జులై నుంచి సెప్టెంబర్ మధ్యలో తిరుమల వెళ్తున్నారా? శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్

జులై, సెప్టెంబర్ నెలలో తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాల రద్దు వివరాలను వెల్లడించింది.

Published on: Jul 8, 2026, 14:09:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జులై నెల నుండి సెప్టెంబ‌ర్ 30వ తేది వ‌ర‌కు వివిధ ప‌ర్వదినాలు, ఉత్సవాల‌ను పుర‌స్కరించుకుని శ్రీ‌వారి ఆల‌యంలో బ్రేక్ ద‌ర్శనాలు పలు తేదీల్లో ర‌ద్దు అవుతున్నాయి. ఆ వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. బ్రేక్ ద‌ర్శనాలు ర‌ద్దైన తేది వివరాలు కింది విధంగా ఉన్నాయి.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

జులై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం.

జులై 17న‌ ఆణివార ఆస్థానం.

జులై 19న శ్రీ ఆండ‌వ‌న్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మ‌ర్యాద‌.

జులై 29న జీయ‌ర్ స్వాముల చాతుర్మాస సంక‌ల్పం.

ఆగ‌స్టు 22న ప‌విత్రోత్సవాల‌కు అంకురార్పణ‌.

ఆగ‌స్టు 24న ప‌విత్రోత్సవాల రెండో రోజు సంద‌ర్భంగా ప‌విత్రాల స‌మ‌ర్పణ‌.

సెప్టంబ‌ర్ 8న శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం.

సెప్టంబ‌ర్ 14న శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల‌కు అంకురార్పణ‌.

సెప్టంబ‌ర్ 15 నుండి 23వ తేది వ‌ర‌కు శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలు.

పై తేదిల‌కు సంబంధించి ముందు రోజు తిరుమ‌ల‌లో ప్రోటోకాల్ ప్రముఖుల‌కు మిన‌హా వీఐపీ సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌రు. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని భ‌క్తులు త‌మ తిరుమ‌ల యాత్రకు ప్ర‌ణాళిక రూపొందించుకోవాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది.

ప్రతి రెండు నిమిషాల‌కు ఒక ఎల‌క్ట్రిక్ బ‌స్సు

రిల‌య‌న్స్ సంస్థ టీటీడీకి 25 ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను విరాళంగా ఇస్తుండ‌టంతో ఛార్జింగ్ స్టేష‌న్ ఏర్పాటు, ప‌వ‌ర్ సప్లై, డ్రైవ‌ర్ల నిర్వహ‌ణ, వివిధ మౌలిక స‌దుపాయాల ఏర్పాటుపై రిల‌య‌న్స్ సంస్థ ప్రతినిధుల‌తో తిరుమ‌ల‌లోని ప‌ద్మావ‌తి అతిథి గృహంలోని సుధ‌ర్మ స‌మావేశ మందిరంలో టీటీడీ అద‌న‌పు ఈవో సి.హెచ్.వెంక‌య్య చౌద‌రి స‌మావేశం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రిల‌య‌న్స్ సంస్థ విరాళంగా అందిస్తున్న ఎల‌క్ట్రిక్ బ‌స్సులను భ‌క్తుల‌కు పూర్తిస్థాయిలో ఉప‌యోగ‌ప‌డేలా చ‌ర్యలు చేప‌ట్టాల‌న్నారు. బ్రహ్మోత్సవాల నాటికి పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. ప్రస్తుతం టీటీడీ న‌డుపుతున్న 15 బ‌స్సుల‌తో పాటు అద‌నంగా మ‌రో ప‌ది బ‌స్సుల కోసం మొత్తం 50 బ‌స్సుల సామ‌ర్థ్యంతో ఛార్జింగ్ స్టేష‌న్ ఏర్పాటు చేసి ఒకేసారి 20 బ‌స్సులు ఛార్జింగ్ అయ్యేలా 10 ఛార్జింగ్ పాయింట్లను అందుబాటులో ఉంచాల‌ని రిల‌య‌న్స్ బృందాన్ని కోరారు. 10×30 చ‌ద‌ర‌పు అడుగుల వైశాల్యం క‌లిగిన ఒక్కో బ‌స్సులో 50 మంది సుర‌క్షితంగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేయాల‌ని చెప్పారు.

బ‌స్సులు త్వరగా ఛార్జింగ్ అయ్యేందుకు వీలుగా 2 మెగా వాట్ల సామ‌ర్థ్యం క‌లిగిన ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాల‌న్నారు వెంకయ్య చౌదరి. బ‌స్సులను న‌డిపేందుకు 50 మంది నిపుణులైన డ్రైవ‌ర్లను సిద్ధం చేసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్రతి రెండు నిమిషాల‌కు ఒక బ‌స్సు అందుబాటులో ఉండేలా ఒక షిఫ్టుకు 25 బ‌స్సుల లెక్కన‌ రెండు షిఫ్టుల్లో 50 బ‌స్సులు తిప్పేలా చ‌ర్యలు చేప‌ట్టాల‌ని చెప్పారు.

బ‌స్సుల పార్కింగ్ కోసం త‌గిన స్థలాన్ని గుర్తించి రిల‌య‌న్స్ సంస్థ ప్రతినిధుల‌తో చ‌ర్చించి త్వరిత‌గ‌తిన పూర్తిస్థాయి ఛార్జింగ్ స్టేష‌న్ అందుబాటులోకి వ‌చ్చేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. అదేవిధంగా బ‌స్సులో అధునాత‌న ప్రయాణికుల స‌మాచార వ్యవ‌స్థను ఏర్పాటు చేసి రాబోయే బ‌స్టాప్ ల వివ‌రాలు భ‌క్తుల‌కు తెలిసేలా చ‌ర్యలు చేప‌ట్టాల‌ని తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More