ఏపీ సహా 4 రాష్ట్రాల్లో ₹9,450 కోట్లతో 4 రైల్వే ప్రాజెక్టులు.. కేబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా నాలుగు రాష్ట్రాల్లో రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 9,450 కోట్ల అంచనా వ్యయంతో 4 ప్రధాన మల్టీ-ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది.

Published on: Aug 19, 2026, 17:08:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 9,450 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు భారీ మల్టీ-ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాల పరిధిలోని ప్రయాణికులకు, సరుకు రవాణా రంగానికి ఎంతో మేలు చేయనుంది.

ఏపీ సహా 4 రాష్ట్రాల్లో  ₹9,450 కోట్లతో 4 రైల్వే ప్రాజెక్టులు.. కేబినెట్ ఆమోదం
ఏపీ సహా 4 రాష్ట్రాల్లో ₹9,450 కోట్లతో 4 రైల్వే ప్రాజెక్టులు.. కేబినెట్ ఆమోదం

నాలుగు కీలక రైల్వే లైన్లు ఇవే..

ఈ కొత్త ప్రాజెక్టుల ద్వారా రైల్వే నెట్‌వర్క్‌కు అదనంగా మరో 410 కిలోమీటర్ల మేర లైన్లు తోడవనున్నాయి. ఆమోదం పొందిన ప్రాజెక్టుల వివరాలు:

  • ఖరగ్‌పూర్ - భద్రక్ (రాణితాల్) 4వ లైన్: 173 కిలోమీటర్లు
  • గుమ్మిడిపూడి - గూడూరు 3వ, 4వ లైన్: 90 కిలోమీటర్లు (ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు అత్యంత కీలకం)
  • భద్రక్ - హరిదాస్‌పూర్ 4వ లైన్: 75 కిలోమీటర్లు
  • కటక్ - పారాదీప్ (బడబంధ) 3వ, 4వ లైన్: 72 కిలోమీటర్లు

60 లక్షల మంది ప్రజలకు నేరుగా ప్రయోజనం

ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే రైళ్ల రాకపోకల వేగం పెరగడమే కాకుండా, పట్టాలపై రద్దీ గణనీయంగా తగ్గుతుంది. 'పీఎం గతిశక్తి' జాతీయ మాస్టర్ ప్లాన్ ప్రాతిపదికన రూపొందించిన ఈ పథకాల ద్వారా దాదాపు 6,448 గ్రామాలకు, సుమారు 60 లక్షల మంది జనాభాకు నేరుగా మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఇది ప్రాంతీయంగా స్వయం సమృద్ధిని సాధించడమే కాక, కొత్త ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను విరివిగా సృష్టిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.

పర్యాటక రంగానికి బూస్ట్.. పర్యావరణానికి రక్షణ

ఈ కొత్త లైన్లు అందుబాటులోకి వస్తే నేలపట్టు పక్షుల కేంద్రం, పులికాట్ సరస్సు, భితర్కనిక నేషనల్ పార్క్, కుల్దిహా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, చండీపూర్ బీచ్, లలితగిరి బౌద్ధ క్షేత్రం, లార్డ్ వీరరాఘవ పెరుమాళ్ కోవెల, దబలేశ్వర్ ఆలయం వంటి ప్రసిద్ధ పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.

దీంతో పాటు బొగ్గు, ఇనుప ఖనిజం, సిమెంట్, ఉక్కు, ఆటోమొబైల్, ధాన్యాల రవాణా వేగవంతమై, ప్రతి ఏటా అదనంగా 76 మిలియన్ టన్నుల (MTPA) సరుకు రవాణా సాధ్యమవుతుంది. రైలు రవాణా పెరగడం వల్ల సుమారు 13 కోట్ల లీటర్ల చమురు దిగుమతులు తగ్గడమే కాకుండా, 65 కోట్ల కిలోల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇది 2.60 కోట్ల చెట్లను నాటడంతో సమానమని కేంద్రం తన ప్రకటనలో వివరించింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More