...
...
Next Story

వర్షాలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వాయిదా పడుతున్నాయా? ఎస్ఈసీ క్లారిటీ

భారీ వర్షాలు, స్థానిక పరిస్థితులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సమీక్ష నిర్వహించారు. మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్టుగా చెప్పారు.

Published on: Nov 4, 2026, 16:16:01 IST
Advertisement

నవంబర్ 5న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, స్థానిక పరిస్థితులు, మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా. వర్షాల ప్రభావం, పోలింగ్ కేంద్రాల వద్ద నెలకొన్న పరిస్థితులు, రవాణా సౌకర్యాలు, ఎన్నికల సిబ్బంది సంసిద్ధత తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. చాలా జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయని, పరిమిత సంఖ్యలో కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల పోలింగ్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేవని కలెక్టర్లు నివేదించినట్లు వెల్లడించారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ సమీక్ష
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ సమీక్ష

వాతావరణ పరిస్థితులు, స్థానికంగా నెలకొన్న పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లకు సూచించినట్లు తెలిపారు. ఎక్కడైనా ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు ఎదురైతే క్షేత్రస్థాయి అధికారుల నుంచి వాస్తవ పరిస్థితులపై సమగ్ర నివేదికలు తెప్పించుకుని, వాటి ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్ఈసీ ఆదేశించారు. ముఖ్యంగా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఓటర్లు, ఎన్నికల సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.

రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి డా. ఏ. మల్లిఖార్జున మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో సుమారు 2,52,000 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎన్నికల విధుల నిర్వహణలో సిబ్బంది కొరత తలెత్తకుండా అవసరమైన సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం సుమారు 52,000 మంది సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు.

పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎదురయ్యే రవాణా, ఇతర స్థానిక సమస్యల పరిష్కారంపై కూడా సమీక్షించినట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వీడియోగ్రఫీని కేవలం బయటకే పరిమితం చేయకుండా, పరిస్థితులను బట్టి లోపల కూడా నిర్వహించాలని సూచించారు. అయితే ఓటు రహస్యానికి ఎలాంటి భంగం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన చోటుచేసుకున్నప్పుడు సంబంధిత ఘటనకు సంబంధించిన దృశ్యాలను తప్పనిసరిగా రికార్డు చేయాలని రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి ఆదేశించారు.

గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగి సుమారు 2.61 కోట్లకు చేరుకుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులు, ఎన్నికల సిబ్బంది ముందస్తు ప్రణాళికతో, క్షేత్రస్థాయిలో సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. మైక్రో లెవెల్ ప్లానింగ్‌తో ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి పిలుపునిచ్చారు.

డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలను ఎన్నికల కమిషనర్ మార్గదర్శకత్వంలో సమర్థవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. అదే తరహాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి మైక్రో లెవెల్ ప్లానింగ్ రూపొందించామని, క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సెక్టార్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ అవసరమైన మార్గదర్శకాలు అందిస్తున్నామని తెలిపారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఒకే దశలో నిర్వహిస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని డీజీపీ పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీని నియంత్రించడం, క్యూలైన్లను క్రమబద్ధీకరించడం, అవసరమైన చోట తగినంత పోలీసు బలగాలను మోహరించడం కీలకమని తెలిపారు.

పోలింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీజీపీ సూచించారు. పరిస్థితులకు అనుగుణంగా బలగాల మోహరింపును చేపట్టి ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,821 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వాటిలో 2,051 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ తెలిపారు. మిగిలిన 7,770 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ స్థానాల్లో మొత్తం 18,843 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టామని తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks