ఏపీలో పశువుల రవాణా చేస్తున్నారా? ఈ కొత్త డిజిటల్ రూల్ తెలుసుకోకపోతే ఇబ్బందే!

Cattle Transport : పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు డిజిటల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్టిఫికెట్‌ వ్యవస్థను మెుదలుపెట్టింది ప్రభుత్వం. ఆన్‌లైన్‌ ద్వారా ఇది జారీ చేస్తుంది.

Updated on: Mar 09, 2026 7:11 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి, జంతువులపై హింసను నిరోధించడానికి ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా పశువుల కదలికపై పారదర్శకత, కఠినమైన పర్యవేక్షణ కోసం డిజిటల్ రవాణా సర్టిఫికేట్ జనరేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.

జంతువుల రవాణాకు కొత్త రూల్
జంతువుల రవాణాకు కొత్త రూల్

జంతువుల రవాణా పేరుతో చాలా కాలంగా ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి. పశువులను తరచుగా పెద్ద సంఖ్యలో లారీలలోకి లాక్కెళ్లడం, కఠినంగా వ్యవహరించడం, కొన్నిసార్లు కాళ్ళు విరగడం వంటివి జరుగుతుంది. జంతువుల రవాణా నియమాలు, 2001 ప్రకారం ఒక లారీలో గరిష్టంగా 12 పశువులను రవాణా చేయవచ్చు. అయితే వాహనం పరిమాణాన్ని బట్టి సంఖ్య ఆరు నుండి పది వరకు ఉండవచ్చు. ఈ నిబంధనలు విస్మరిస్తుంటారు.

జంతు సంక్షేమం కోసం అనేక నియమాలు ఉంటాయి. రవాణా చేసిన జంతువులు ఆరోగ్యంగా ఉండాలి, అంటు వ్యాధులు లేకుండా ఉండాలి, గాయపడిన, వ్యాధితో ఉన్న, అంధత్వం ఉన్న, అలసిపోయిన లేదా అప్పుడే పుట్టిన జంతువులను రవాణా చేయకూడదు. ప్రసవానికి దగ్గరగా ఉన్న జంతువులు, 72 గంటలలోపు జన్మనిచ్చిన జంతువులను కూడా రవాణా నుండి నిషేధించారు. చిన్న జంతువులను పెద్ద పశువులతో కలపకూడదని, వివిధ జంతువులను కలిసి రవాణా చేయకూడదని నియమాలు చెబుతున్నాయి. జంతువులను తీసుకెళ్లే వాహనాలు 'Animal Carrier' బోర్డును ప్రముఖంగా ప్రదర్శించాలి. ప్రయాణంలో తగినంత స్థలం, మేత, నీటిని అందించాలి.

ప్రస్తుతం జంతువుల రవాణా నిబంధనలలోని నిబంధన 96 ప్రకారం పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవాణా అనుమతులను మాన్యువల్‌గా జారీ చేస్తారు. ఈ ధృవపత్రాలు కాలపరిమితితో కూడినవి, తారుమారుకి గురయ్యే అవకాశం కూడా ఉంది. జంతువుల సంఖ్య, రవాణా ప్రయోజనంలో ఫోర్జరీ, ట్యాంపరింగ్ కేసులు సైతం ఉన్నాయి.

ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆ శాఖ డిజిటల్ సర్టిఫికేషన్ వ్యవస్థను ప్రారంభించింది. ఇది రవాణా అనుమతులను ఆన్‌లైన్‌లో జారీ చేస్తుంది. ప్రతి సర్టిఫికెట్‌లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇది ట్యాంపర్ ప్రూఫ్‌గా, ఫోర్జరీ అవకాశాన్ని తొలగిస్తుంది. సంబంధిత అధికారుల ధృవీకరణ తర్వాతే పశువుల రవాణా అవుతాయి.

కొత్త డిజిటల్ సర్టిఫికెట్‌లో వ్యవసాయం, డ్రాఫ్ట్ పని, పాలు పితికడం, సంతానోత్పత్తి లేదా వధ కోసం ఇలా రవాణా ఉద్దేశం, వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఎక్కడ నుంచి ఎక్కడకు తీసుకెళ్తున్నారు?, రవాణా వ్యవధి, డ్రైవర్ పేరు, చిరునామా వంటి వివరాలు ఉంటాయి. సర్టిఫికెట్‌లో ఎవరు, ఎవరికి పంపిస్తున్నారనే డీటెయిల్స్ కూడా ఉంటాయి. దీనివల్ల అధికారులు పశువుల కదలికను మరింత సమర్థవంతంగా ధృవీకరించడానికి వీలు కల్పిస్తుంది.

అధికారుల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ నుండి ఏటా దాదాపు మూడు లక్షల పశువులను వివిధ ప్రయోజనాల కోసం తమిళనాడు, కేరళ, హైదరాబాద్ వంటి పొరుగు ప్రాంతాలకు రవాణా చేస్తారు. ఇప్పుడు సర్టిఫికేట్ జారీ చేయడానికి ఒక్కో జంతువుకు రూ. 50 రుసుము వసూలు చేస్తారు. సర్వర్, నిర్వహణ ఖర్చులను చూసుకుని.. మిగిలిన మొత్తాన్ని జంతు సంక్షేమ కార్యక్రమాల మద్దతు కోసం ఏపీ జంతు సంక్షేమ బోర్డుకు బదిలీ చేస్తారు.

ఇప్పుడు తీసుకొచ్చిన డిజిటల్ ట్రాన్స్‌పోర్ట్ సర్టిఫికేట్‌తో అక్రమంగా పశువుల తరలింపును అరికట్టడం, రవాణా సమయంలో జంతువులకు మెరుగైన రక్షణ వంటి అంశాల మీద క్లారిటీ వస్తుంది. అంతేకాదు జంతువుల రవాణా డేటా రవాణా, పోలీసు డిపా‌ర్ట్‌మెంట్‌లకు అందుబాటులో ఉంటాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More