందని అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం రైతులకు అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయాన్ని అందించడమే కాకుండా నేల సారాన్ని పెంపొందించడం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించడం వంటి ప్రయోజనాలను అందిస్తోందని పేర్కొన్నారు.

అలాగే ప్రకృతి వ్యవసాయ శాస్త్రాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న 1,000 మందికిపైగా రైతు శాస్త్రవేత్తలు, మెంటార్లు, 700 మందికిపైగా రైతు పరిశోధకుల సేవలను ప్రత్యేకంగా గుర్తిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ విజయ ప్రయాణంలో వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ, క్షేత్రస్థాయి అధికారులు, శాస్త్రవేత్తలు, సిబ్బంది అందించిన సహకారం అమూల్యమని మంత్రి అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe