ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సముద్ర రవాణా, పారిశ్రామిక ప్రగతిలో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. విస్తారమైన తీరప్రాంతం, లోతైన నౌకాశ్రయాలు, అందుబాటులో ఉన్న వేల ఎకరాల భూములను ఆసరాగా చేసుకుని రాష్ట్రాన్ని గ్లోబల్ షిప్‌బిల్డింగ్ (నౌకా నిర్మాణం), రిపేర్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అందుకోసం దక్షిణ కొరియా, జపాన్‌కు చెందిన అంతర్జాతీయ షిప్‌బిల్డింగ్ సంస్థలతో విస్తృత చర్చలు జరుపుతోంది.
కాకినాడ కేంద్రంగా భారీ క్లస్టర్

రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్‌ఫీల్డ్ ఓడరేవుల వద్ద నౌకా నిర్మాణం, మరమ్మతుల కోసం ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేయాలని రవాణా, రోడ్లు-భవనాలు, నియామకాలు, మౌలిక వసతుల శాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు.
"కాకినాడ కేంద్రంగా ఓ అంతర్జాతీయ యాంకర్ సంస్థ భాగస్వామ్యంతో భారీ షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌ను తీసుకురావాలని చూస్తున్నాం. స్వతంత్రంగా లేదా స్థానిక సంస్థతో భాగస్వామ్యం ద్వారా విదేశీ కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. 2027 నాటికి ఒక పెద్ద పెట్టుబడి ప్రకటన సాధిస్తామనే నమ్మకం ఉంది," అని కోన శశిధర్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ దిశగా పెట్టుబడి ఒప్పందాలను ఖరారు చేసుకునేందుకు త్వరలోనే దక్షిణ కొరియాలో మరో విడత చర్చలు జరపనున్నట్లు తెలిపారు.
గ్లోబల్ మార్కెట్లో భారత్ వాటా పెంపే లక్ష్యం
ప్రస్తుతం ప్రపంచ నౌకా నిర్మాణ రంగంలో చైనా 53 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, దక్షిణ కొరియా 30 నుంచి 35 శాతం వాటా కలిగి ఉంటే, భారత్ వాటా మాత్రం 1 శాతం కంటే తక్కువగానే ఉంది. ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించి, స్వదేశీ సామర్థ్యాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది.
"చైనా ప్లస్ వన్ వ్యూహం వల్ల దక్షిణ కొరియా, యూరప్‌లలోని నౌకా నిర్మాణ కేంద్రాలు 2036-37 వరకు ఆర్డర్లతో నిండిపోయాయి. ఈ పరిస్థితి భారత్‌కు గొప్ప అవకాశాన్ని ఇస్తోంది" అని శశిధర్ వివరించారు.
{{/usCountry}}"చైనా ప్లస్ వన్ వ్యూహం వల్ల దక్షిణ కొరియా, యూరప్‌లలోని నౌకా నిర్మాణ కేంద్రాలు 2036-37 వరకు ఆర్డర్లతో నిండిపోయాయి. ఈ పరిస్థితి భారత్‌కు గొప్ప అవకాశాన్ని ఇస్తోంది" అని శశిధర్ వివరించారు.
{{/usCountry}}భారత్‌లోని ఇతర తీరప్రాంత రాష్ట్రాలు కూడా ఈ దిశగా పోటీ పడుతున్నాయి. తమిళనాడులోని తూత్తుకుడిలో కొరియన్ కంపెనీ పెట్టుబడులు ఆఖరి దశకు చేరగా, మహారాష్ట్రలోని వధావన్ వద్ద భారీ పోర్ట్ రూపుదిద్దుకుంటోంది. గుజరాత్ తన పోర్ట్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ కొత్త కంటైనర్ టెర్మినల్స్, షిప్‌బిల్డింగ్ కాంప్లెక్స్‌లను నిర్మిస్తోంది.
1,053 కిమీ తీరం.. 18 మీటర్ల లోతు
ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం, మెరుగైన మౌలిక సదుపాయాలు, సమీపంలోనే లభించే ఉక్కు పరిశ్రమల మద్దతు గ్లోబల్ కంపెనీలను ఆకట్టుకుంటున్నాయి. 18 మీటర్ల లోతు (డ్రాఫ్ట్) ఉన్న ఓడరేవుల వల్ల భారీ నౌకలు సులభంగా రాకపోకలు సాగించే వీలుంది.
"కొత్తగా పోర్టులు నిర్మించాల్సిన పనిలేకుండా, కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ వాటర్లు, బెర్త్‌లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే పెట్టుబడిదారులు త్వరితగతిన తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఇదొక పెద్ద అనుకూలత" అని ఆయన పేర్కొన్నారు.
మరమ్మతుల కోసం ప్రత్యేక డ్రై డాక్‌లు
కాకినాడ గేట్‌వే పోర్ట్ వద్ద 5,700 ఎకరాలు, కృష్ణపట్నం వద్ద 5,500 ఎకరాలు, కాకినాడ పోర్ట్ పరిధిలో 2,000 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. కేవలం పెద్ద నౌకా నిర్మాణ కేంద్రాలే కాకుండా చిన్న పరిశ్రమల కోసం 100 నుంచి 150 మీటర్ల పొడవుండే డ్రై డాక్‌లను గ్రీన్‌ఫీల్డ్ పోర్టులలో నిర్మించనున్నారు. వీటిని చిన్న కంపెనీలకు లీజుకు ఇవ్వడం ద్వారా ఓడల రిపేర్లు, చిన్న నౌకల తయారీకి వీలు కలుగుతుంది. దీనివల్ల నిత్యం సరుకు రవాణా జరిగే ప్రధాన పోర్ట్ బెర్త్‌లపై భారం తగ్గుతుంది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల భారీ పెట్టుబడులు
రాష్ట్ర షిప్‌బిల్డింగ్ ప్రణాళికల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు) ఇప్పటికే భాగస్వాములవుతున్నాయి.
- గ్రేటర్ మచలీపట్నం వద్ద గోవా షిప్‌యార్డ్‌కు భూమి కేటాయించగా, వారు రూ. 8,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యారు.
- దుగరాజపట్నం వద్ద ప్రతిపాదించిన షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌లో మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ భాగస్వామ్యమైంది. ఇది కేంద్రం ఆమోదించిన తొలి షిప్‌బిల్డింగ్ క్లస్టర్ కావడం విశేషం.
- విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్ కూడా తన సామర్థ్యాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
స్కిల్ డెవలప్‌మెంట్, ఏపీ విజన్
నౌకా నిర్మాణ రంగానికి అవసరమైన మానవ వనరుల తయారీకి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్వాన్స్‌డ్ వెల్డింగ్, మెరైన్ టెక్నాలజీ కోర్సులను చేరుస్తున్నారు. దుగరాజపట్నం వద్ద ఐఐటీ మద్రాస్‌తో కలిసి ‘షిప్‌బిల్డింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటు చేసేందుకు చర్చలు సాగుతున్నాయి.
2027 నాటికి మూలపేట, మచలీపట్నం, రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్టులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కొత్త పోర్టుల నిర్మాణం కోసం రూ. 20,000 కోట్ల నుంచి రూ. 25,000 కోట్ల దాకా పెట్టుబడులు వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలోని పోర్టులు ఏటా 193 మిలియన్ టన్నుల సరుకు రవాణాను నిర్వహిస్తుండగా, 2029 నాటికి దీన్ని 350 మిలియన్ టన్నులకు పైగా పెంచాలనేది లక్ష్యం.
"రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ ఉండాలనేది మా విజన్. పోర్ట్ ఆధారిత పారిశ్రామికీకరణ ద్వారా ఆర్థిక వృద్ధి సాధించడమే మా వ్యూహం" అని కోన శశిధర్ ముగించారు.