మీ టెన్త్ క్లాస్‌లో వివరాలు తప్పుగా ఉన్నాయా? విద్యార్థుల వివరాల సవరణ గడువు పొడిగింపు!
ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ (SSC) విద్యార్థుల వివరాల సవరణకు బోర్డు గడువు పొడిగించింది. హెచ్ఎమ్ లాగిన్ ద్వారా జూన్ 10, 2026 వరకు తప్పులను సరిచేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులకు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. మార్చి 2026లో జరిగిన ఎస్ఎస్‌సీ పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల వ్యక్తిగత వివరాలలో తప్పులను సరిదిద్దుకునేందుకు బోర్డు అవకాశం కల్పించింది. హెచ్ఎమ్ లాగిన్ ద్వారా ఈ కరెక్షన్లు చేసుకోవడానికి అభ్యర్థుల సౌకర్యార్థం గడువును జూన్ 10, 2026 వరకు పొడిగించినట్లు అధికారిక ప్రకటన వెలువడింది.

ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె. శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల వివరాలను (పేరు, పుట్టిన తేదీ, గ్రూపు, సబ్జెక్టులు, ఫోటో, సంతకం మొదలైనవి) క్షుణ్ణంగా పరిశీలించాలి.
ఏదైనా తప్పులు ఉంటే, నిర్ణీత గడువులోగా (జూన్ 10 లోపు) హెచ్ఎమ్ లాగిన్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనే సవరణలు పూర్తి చేయాలి. ఈ పొడిగించిన గడువు ముగిసిన తర్వాత ఎలాంటి సవరణల అభ్యర్థనలను బోర్డు స్వీకరించబోదని, కాబట్టి దీనిని చివరి అవకాశంగా భావించాలని ఆయన స్పష్టం చేశారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర సంబంధిత వర్గాలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని.. కేవలం ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ ను మాత్రమే సంప్రదించి, సరైన సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు.
బోర్డు పరీక్షల హాల్ టికెట్లు, మార్కుల జాబితాలలో తప్పులు దొర్లితే భవిష్యత్తులో ఉద్యోగ, ఉన్నత విద్యా అవకాశాల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి వివరాలను మీ పాఠశాల రికార్డులతో సరిచూసుకోండి. విద్యార్థి పేరు, ఇంటిపేరు, ఆధార్ మరియు అడ్మిషన్ రిజిస్టర్ ప్రకారం కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోండి. స్పెల్లింగ్ తప్పులు లేకుండా చూసుకోవాలి. పుట్టిన తేదీ ఇది అత్యంత కీలకం. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, మీడియం (తెలుగు/ఇంగ్లీష్) సరిగ్గా అప్‌డేట్ అయ్యాయా లేదా గమనించండి.
ఒకవేళ మీ వివరాల్లో ఏదైనా తప్పు ఉంటే, వెంటనే మీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి, జూన్ 10, 2026 లోపు ఆన్‌లైన్‌లో సవరించేలా చూసుకోండి.
పరీక్షలు ముగిసి ఫలితాలు వచ్చాక ఇచ్చే ఒరిజినల్ మార్కుల జాబితా ప్రింటింగ్‌కు వెళ్లే ముందు, బోర్డు డేటాబేస్‌లో ఉన్న వివరాలను స్కూల్ రికార్డులతో సరిపోల్చుకోవడానికి ఇదే ఆఖరి అవకాశం. పదో తరగతి ఫలితాలు వచ్చిన వెంటనే విద్యార్థులు ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా కోర్సుల్లో చేరాల్సి ఉంటుంది. అక్కడ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియలో టెన్త్ క్లాస్ డేటాబేస్ నుండే వివరాలను తీసుకుంటారు. ఒకవేళ టెన్త్ డేటాలో తప్పులు ఉంటే, ఇంటర్ కాలేజీ సీటు కేటాయింపులో లేదా స్కాలర్‌షిప్స్ సందర్భంగా ఇబ్బంది ఉంటుంది.
ఒక్కసారి ఒరిజినల్ మెమో ప్రింట్ అయి విద్యార్థి చేతికి వచ్చిన తర్వాత అందులో తప్పులు ఉంటే.. వాటిని మార్పించడం చాలా పెద్ద ప్రక్రియ. ఏమైనా ఇప్పుడే ఒకటికి రెండుసార్లు పదో తరగతి పత్రాలకు సంబంధించిన వివరాలను సరిచూసుకోవాలి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


