AP Police Recruitment 2026 : పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ తదితర కీలక విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. 2026 జాబ్ క్యాలెండర్‌లో భాగంగా ఈ భారీ నియామక ప్రక్రియను చేపడుతున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APSLPRB)…. మొత్తం 2,050 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేసింది.

మొత్తం 2,050 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రాగా… ఇందులో 438 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. సివిల్ విభాగంలో 253, ఆర్మ్‌డ్ రిజర్వ్‌లో 116, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 9, కమ్యూనికేషన్స్‌లో 50, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో 10 ఎస్‌ఐ పోస్టులు ఉన్నాయి.
ఇక 1,156 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో సివిల్ కానిస్టేబుల్స్ 542, ఆర్మ్‌డ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ 285, ఫైర్ అండ్ ప్రిజన్స్ విభాగాలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టులు: మొత్తం 438 ఎస్‌ఐ పోస్టులను విభిన్న విభాగాల్లో భర్తీ చేయనున్నారు.
- కానిస్టేబుల్ స్థాయిలో సివిల్, ఏఆర్, ఫైర్, జైళ్ల విభాగాల్లో కలిపి మొత్తం 1,156 పోస్టులను ఖరారు చేశారు.
- ప్రత్యేక కానిస్టేబుల్ విభాగంలో 413 పోస్టులను భర్తీ చేస్తారు.
- ఫొరెన్సిక్ విభాగంలో అర్హులైన నిపుణుల కోసం 43 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను ప్రకటించారు. అందులో ఫిజికల్ విభాగంలో 10, కెమికల్ విభాగంలో 13, బయోలాజికల్/సెరోలజీ విభాగంలో 20 పోస్టులు ఉన్నాయి.
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ( https://slprb.ap.gov.in/ ) ద్వారా మాత్రమే ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ ప్రారంభ తేదీలు, ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడిస్తామని రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్‌లో పేర్కొన్న వయోపరిమితి, విద్యార్హతలు మరియు ఇతర శారీరక ప్రమాణాల వివరాలను క్షుణ్ణంగా సరిచూసుకోవాలని సూచించారు.