Tirumala Laddu : భక్తులకు పంపిణీ చేసేంతగా తిరుమలలో శ్రీవారి లడ్డూలు లేవా? టీటీడీ ఏం చెప్పింది?
Tirumala Laddu : శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి నెయ్యి నిల్వలకు కొరత లేదని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. తిరుమల లడ్డూలు సరిపోయేంత నెయ్యి నిల్వలు లేవని జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి నిల్వలు టీటీడీ వద్ద సమృద్ధిగా ఉన్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. ఇటీవల కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో టీటీడీ వద్ద నెయ్యి నిల్వలు లేవని, లడ్డూ ప్రసాదాల తయారీలో అంతరాయం ఏర్పడుతోందని అసత్య ప్రచారం చేయడం సరికాదని తెలియజేసింది.

శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి సరఫరా మూడంచెల కొనుగోలు విధానం ద్వారా జరుగుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఒకే సంస్థపై ఆధారపడకుండా మూడు వేర్వేరు సంస్థల ద్వారా నెయ్యి సరఫరా జరుగుతున్నందున ఎలాంటి అనుకోని పరిస్థితులు తలెత్తినా సరఫరాలో అంతరాయం కలగకుండా టీటీడీ ముందస్తు చర్యలు తీసుకుంటోంది.
ఈ క్రమంలో ఇందాపూర్ డైరీ నుండి తిరుమలకు వస్తున్న నెయ్యి ట్యాంకర్ ఇటీవల కడప జిల్లా కొండాపూర్ సమీపంలో ప్రమాదానికి గురైన విషయం నిజమేనని టీటీడీ క్లారిటీ ఇచ్చింది. అయితే ఒక సంస్థకు చెందిన ట్యాంకర్ ప్రమాదానికి గురైనంత మాత్రాన నెయ్యి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగలేదని స్పష్టం చేసింది. మిగిలిన రెండు సంస్థల నుండి నెయ్యి సరఫరా యథావిధిగా కొనసాగుతోందని తెలిపింది.
ప్రస్తుతం భక్తులకు పంపిణీ చేయడానికి సుమారు 7 లక్షల లడ్డూ ప్రసాదాలు సిద్ధంగా ఉన్నాయని టీటీడీ వెల్లడించింది. అందువల్ల లడ్డూ ప్రసాదాల తయారీ, పంపిణీ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందని భక్తులకు గుర్తుచేసింది.
అదేవిధంగా వేసవి కాలంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు దేవస్థానం బోర్డు పేర్కొంది. లడ్డూ తయారీకి సంబంధించిన పోటు విభాగంలో యంత్రాల నిర్వహణ, కన్వేయర్ బెల్ట్‌లు వంటి పరికరాల మరమ్మత్తులు సంబంధిత సంస్థల ద్వారా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
వాస్తవాలు ఇలా ఉండగా టీటీడీ వద్ద నెయ్యి నిల్వలు లేవని, శ్రీవారి కైంకర్యాలకు, లడ్డూ ప్రసాదాల తయారీకి ఆటంకం కలుగుతోందని అసత్య ప్రచారం చేయడం బాధాకరమని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఇటువంటి తప్పుదోవ పట్టించే ప్రచారాలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉన్నందున ప్రజలు, భక్తులు వాటిని నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లడ్డూ ప్రసాదాల తయారీ, పంపిణీ పూర్తిస్థాయిలో కొనసాగుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి స్పష్టం చేసింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


