Census 2027 : జనాభా లెక్కలు.. ఏపీలో ఏప్రిల్ 16 నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్

Census 2027 : ఆంధ్రప్రదేశ్‌లో 2027 జనాభా గణన ఏప్రిల్ 16 నుంచి డిజిటల్ ఫార్మాట్‌లో ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Published on: Apr 15, 2026 7:29 PM IST
By , Amaravati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2027 జనాభా లెక్కల కింద స్వీయ గణన ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏప్రిల్ 16 నుంచి రెండు దశల్లో డిజిటల్ ఫార్మాట్‌లో ప్రారంభమవుతుందని సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ జె.నివాస్ తెలిపారు. మొదటి దశలో మానవ వనరులు, లాజిస్టికల్ అవసరాలను అంచనా వేయడానికి.. ఇళ్లు, భవనాలను లెక్కించడం ద్వారా గృహాల జాబితా జరుగుతుందని అన్నారు.

జనాభా లెక్కలు 2027
జనాభా లెక్కలు 2027

2027 జనాభా గణన ప్రక్రియ మొత్తం డిజిటల్‌గా నిర్వహిస్తారు. ఇది డేటా సేకరణ, ప్రాసెసింగ్‌లో ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తుందని నివాస్ తెలిపారు. 'ఆంధ్రప్రదేశ్‌లో 2027 జనగణన ప్రక్రియ ఏప్రిల్ 16 నుంచి రెండు దశల్లో ప్రారంభమవుతుంది. హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్, జనాభా గణన అనే రెండు దశల్లో డిజిటల్ విధానంలో నిర్వహిస్తారు.' అని సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నివాస్ వెల్లడించారు.

జనాభా గణన అనేది దేశంలో నిర్వహించే అతిపెద్ద పరిపాలనా కార్యక్రమాలలో ఒకటి, విధాన రూపకల్పన, పరిపాలనకు ఇది చాలా కీలకమైనది. ఈ ప్రక్రియలో సేకరించిన సమాచారాన్ని సంక్షేమ పథకాలను రూపొందించడానికి, వనరులను కేటాయించడానికి, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు.

జనాభా గణన పనులకు ఆటంకం కలిగించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజలు సహకరించి సరైన సమాచారం అందించాలని కోరారు. కేంద్రం జారీ చేసిన జనాభా గణనకు సంబంధించిన అన్ని నోటిఫికేషన్‌లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రచురించిందని, ఉపయోగించాల్సిన ప్రశ్నావళిని గెజిట్ ద్వారా అధికారికంగా నోటిఫై చేసిందని నివాస్ పేర్కొన్నారు.

ఇళ్ల జాబితా ప్రక్రియలో భాగంగా నీరు, పారిశుధ్యం, విద్యుత్ దీపాలు, వంట ఇంధనం వంటి గృహ సౌకర్యాలతో పాటు ఇంటర్నెట్ సదుపాయం, కంప్యూటర్లు, వాహనాలు, మొబైల్ ఫోన్లు వంటి ఆస్తుల వివరాలను గణన అధికారులు సేకరిస్తారు.

'ఈ నెల 16 నుంచి మొదటి దశగా ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన (House Listing and Housing Census – HLO) రాష్ట్రంలో ప్రారంభం కానుంది. దేశంలోనే అతిపెద్ద పరిపాలనా కార్యక్రమంగా నిలిచే ఈ జనగణన, ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతోంది.' అని జె.నివాస్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నోడల్ అధికారిగా ఉంటారు. జిల్లా స్థాయిలో కలెక్టర్/మున్సిపల్ కమిషనర్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్‌గా, మండల స్థాయిలో తహసీల్దార్/మున్సిపల్ కమిషనర్ ఛార్జ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డుల సిబ్బంది, అవసరమైతే ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లుగా పనిచేస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా యూనిట్ల గణాంకాల ప్రకారం.. సెన్సస్ 2027 నాటికి రాష్ట్రంలో 28 జిల్లాలు, 669 మండలాలు, 83 స్టాట్యుటరీ టౌన్లు, 228 సెన్సస్ టౌన్లు ఉన్నాయి. గ్రామాల సంఖ్య సుమారు 16,862 గా నమోదైందని నివాస్ వెల్లడించారు. ఈ పరిపాలనా నిర్మాణం ద్వారా జనగణన సమర్థవంతంగా నిర్వహించబడుతుందని చెప్పారు.

  • మొదటి దశలో భాగంగా స్వీయ-గణన(Self Enumeration) సదుపాయం 16.04.2026 నుండి 30.04.2026 వరకు 15 రోజులపాటు అందుబాటులో ఉంటుంది. అనంతరం ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన 01.05.2026 నుండి 30.05.2026 వరకు 30 రోజులపాటు నిర్వహిస్తారు. జనాలు https://se.census.gov.in, https://se.census.gov.in పోర్టల్ ద్వారా తమ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి, గృహాన్ని జియో-ట్యాగ్ చేసి వివరాలు నమోదు చేయవచ్చు. నమోదు పూర్తయిన తర్వాత ఒక ప్రత్యేకమైన Self Enumeration ID (SE ID) జనరేట్ అవుతుంది. ఈ ఐడీని ఎన్యూమరేటర్‌కు అందజేసి, ఫీల్డ్ వెరిఫికేషన్ సమయంలో ధృవీకరించాల్సి ఉంటుంది.
  • హౌస్ లిస్టింగ్ దశలో మొత్తం 33 ప్రశ్నలకు సంబందించిన వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. ఇందులో గృహ నిర్మాణ పదార్థాలు (ఫ్లోర్, గోడ, పైకప్పు), గృహ వినియోగం, గృహ స్థితి, కుటుంబ సభ్యుల సంఖ్య, కుటుంబ యజమాని వివరాలు, ఎస్టీ/ఎస్టీ స్టేటస్, గదుల సంఖ్య, వివాహిత జంటలు వంటి అంశాలు ఉంటాయి. తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వంట ఇంధనం, స్నాన సౌకర్యం, వంటగది వంటి సౌకర్యాలు నమోదు చేస్తారు. కుటుంబ ఆస్తులు (టీవీ, ఇంటర్నెట్, మొబైల్, వాహనాలు), ప్రధాన ఆహారం, మొబైల్ నంబర్ వంటి వివరాలు కూడా నమోదు చేస్తారు.
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More