ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ 28 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ నూతన మ్యాప్‌ను విడుదల చేసిందని పేర్కొంటూ ఇటీవలే వార్తలు వైరల్ అయ్యాయి. చాలా ప్రసార మాధ్యమాలతో పాటు సోషల్ మీడియాలోనూ మ్యాప్ ఫొటోలు కనిపించాయి.
ఎలాంటి మ్యాప్ జారీ కాలేదు - విపత్తుల నిర్వహణ సంస్థ

ఈ వార్తలపై సోమవారం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పందించింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తరపున అటువంటి మ్యాప్ ఏదీ జారీ చేయలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అలాంటి సమాచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. తప్పుదోవ పట్టించేలా ఉన్న అలాంటి సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరింది.
APSDMA పేరు,లోగోతో షేర్ చేయబడుతున్న ఆ మ్యాప్ ప్రామాణికమైనది కాదని తెలిపింది. ప్రజలు, మీడియా సంస్థలు, సంబంధిత వర్గాలందరూ ఇటువంటి ధృవీకరించని సమాచారాన్ని షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. విపత్తుల సంస్థ జారీ చేసే అధికారిక సమాచారంతో పాటు ప్రచురణలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.
గతంలో ఏపీలో ఉన్న 26 జిల్లాలకు అదనంగా.. ఇటీవల మార్కాపురం, పోలవరం జిల్లాలుగా ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 28కి చేరింది.ఈ రెండు జిల్లాల సరిహద్దులను కూడా ప్రచారం చేయబడిన మ్యాప్‌లో పేర్కొన్నారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా పార్లమెంట్ లో బిల్లు పాస్ అయిన నేపథ్యంలో… ఈ ఫొటోను చాలా మంది షేర్ చేశారు. అయితే ఈ వార్తలు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ దృష్టికి వెళ్లటంతో… ఇవాళ ప్రకటన విడుదలైంది. తాము ఎలాంటి మ్యాప్ విడుదల చేయలేదని… ఇలాంటి వార్తలను నమ్మవద్దని కోరింది.