'చంద్రబాబు గారూ... రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలితీసుకుంటారు..? వైఎస్ జగన్ ప్రశ్నాస్త్రాలు

కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురజాల నియోజకవర్గంలో మందా సాల్మన్‌ హత్యకు గురైన ఘటనపై మీరు ఏం సమాధానం చెప్తారు? అని ప్రశ్నించారు. రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలితీసుకుంటారని సీఎం చంద్రబాబుని నిలదీశారు.

Published on: Jan 16, 2026, 13:44:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త మందా సాల్మన్‌ హత్య ఘటనను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'చంద్రబాబు గారూ మీరు పాలించడానికి అర్హులేనా? రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలితీసుకుంటారు?' అని ప్రశ్నించారు.

వైసీపీ అధినేత జగన్
వైసీపీ అధినేత జగన్

ఇన్ని అరాచకాలకు పాల్పడతారా..? వైఎస్ జగన్

ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్‌బుక్‌ రాజ్యాంగం, పొలిటికల్‌ గవర్నెన్స్‌ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీ కక్షల పాలన ఫలితంగా ఒక పేదవాడు అయిన మందా సాల్మన్‌ హత్యకు గురైన ఘటనపై మీరు ఏం సమాధానం చెప్తారు? అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడ్డానికి సాల్మన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుప రాడ్లతో కొట్టి హత్యచేస్తారా? పైగా సాల్మన్‌పైనే తప్పుడు ఫిర్యాదు పెట్టిస్తారా? ఇలాంటి దారుణాలు చేయడానికా మీరు అధికారంలోకి వచ్చింది..?” అని జగన్ ప్రశ్నించారు.

"ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మీరు అజమాయిషీ చెలాయిస్తున్నారు. ఊళ్లో మీకు గిట్టని వారు ఉంటే చంపేస్తామని మీ వాళ్లు, మీ ఎమ్మెల్యే, మీ పోలీసుల బెదిరింపులతో పిన్నెల్లి గ్రామం నుంచి వందలకొద్దీ వైయస్సార్‌ కార్యకర్తల కుటుంబాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇదొక్కటే కాదు… అసెంబ్లీ ఎన్నికలు ముగిసింది మొదలు ఇలాంటి ఎన్నో ఘటనలు పల్నాడు సహా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సిగ్గులేకుండా మారణకాండను ప్రోత్సహించారు"అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు.

పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడ్డం మీ బాధ్యత కాదా..? అని వైఎస్ జగన్ నిలదీశారు. “అలాంటి బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు విఫలం చెందడం, పైగా మీరే మీ కక్షలకోసం శాంతిభద్రతలను దెబ్బతీసి హత్యారాజకీయాలకు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గమైన విషయం కాదా…? మీరు ముఖ్యమంత్రిగా ఉండి చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా..? చంద్రబాబుగారూ… హింసారాజకీయాలకు పాల్పడుతున్న మిమ్మల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు. తప్పకుండా ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఏది విత్తుతారో అదే రేపు పండుతుందన్నది ఎప్పుడూ మరిచిపోకూడదు. టీడీపీవారి చేతిలో హత్యకు గురైన సాల్మన్‌ కుటుంబానికి వైయస్సార్‌సీపీ అండగా ఉంటూ వారిని ఆదుకుంటుంది” అని జగన్ చెప్పారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More