రాజధాని నిర్మాణంపై వైఎస్ జగన్ కామెంట్స్...! అమరావతిపై వైసీపీ వైఖరి మారలేదా…..?
రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతగా మొదట్లో సమర్థించిన ఆయన.. ఆ తర్వాత 3 రాజధానులను తెరపైకి తీసుకొచ్చారు. తాజాగా ప్రతిపక్ష నేత హోదాలో నదీ గర్భంలో నిర్మాణం ఎలా చేస్తారంటూ కామెంట్స్ చేశారు. దీంతో అమరావతి విషయంలో వైసీపీ వైఖరి మరోసారి చర్చనీయాంశంగా మారింది.
“రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా లేదు. ప్రభుత్వం ఎక్కడ కూర్చుని పని చేస్తుంటే అదే రాజధాని. నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని నిర్మాణం సరికాదు. అమరావతి నిర్మాణం పేరుతో తొలి దశలో భూసమీకరణ కింద తీసుకున్న 50 వేల ఎకరాల్లో ఇప్పటికీ అభివృద్ధి పనులు చేయకుండా... రెండో దశలో 50 వేల ఎకరాలను ఎందుకు సమీకరిస్తున్నారు..? అమరావతి నిర్మాణం ఓ స్కామ్. చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కాజేసిన తర్వాతే రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారు” అంటూ తాజాగా వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా ఈ వ్యాఖ్యలే ఏపీ రాజకీయవర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మరోసారి రాజధాని అమరావతి విషయంలో వైసీపీ వైఖరి హాట్ టాపిక్ మారిపోయింది.

భిన్న ప్రకటనలు… !
రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వం కొత్త రాజధానిగా అమరావతి నిర్మాణం కోసం శ్రీకారం చుట్టింది. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్… కొత్త రాజధాని నిర్మాణానికి అనుకూలంగా ప్రకటన చేశారు. రైతుల సమస్యలను గళమెత్తుతూనే… భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాజధాని నిర్మాణం జరగాలని చెబుతూ వచ్చారు.అయితే ఎక్కడా కూడా బహిరంగా అమరావతిని వ్యతిరేకించలేదు.
సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చారు. కొన్ని రోజులపాటు అమరావతి విషయంలో సైలెంట్ గా ఉన్నప్పటికీ… ఆ తర్వాత ప్లాన్ మార్చేశారు. ఏకంగా రాష్ట్రానికి 3 రాజధానులు ఉంటాయని ప్రకటించారు. ఇందులో అమరావతి కూడా ఒకటిగా ఉంటుందని చెప్పుకొచ్చారు. న్యాయపరంగా చేయాల్సిన ప్రక్రియను కూడా పట్టాలెక్కించినప్పటికీ… రాజధాని రైతులు కేసులు వేయటంతో పాటు న్యాయస్థానాల్లోనూ అనుకూలమైన తీర్పులు రాకపోవటంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఓ రకంగా 3 రాజధానుల పేరుతో ఐదేళ్ల కాలం గడిచిపోయింది.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విక్టరీ సాధించింది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైపోయింది. వైసీపీ ఓటమిపై రాజధాని అంశం బలమైన ప్రభావం చూపిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని సొంత పార్టీ నేతలు కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత 3 రాజధానుల విషయంలో వెనక్కి తగ్గినట్లు కనిపించింది. తాము కూడా అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామనే ప్రకటనలు కూడా వచ్చాయి. కానీ గురువారం మీడియాతో మాట్లాడిన జగన్… మళ్లీ పాత రాగాన్నే అందుకున్నట్లు అనిపించింది.
అమరావతిని నదీగర్భంలో కడుతున్నారంటూ జగన్ విమర్శలు గుప్పించారు. రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని గుర్తు చేశారు. కానీ, ఇప్పటికీ తొలి దశలో భూములిచ్చిన రైతులకు ఏ హామీలను అమలు చేయలేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు రివర్ బేసిన్‌లో రాజధాని కడుతున్నారని… దీనిపై సుప్రీంకోర్టు దృష్టిపెట్టాలని కోరారు. విజయవాడ–గుంటూరు మధ్య జాతీయ రహదారికి సమీపంలో రాజధాని నిర్మించి ఉంటే ఈ పాటికే మహానగరంగా అభివృద్ధి చెందేదని అభిప్రాయపడ్డారు.
తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతలతో పాటు క్యాడర్ కూడా కాస్త కన్ఫ్యూజన్ లోనే ఉండే అవకాశం ఉంది. జగన్ చేసిన తాజా వ్యాఖ్యలతో అమరావతి విషయంలో ఇంకా పాత నిర్ణయానికే వైసీపీ కట్టుబడి ఉందా అన్న చర్చ మళ్లీ తెరపైకి వస్తోంది.ఒకసారి రాజధానికి అనుకూలమని , మరోసారి 3 రాజధానులుండాలని…మళ్ళీ అవునని, ఇప్పుడు మునిగిపోతుందని చెప్పడం చూస్తుంటే వైసీపీ వైఖరిలో స్పష్టత కొరవడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

