Electric scooters : 150 కి.మీ రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్- ధర కూడా తక్కువే!
Komaki MG Pro plus : భారత ఈవీ మార్కెట్లోకి కొమాకి సంస్థ ఎంజీ ప్రో వీ, ఎంజీ ప్రో ప్లస్ పేర్లతో రెండు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టింది. ధృడమైన మెటల్ బాడీ, 150 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఈ స్కూటర్ల ప్రారంభ ధర, ఫీచర్ల వివరాలు ఇవే..
భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ల హవా నడుస్తోంది. పెట్రోల్ ధరల భారం నుంచి తప్పించుకోవడానికి మధ్యతరగతి వాహనదారులు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే మార్కెట్లో ఉన్న చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఫైబర్ బాడీతో రావడం వల్ల చిన్న ప్రమాదం జరిగినా ప్యానెల్స్ విరిగిపోయి భారీగా ఖర్చవుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ‘కొమాకి’ సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. మధ్యతరగతి బడ్జెట్‌కు సరిపోయేలా, అత్యంత ధృడమైన బాడీతో రెండు సరికొత్త స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

కొమాకి సంస్థ భారత మార్కెట్లో ‘ఎంజీ ప్రో వీ’, 'ఎంజీ ప్రో ప్లస్' అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను అధికారికంగా విడుదల చేసింది. రూ. 73,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభించే ఈ ఈ-స్కూటర్లు బడ్జెట్ పరిధిలోనే ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి.
మెటల్ బాడీయే ప్రధాన ఆకర్షణ!
ప్రస్తుతం విక్రయాల్లో ఉన్న మెజారిటీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్లాస్టిక్ లేదా ఫైబర్ బాడీతో వస్తున్నాయి. కానీ కొమాకి తన కొత్త సిరీస్ వాహనాలకు పూర్తి మెటల్ బాడీని అందించింది. దీనివల్ల వాహనానికి అదనపు రక్షణ లభించడమే కాకుండా, ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. తక్కువ బడ్జెట్‌లో బలమైన స్కూటర్ కావాలనుకునే భారతీయ కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీటిని డిజైన్ చేశారు.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్ ఎంత? బ్యాటరీ విశేషాలు ఇవే..
రోజువారీ ప్రయాణాలతో పాటు లాంగ్ సిటీ రైడ్స్‌కు సరిపోయేలా ఈ స్కూటర్ల రేంజ్ ఉంది. బేస్ వేరియంట్ అయిన కొమాకి ఎంజీ ప్రో వీ సింగిల్ ఛార్జ్‌పై 90 నుంచి 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇక టాప్ వేరియంట్ కొమాకి ఎంజీ ప్రో ప్లస్ ఏకంగా 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.
ఈ రెండు ఈవీల్లో సమర్థవంతమైన బీఎల్డీసీ హబ్ మోటార్‌ను వాడారు. వీటికి తోడు అత్యాధునిక ‘లిథియం ఐరన్ ఫాస్ఫేట్’ బ్యాటరీలను అమర్చారు. మార్కెట్లో దొరికే సాధారణ ఈవీ బ్యాటరీలతో పోలిస్తే ఈ లైఫ్‌పో4 బ్యాటరీలు ఎక్కువ కాలం మన్నుతాయి, పైగా చాలా సురక్షితమైనవి.
డిజిటల్ ఫీచర్లు.. అధునాతన టెక్నాలజీ!
కొత్త తరం వాహనదారులను ఆకట్టుకునేలా ఈ స్కూటర్లలో మొబైల్ యాప్ కనెక్టివిటీని ఇచ్చారు. స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా బ్యాటరీ హెల్త్, స్కూటర్ రేంజ్ వంటి వివరాలను ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు.
సురక్షితమైన ప్రయాణం కోసం ముందు భాగంలో డిస్క్ బ్రేక్, టెలిస్కోపిక్ సస్పెన్షన్ అందించారు. వీటితో పాటు యాంటీ-థెఫ్ట్ లాక్, పార్కింగ్ అసిస్ట్, అత్యవసర సమయాల్లో ఉపయోగపడే 'రిపేర్ స్విచ్' వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. టాప్ మోడల్ అయిన కొమాకి ఎంజీ ప్రో ప్లస్ వేరియంట్‌లో సీటు కింద ఎక్కువ లగేజ్ పెట్టుకోవడానికి వీలుగా పెద్ద బూట్ స్పేస్‌ను కేటాయించారు.
"భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. అయితే తక్కువ ధరలో వస్తున్నాయి కదా అని నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. అందుకే ప్రీమియం కార్లలో, ఖరీదైన ఈవీల్లో మాత్రమే కనిపించే బలమైన మెటల్ బాడీ, అత్యంత సురక్షితమైన లైఫ్‌పో4 బ్యాటరీలను సాధారణ వినియోగదారుడికి అందుబాటులో ఉండే ధరలోనే ఈ స్కూటర్ల ద్వారా అందిస్తున్నాము," అని కొమాకి ఎలక్ట్రిక్ వెహికల్స్ సహ-వ్యవస్థాపకురాలు గుంజన్ మల్హోత్రా పేర్కొన్నారు.
భారత ఈవీ మార్కెట్లో ఓలా, టీవీఎస్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిస్తూ, మెటల్ బాడీతో వచ్చిన ఈ కొమాకి స్కూటర్లు మధ్యతరగతి ఆటోమొబైల్ రంగాన్ని ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


