Jonnagiri Gold Mining : జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్.. మే మెుదటివారంలో స్టార్ట్.. ఆంధ్రప్రదేశ్‌ కోలార్!

Jonnagiri Gold Mining : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో గోల్డ్ మైనింగ్ అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జొన్నగిరిలో మే మెుదటివారంలో బంగారం ఉత్పత్తి అధికారికంగా ప్రారంభించనున్నారు.

Published on: Apr 24, 2026, 06:28:17 IST
By , Jonnagiri
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరిలో వచ్చే నెలలో అధికారికంగా బంగారు ఉత్పత్తి ప్రారంభం కానుంది. గుత్తి-పత్తికొండ రహదారికి సమీపంలో ఉన్న జొన్నగిరి ప్రాంతంలో అనేక సర్వేల అనంతరం బంగారం ఉన్నట్టుగా గుర్తించారు. భారతదేశంలోని ప్రముఖ బంగారు గనుల ప్రాంతాలలో ఒకటిగా ఆవిర్భవించడానికి ఇది సిద్ధంగా ఉంది. భారతదేశంలో తొలిసారిగా జియో మైసూర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ సంస్థ జొన్నగిరిలో బంగారు తవ్వకాల కార్యకలాపాల్లోకి ప్రవేశించబోతోంది.

జొన్నగిరి గోల్డ్ మైనింగ్
జొన్నగిరి గోల్డ్ మైనింగ్

ఆంధ్రప్రదేశ్ కోలార్‌గా పిలవబడుతున్న ఈ ప్రాజెక్ట్.. రాష్ట్ర మైనింగ్ రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని భావిస్తున్నారు.

సుమారు 1,477 ఎకరాల్లో విస్తరించి ఉన్న జొన్నగిరి బంగారు గనుల ప్రాజెక్టు రూ.400 కోట్లకు పైగా పెట్టుబడిని ఆకర్షించింది. ఇది ఒక ప్రధాన రహదారికి సమీపంలో ఉండటం వల్ల రవాణా సౌలభ్యం పెరిగి, తవ్విన ముడి పదార్థాల రవాణా సులభతరం, తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో ప్రాథమిక అన్వేషణలు నిర్వహించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI), గణనీయమైన బంగారు నిక్షేపాలు ఉన్నాయని కన్ఫామ్ చేసింది. ఈ ఫలితాల తరువాత పలు కంపెనీలు ఆసక్తి చూపగా చివరకు జియో మైసూర్ మైనింగ్ హక్కులను దక్కించుకుంది.

ఈ గని సంవత్సరానికి 750 కిలోల నుండి 1,000 కిలోల వరకు బంగారం ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నిర్వహించిన ట్రయల్ రన్‌లలో సుమారు 40 కిలోల బంగారం వెలికితీసినట్లు సమాచారం. జొన్నగిరికి మరో కోలార్‌గా మారే సామర్థ్యం ఉందనడంలో సందేహం లేదని అధికారులు అంటున్నారు. నిజానికి జీఎస్ఐ మొదట్లో అంచనా వేసిన దానికంటే ఇక్కడి నిల్వలు ఎక్కువగా ఉండవచ్చని సూచనలు చెబుతున్నారు.

భూగర్భ శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ గని 15 నుండి 20 సంవత్సరాల వరకు పనిచేస్తూ ఉండగలదు. వెలికితీత ప్రక్రియ ఓపెన్-పిట్ మైనింగ్ పద్ధతిని అనుసరిస్తుంది. ఇందులో డ్రిల్లింగ్, బ్లాస్టింగ్, క్రషింగ్ ఉంటాయి. ఆ తర్వాత కార్బన్-ఇన్-లీచ్ (CIL) టెక్నాలజీని ఉపయోగించి బంగారాన్ని వేరుచేస్తారు. ఇటీవల సైట్‌ను సందర్శించిన కర్నూలు జిల్లా కలెక్టర్.. ప్రాజెక్టు పురోగతిని, కొనసాగుతున్న భూసేకరణను సమీక్షించారు.

జొన్నగిరి బంగారు గనులకు సంబంధించి ఏవైనా భూసేకరణ సమస్యలు పెండింగ్‌లో ఉంటే, వాటిని తక్షణమే పరిష్కరించాలన్నారు కలెక్టర్. భూసేకరణను వేగవంతం చేసేందుకు పత్తికొండ ఆర్డీఓ, తుగ్గలి తహసీల్దార్‌తో సమన్వయం చేసుకోవాలని పరిశ్రమల శాఖ మరియు ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు.

ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణం పూర్తయిందని, ప్రస్తుతం దానికి పరీక్షలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 2026 మే మొదటి వారంలో పూర్తిస్థాయి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గనులు, భూగర్భశాస్త్ర శాఖ అధికారులు జొన్నగిరి నుండి వెలికితీసిన బంగారం అధిక నాణ్యత కలిగి ఉందని పేర్కొన్నారు. భారతదేశంలో బంగారం లభించే ప్రాంతాలు పరిమితంగా ఉన్నాయని, ఇందులో జొన్నగిరి ఒకటిగా నిలుస్తుందన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More