AP POLYCET 2026 Updates : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ (POLYCET-2026) ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ ఏడాది పాలిసెట్ పరీక్ష కోసం మొత్తం 1,77,581 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,63,008 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అంటే దాదాపు 92 శాతం మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు.

గత కొన్నేళ్లుగా డిప్లొమా కోర్సులకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా, ఈసారి కూడా పోటీ తీవ్రంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే హాజరు శాతం ఎక్కువగానే ఉంది. పరీక్ష ముగియటంతో కీలు, ఫలితాల విడుదలపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు.
ఏపీ పాలిసెట్ ప్రాథమిక కీని అధికారులు సిద్ధం చేస్తున్నారు. "పాలిసెట్ ప్రశ్నపత్రానికి సంబంధించిన ప్రాథమిక 'కీ'ని ఈ నెల 27న అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తాం," అని ఉన్నత విద్యా కమిషనర్ నారాయణ భరత్ గుప్తా వెల్లడించారు. అభ్యర్థులు ఈ కీని పరిశీలించి.... ఏవైనా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా తెలియజేయాల్సి ఉంటుంది.
మే 5న ఫలితాలు...
ఇక ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మే 5వ తేదీన పాలిసెట్ తుది ఫలితాలను వెల్లడించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. జూన్ నెలలో కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించి.... జూలై నాటికి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.
టెన్త్ క్లాస్ తర్వాత త్వరగా ఉపాధి పొందాలనుకునే వారికి పాలిటెక్నిక్ డిప్లొమా ఒక చక్కని మార్గం. మూడు సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసిన తర్వాత నేరుగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో (ECET ) చేరే అవకాశం ఉండటంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు పాలిసెట్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సుల్లో చేరేందుకు ఈ ర్యాంకు అత్యంత కీలకం.
ఏపీ పాలిసెట్ కీ - ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి
- ముందుగా https://polycetap.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని పాలిసెట్ ప్రాథమిక కీ లింక్ పైక్లిక్ చేయాలి.
- అన్ని సెట్లతో కూడిన పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కాపీని పొందొచ్చు.