Census : రేపటి నుంచి ‘జనగణన 2027’- డిజిటల్ రూపంలో 16వ సెన్సస్! పూర్తి వివరాలివే..
Census 2027 start date : భారతదేశ 16వ జనగణన (సెన్సస్ 2027) ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. పూర్తి డిజిటల్ పద్ధతిలో, రెండు దశల్లో జరిగే ఈ ప్రక్రియలో తొలిసారిగా 'స్వయంగా సమాచారం నమోదు చేసే' సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
దేశ భవిష్యత్తు ప్రణాళికలకు అత్యంత కీలకమైన 'జనగణన 2027' ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. రేపు, ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ భారీ కార్యక్రమం ప్రారంభం కానుందని భారత రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ దిల్లీలో వెల్లడించారు. ఇది దేశవ్యాప్తంగా జరిగే 16వ జనగణన కాగా, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇది 8వది.

రెండు దశల్లో జనగణన 2027..
ఈసారి జనాభా లెక్కలు రెండు విభిన్న దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో ఇళ్ల జాబితా తయారీ, 'సెల్ఫ్-ఎన్యుమరేషన్' (స్వయంగా వివరాల నమోదు) ప్రక్రియ ఉంటుంది. రెండొవ దశలో జనాభా గణన చేపడతారు. ఈ రెండవ దశలోనే కులాంతర గణన కూడా జరుగుతుందని కమిషనర్ స్పష్టం చేశారు.
జనగణన 2027- స్వయంగా వివరాల నమోదు..
సెన్సస్ 2027లో భాగంగా ప్రజలు తమ వివరాలను తామే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే 'సెల్ఫ్-ఎన్యుమరేషన్' సౌకర్యం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 మధ్య 15 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఒక్కో రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ఈ గడువు మారుతూ ఉంటుంది.
తమంతట తాము వివరాలు నమోదు చేసుకున్న తర్వాత, సెప్టెంబర్ 30 వరకు 30 రోజుల పాటు ఇళ్ల జాబితా తయారీ కార్యకలాపాలు జరుగుతాయి.
ఈ సెల్ఫ్-ఎన్యుమరేషన్ పోర్టల్ మొత్తం 16 భాషల్లో అందుబాటులో ఉంటుంది.
జనగణన 2027- డిజిటల్ పద్ధతిలో సేకరణ..
జనగణన 2027 పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందని నారాయణ్ తెలిపారు. డేటాను మొబైల్ అప్లికేషన్ ద్వారా సేకరిస్తారు. అలాగే మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి వెబ్ ఆధారిత పోర్టల్‌ను ఉపయోగిస్తారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్ (హెచ్ఎల్బీ) తయారీని కూడా వెబ్ మ్యాపింగ్ అప్లికేషన్ ద్వారా నిర్వహిస్తారు.
జనగణన 2027- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ..
ప్రజలు తమకు కేటాయించిన 15 రోజుల విండోలో se.census.gov.in పోర్టల్‌లో మొబైల్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. మ్యాప్‌లో ఇంటి లొకేషన్ గుర్తించి వివరాలు సమర్పించాలి. ఆ తర్వాత వచ్చే 16 అంకెల యూనిక్ ఐడీని ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు వెరిఫికేషన్ కోసం చూపించాలి. ఏవైనా తప్పులు ఉంటే.. క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో సరిచేసుకోవచ్చు.
జనగణన 2027- మొదటి దశలో అడిగే 33 ప్రశ్నలు..
తొలి దశలో (ఏప్రిల్ 1 - సెప్టెంబర్ 30) అడిగే 33 ప్రశ్నల జాబితాను ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేసింది. రిజిస్ట్రార్ జనరల్ తెలిపిన వివరాల ప్రకారం ఎన్యుమరేటర్లు సేకరించే సమాచారం ఇదీ:
ఇంటి వివరాలు: భవనం నంబర్ (మున్సిపల్/లోకల్ లేదా సెన్సస్ నంబర్), జనగణన ఇంటి నంబర్, నేల, గోడలు, పైకప్పుకు వాడిన పదార్థాలు.
నివాస వివరాలు: ఇంటి వినియోగం, పరిస్థితి, కుటుంబ సంఖ్య, కుటుంబ యజమాని పేరు, లింగం.
సామాజిక వివరాలు: యజమాని షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ లేదా ఇతర కేటగిరీకి చెందినవారా? అనే వివరాలు.
వసతులు: ఇంట్లో నివసించే వారి సంఖ్య, వివాహిత జంటల సంఖ్య, గదుల సంఖ్య, ఇంటి యాజమాన్య స్థితి (సొంతం/అద్దె).
సౌకర్యాలు: తాగునీటి మూలం, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్డి రకం, మురుగునీటి పారుదల, స్నానపు గదులు, వంటగది వసతులు.
వంట ఇంధనం: ఎల్‌పీజీ/పీఎన్‌జీ కనెక్షన్ ఉందా? వంటకు వాడే ప్రధాన ఇంధనం ఏంటి?
ఆస్తులు: రేడియో, టీవీ, ఇంటర్నెట్ సదుపాయం, లాప్‌టాప్/కంప్యూటర్, టెలిఫోన్/మొబైల్/స్మార్ట్‌ఫోన్, సైకిల్/స్కూటర్/మోటార్‌సైకిల్, కార్/జీప్/వ్యాన్ వివరాలు.
ఇతర: ప్రధానంగా తినే ఆహార ధాన్యాలు, కమ్యూనికేషన్ కోసం మొబైల్ నంబర్.
జనగణన 2027- లివ్-ఇన్ జంటలపై కీలక నిర్ణయం..
జనగణన 2027లో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ల గుర్తింపుపై అధికారులు స్పష్టత ఇచ్చారు. "లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న జంటలను వివాహిత జంటగా పరిగణించవచ్చా?" అనే ప్రశ్నకు.. "ఒకవేళ వారు తమ బంధాన్ని ఒక స్థిరమైనదిగా భావిస్తే, వారిని వివాహిత జంటగానే పరిగణించాలి" అని ఎఫ్ఏక్యూ లో పేర్కొన్నారు.
జనగణన 2027- సమాచార గోప్యత, చట్టపరమైన రక్షణ..
వ్యక్తిగత సమాచారం అంతా సెన్సస్ యాక్ట్ 1948 సెక్షన్ 15 ప్రకారం అత్యంత గోప్యంగా ఉంటుందని మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ హామీ ఇచ్చారు. ఈ డేటాను ఆర్టీఐ ద్వారా పొందలేరు లేదా కోర్టుల్లో సాక్ష్యంగా చూపలేరు. కేవలం గణాంక పట్టికల తయారీకి మాత్రమే ఈ డేటాను ఉపయోగిస్తారు. ఇది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, దేశ అభివృద్ధి ప్రణాళికల కోసమేనని ఆయన స్పష్టం చేశారు.
దేశంలో చివరిసారిగా 2011లో జనగణన జరిగింది. 2021లో మళ్లీ జనాభా లెక్కలు జరగాల్సి ఉంది. కానీ కరోనా సంక్షోభం నేపథ్యంలో అది వాయిదా పడుతూ వచ్చింది. చివరికి, ఏప్రిల్ 1న ఈ ప్రక్రియ ప్రారంభంకానుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


