...
...
Next Story

అమరావతిలో సెంట్రల్‌ సెక్రెటేరియట్‌.. రాజధానికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్ట్

అమరావతికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టు ప్రకటించింది. సెంట్రల్ సెక్రెటేరియట్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలకు కేంద్ర కెబినేట్ ఆమోదం తెలిపింది.

Published on: Jun 10, 2026, 15:12:53 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో భారీ ఎత్తున 'సెంట్రల్‌ సెక్రటేరియట్‌' (కేంద్ర సచివాలయం) నిర్మాణానికి కేంద్ర కేబినెట్‌ బుధవారం పచ్చజెండా ఊపింది. సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (CPWD) రూపొందించిన ప్రతిపాదనలకు ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి ఆమోదం తెలపడంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది.

అమరావతి
అమరావతి

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో సరికొత్త కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం (CGGPOA) నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) ఆమోదం తెలిపింది. రాష్ట్ర నూతన రాజధానిలో పరిపాలనాపరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు కేంద్రం తీసుకున్న ఒక కీలకమైన అడుగుగా ఇది నిలిచింది. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు విభాగాలు, సంస్థలన్నీ ఒకే గొడుగు కిందికి వచ్చేలా, ఆధునిక సదుపాయాలతో కూడిన సమగ్ర కార్యాలయాల సముదాయాన్ని ఈ ప్రాజెక్టు ద్వారా నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.

ప్రాజెక్టును మొత్తం రూ. 2,534 కోట్లతో చేపట్టనున్నారు. దీనిని ప్రధానంగా రెండు విభాగాలుగా విభజించి నిధులను కేటాయించారు. కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌.. కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల కార్యాలయాల కోసం రూ. 1,299.08 కోట్లు ఖర్చు చేయనున్నారు.

ఉద్యోగుల నివాస సముదాయాలను నిర్మించనున్నారు. ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బంది వసతి కోసం రూ. 1,234.91 కోట్లతో మల్టీస్టోరేజ్‌ (బహుళ అంతస్తుల) క్వార్టర్లను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) ఇప్పటికే 22.53 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో 5.53 ఎకరాల్లో పరిపాలనా భవనాలను, మిగిలిన 17 ఎకరాల్లో ఉద్యోగుల వసతి గృహాలను నిర్మించనున్నారు.

అమరావతి కేవలం రాష్ట్ర పరిపాలనా కేంద్రంగానే కాకుండా, కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలకు కూడా ప్రధాన కేంద్రంగా మారనుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇది అమరావతి ముఖచిత్రాన్ని మార్చడమే కాకుండా, భవిష్యత్తులో మరిన్ని జాతీయ సంస్థల రాకకు పునాది వేస్తుంది.

ఈ భారీ నిర్మాణ రంగం ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడే నివాసం ఉండటం వల్ల స్థిరాస్తి రంగానికి, స్థానిక వ్యాపారాలకు పెద్ద ఎత్తున ఊతం లభిస్తుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అమరావతి నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయడమే కాకుండా, విభజన చట్టంలోని హామీల అమలు దిశగా ఒక కీలక అడుగుగా నిలుస్తుంది.

అమరావతి అభివృద్ధిలో ఇదొక చారిత్రాత్మకమైన మైలురాయి అని, ఈ కొత్త కార్యాలయాల సముదాయం అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే దార్శనికతకు ఎంతో దోహదపడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe