...
...
Next Story

జడ్పీ ఎన్నికల సమరం సమాప్తం.. 27 జిల్లాల్లో కూటమి హవా.. సత్యసాయి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్‌

ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీ ఎన్నికల సమరం ముగిసింది. 27 జిల్లాల్లో కూటమి హవా చూపించగా.. ఒక జిల్లాలో మాత్రం వైసీపీ గెలుచుకుంది. మరోవైపు సత్యసాయి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

Published on: Nov 20, 2026, 17:20:25 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల రాజకీయాల్లో కీలక ఘట్టానికి తెరపడింది. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల ఎన్నికల ప్రక్రియ శుక్రవారంతో విజయవంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించి 27 జడ్పీ పీఠాలను కైవసం చేసుకోగా, ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే వైఎస్సార్‌సీపీ తన పట్టును నిలుపుకొంది. కొత్తగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం, పాలకమండళ్ల ఎన్నికను పూర్తి చేసి విజేతల వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా వెల్లడించింది.

సత్యసాయి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్‌ ప్రమాణస్వీకారం
సత్యసాయి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్‌ ప్రమాణస్వీకారం

రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లా పరిషత్‌లలో 27 స్థానాలను కూటమి పార్టీలు సొంతం చేసుకోవడంతో, రాష్ట్రవ్యాప్తంగా కొత్త పాలకమండళ్లు కొలువుదీరాయి. కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు ప్రకారం జడ్పీ పీఠాల పంపకాలు ఈ విధంగా జరిగాయి.

తెలుగుదేశం పార్టీ అత్యధికంగా 22 జిల్లాల్లో జడ్పీ ఛైర్మన్ పదవులను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన 4 జిల్లాల్లో జడ్పీ పీఠాలను దక్కించుకుంది. భారతీయ జనతా పార్టీ ఖాతాలో 1 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి చేరింది.

కూటమి క్లీన్ స్వీప్ ఆశలకు గండి కొడుతూ, గిరిజన ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో వైసీపీ జెండా ఎగురవేసింది. జిల్లాలోని 11 జడ్పీటీసీ స్థానాలకు గానూ 7 స్థానాలను గెలుచుకున్న వైసీపీ, జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంది. పెదబయలు జడ్పీటీసీగా గెలుపొందిన గిరిజన మహిళా నేత వంతల శాంతి అల్లూరి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్‌పర్సన్‌గా పాడేరు జడ్పీటీసీ సభ్యుడు సీదరి రాంబాబు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గెలుచుకున్న ఏకైక జడ్పీ పీఠం ఇదే.

శ్రీసత్యసాయి తొలి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నల్లచెరువు జడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన శ్రీరామ్, ప్రత్యర్థిపై భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. శ్రీసత్యసాయి జడ్పీ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా ధర్మవరం సీటును త్యాగం చేసిన శ్రీరామ్‌కు, తగిన గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో అధిష్టానం జడ్పీ ఛైర్మన్ పదవిని అప్పగించింది.

ఇప్పటికే ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న పరిటాల శ్రీరామ్‌కు జిల్లా స్థాయి కీలక పదవి దక్కడం ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీరామ్ ప్రమాణ స్వీకారంతో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, పరిటాల అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

మరోవైపు ఈసారి టీడీపీ తరఫున ఎన్నికైన జడ్పీ ఛైర్మన్లలో యువత, విద్యావంతులకు పెద్దపీట వేయడం విశేషం. విజయనగరం జడ్పీ ఛైర్‌పర్సన్‌గా మజ్జి సిరిసహస్ర, ఏలూరు జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె సాయి నవ్యశ్రీ వంటి యువ నేతలు బాధ్యతలు చేపట్టారు. నూతన పాలకమండళ్ల కొలువుదీరడంతో రాష్ట్రంలో జడ్పీ ఎన్నికల కోలాహలానికి పూర్తిస్థాయిలో తెరపడింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks