AP Census 2027 : ఏపీలో ఇవాళ్టి నుంచి జనగణన - తొలిసారిగా డిజిటల్ విధానంలో లెక్కింపు..! 10 ముఖ్యమైన పాయింట్లు
Census 2027 in Andhrapradesh : ఇవాళ్టి నుంచి ఏపీలో 2027 జనగణన ప్రక్రియ షురూ కానుంది. తొలిసారిగా పూర్తిస్థాయిలో డిజిటల్ పద్ధతిలో డేటాను సేకరించనున్నారు. ప్రజలు తమ వివరాలను ఆన్‌లైన్‌లో స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది.
ఆంధ్రప్రదేశ్‌లో 2027 జనగణన (సెన్సస్) ప్రక్రియకు సంబంధించి కీలక అడుగు పడింది. ఇవాళ్టి (ఏప్రిల్ 16) నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండు దశల్లో ఈ భారీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈసారి జనగణనను వినూత్నంగా పూర్తిస్థాయిలో డిజిటల్ ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు.

తొలి దశలో భాగంగా 'హౌస్‌లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్' (HLO) నిర్వహిస్తారు. ఇందులో రాష్ట్రంలోని భవనాలు, ఇళ్లు, వాటి నిర్మాణం తదితర వివరాలను సేకరించి, తదుపరి ప్రక్రియకు అవసరమైన మానవ వనరులు, ఇతర వసతులను అంచనా వేస్తారు. రెండో దశలో జనాభా గణన, సామాజిక-ఆర్థిక వివరాలు, వలసలు, జనన మరణాల సమాచారాన్ని సేకరిస్తారు.
- ఈసారి జనగణనలో 'సెల్ఫ్ ఎన్యుమరేషన్' (స్వయం నమోదు)కు అవకాశం ఉంది. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు ప్రజలు తమ మొబైల్ నంబర్లను ఉపయోగించి పోర్టల్‌లోకి లాగిన్ అవ్వొచ్చు. తమ నివాసాలను జియో-ట్యాగ్ చేసి, వివరాలను ఆన్‌లైన్‌లోనే సమర్పించవచ్చు.
- ఇలా నమోదు చేసుకున్న వారికి ఒక ప్రత్యేక ఐడీ (Self Enumeration ID) లభిస్తుంది. సెన్సస్ సిబ్బంది వెరిఫికేషన్ కోసం ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీని వారికి చూపిస్తే సరిపోతుంది.
- ప్రజలు అందించే వ్యక్తిగత వివరాలు చట్టప్రకారం అత్యంత రహస్యంగా ఉంటాయని ఏపీ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ జె.నివాస్ స్పష్టం చేశారు.
- సమాచార భద్రత కోసం ఐఎస్ఓ (ISO) ప్రమాణాలతో కూడిన ఎండ్-టు-ఎండ్ ప్రొటెక్షన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అనధికారిక వ్యక్తులు డేటాను యాక్సెస్ చేయకుండా సెక్యూరిటీ ఆడిట్‌లు కూడా నిర్వహిస్తున్నారు.
- ఈ బృహత్తర కార్యక్రమం కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.1 లక్షల మంది ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లను నియమించారు. వీరికి అదనంగా మరో 3,500 మంది సిబ్బంది సహకారం అందించనున్నారు.
- రాష్ట్రంలోని 28 జిల్లాలు, 688 మండలాలు, 123 మున్సిపాలిటీలు, దాదాపు 16,862 గ్రామాల్లో ఈ లెక్కింపు సాగనుంది. 2026 జనవరి 1వ తేదీ నాటికి ఉన్న పరిపాలనా విభాగాల మేరకే ఈ డేటా సేకరణ జరుగుతుంది.
- గృహాల లెక్కింపు సమయంలో మొత్తం 33 రకాల ప్రశ్నలు అడుగుతారు. ఇల్లు కట్టిన మెటీరియల్, కుటుంబ సభ్యుల సంఖ్య, ఎస్సీ/ఎస్టీ హోదా, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వంట గ్యాస్ వంటి కనీస సదుపాయాలతో పాటు టీవీ, ఇంటర్నెట్, వాహనాల వంటి ఆస్తుల వివరాలను కూడా నమోదు చేస్తారు. సంక్షేమ పథకాల రూపకల్పనకు, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ డేటా ఎంతో కీలకం కానుంది.
- జనగణన విధులకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
- భారతీయ భాషల్లో మొత్తం 16 భాషల్లో ఈ ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. 1872 నుంచి చూస్తే ఇది 16వ జనగణన కాగా… స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇది 8వది.
- అధికారిక వెబ్ సైట్ - https://se.census.gov.in/
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

