Arunachalam Moksha Margam : అరుణాచలం మోక్షమార్గంలోకి వెళ్లే ముందు ఈ పని చేయాలి.. కొత్త రూల్

Arunachalam Moksha Margam : అరుణాచలం మోక్షమార్గం వద్ద కొత్త రూల్స్‌ను తీసుకొచ్చారు అధికారులు. భక్తుల భద్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకోసం పలు ఏర్పాట్లు చేశారు.

Published on: Aug 2, 2026, 20:23:20 IST
By , Arunachalam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి వారి గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న మోక్ష మార్గం వద్ద స్థానిక యంత్రాంగం, దేవస్థాన అధికారులు కఠిన భద్రతా చర్యలు చేపట్టారు. ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న విషాదకర సంఘటనల దృష్ట్యా, భక్తుల రక్షణే ధ్యేయంగా అధికారులు కీలక మార్పులు తీసుకొచ్చారు.

అరుణాచలం మోక్ష మార్గం
అరుణాచలం మోక్ష మార్గం

అరుణాచల గిరిప్రదక్షిణ చేసే భక్తులు ఈ చిన్న ఇరుకైన గుహ మార్గం గుండా వెళ్తే మోక్షం లభిస్తుందని, పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ముఖ్యంగా శారీరక రుగ్మతలు నయమవుతాయని బలంగా నమ్ముతారు. అయితే ఈ చిన్న మార్గం గుండా వెళ్లే క్రమంలో ఇటీవల ఒక తెలుగు భక్తుడు చిక్కుకుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఆ తర్వాత కూడా పలువురు భక్తులు ఇందులో ఇరుక్కుని ఇబ్బంది పడిన ఘటనలు జరిగాయి.

ఈ వరుస ప్రమాదాల నేపథ్యంలో భక్తుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం కావడంతో, మోక్ష మార్గ ప్రవేశంపై యంత్రాంగం తక్షణమే దృష్టి సారించింది. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆలయ పాలకమండలి ప్రత్యేక చర్యలు చేపట్టింది.

మోక్ష మార్గంలోకి వెళ్లే ముందే భక్తులు దానికి సరిపోతారో లేదో తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక ఇనుప గ్రిల్‌ను ఏర్పాటు చేశారు. ఈ గ్రిల్ పరిమాణం సరిగ్గా ఇడుక్కు పిళ్లైయార్(మోక్ష మార్గం) గుహ ద్వారంతో సమానంగా ఉంటుంది. ఈ ఐరన్ గ్రిల్ గుండా సులభంగా దూరి బయటకు రాగలిగిన భక్తులను మాత్రమే అసలు మోక్షమార్గంలోకి వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ఈ కొత్త విధానానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

గతంలో రాత్రింబవళ్లు ఈ మార్గం అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు మాత్రమే మోక్షమార్గాన్ని తెరిచి ఉంచుతున్నారు. రాత్రి వేళల్లో భద్రతా కారణాల దృష్ట్యా ప్రవేశాన్ని పూర్తిగా మూసివేశారు.

ఆలయ ప్రాంగణంలో అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లతో కూడిన బోర్డులను అమర్చారు. అంతేకాకుండా తమిళం, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో స్పష్టమైన హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అధిక బరువు ఉన్నవారు, వృద్ధులు, అలాగే గుండెజబ్బులు, శ్వాసకోశ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ గుహలోకి వెళ్లకూడదని స్పష్టం చేశారు.

నమ్మకంతో లేదా తొందరపాటుతో బలవంతంగా లోపలికి ప్రవేశించి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని, అధికారుల సూచనలను తప్పక పాటించాలని భక్తులను కోరుతున్నారు. అరుణాచలం వచ్చే భక్తులు శివయ్య దర్శనం చేసుకుని, సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్లాలని అధికారులు కోరుతున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More