...
...
Next Story

ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం 5 లక్షల ఇళ్ల కేటాయింపు

ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు 5 లక్షల ఇళ్లు కేటాయించినట్టుగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఇంత పెద్ద మెుత్తంలో ఇండ్లు కేటాయించడం ఇదే మెుదటిసారి అని చెప్పారు.

Updated on: Sep 15, 2026, 17:17:40 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట నిచ్చింది. పీఎం ఆవాస్ యోజన పథకం కింద రెండు రాష్ట్రాలకు కలిపి ఏకంగా 5 లక్షల ఇళ్లను కేటాయించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 3 లక్షల ఇళ్లు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు దక్కాయి. గ్రామీణాభివృద్ధి శాఖ చరిత్రలోనే ఇరు రాష్ట్రాలకు ఇంత పెద్దమొత్తంలో ఇళ్లు మంజూరు కావడం ఇదే తొలిసారని ఆయన తెలిపారు.

ఆవాస్ యోజన ఇల్లు
ఆవాస్ యోజన ఇల్లు

కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత గతంలో ప్రకటించిన కోటా కంటే అదనంగా ఇళ్లను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన కేటాయింపులకు అదనంగా మరో 2.25 లక్షల ఇళ్లను ఏపీకి ఇచ్చారు. అడిగిన దానికి మించి అదనంగా 1.25 లక్షల ఇళ్లను తెలంగాణకు కేటాయించారు.

2019-2024 మధ్య కాలంలో ఇళ్ల నిర్మాణ పురోగతిపై మాట్లాడిన మంత్రి.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీకి 1.78 లక్షల ఇళ్లు కేటాయిస్తే అందులో కేవలం 42 వేల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని చెప్పారు. ఇక తెలంగాణ విషయానికొస్తే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేయలేదని గుర్తుచేశారు. అయితే రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా 2, 3 సార్లు ఢిల్లీ వచ్చి విజ్ఞప్తి చేయడంతో, తెలంగాణ ప్రభుత్వం కోరిన దానికంటే ఎక్కువ ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని వివరించారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లబ్ధిదారులకు లభించే ఆర్థిక సాయం వివరాలను మంత్రి పెమ్మసాని వివరించారు. ప్రాథమిక సాయం ప్రతి ఇంటి నిర్మాణానికి కేంద్రం నేరుగా రూ.1.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. అదనపు సాయం కలిపితే లబ్ధిదారునికి దాదాపు రూ.1.80 లక్షల వరకు ప్రయోజనం చేకూరుతుంది.

ఇంట్లో ద్విచక్ర వాహనం లేదా ఫ్రిజ్ ఉందనే కారణంతో గతంలో అర్హత కోల్పోయిన వారికి కూడా ఇప్పుడు పథకాన్ని వర్తింపజేస్తున్నారు. లబ్ధిదారుల నమోదు ప్రక్రియను పారదర్శకంగా మార్చేందుకు ఆవాస్ ప్లస్ యాప్‌ ద్వారా సెల్ఫ్ సర్వే, జియో ట్యాగింగ్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు.

రాబోయే 2 నుంచి 3 ఏళ్ల వ్యవధిలో కొత్త, పాత ఇళ్లన్నింటినీ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి పేదవానికి పక్కా ఇల్లు అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks