ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ - భోగాపురం విమానాశ్రయానికి ఇమ్మిగ్రేషన్ హోదా - ఇక నేరుగా విదేశీ ప్రయాణాలు…!

ఏపీలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం అధికారిక ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్ హోదా కల్పించింది. త్వరలోనే ఇక్కడి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

Published on: Jul 13, 2026, 15:54:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం అధికారిక ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్‌గా గుర్తింపునిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత ఇమ్మిగ్రేషన్ కేంద్రాల జాబితాను సవరిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) తాజాగా ఈ ఉత్తర్వులను జారీ చేసింది.

భోగాపురం విమానాశ్రయం
భోగాపురం విమానాశ్రయం

కేంద్ర ప్రభుత్వానికి సంక్రమించిన అధికారాలను ఉపయోగించి.. హోం శాఖ ఈ సవరణలు చేసింది. ఈ నిబంధనల ప్రకారం దేశంలోని విమానాశ్రయాల విభాగంలో కేటగిరీ-1 కింద 39వ నంబరుగా భోగాపురం విమానాశ్రయాన్ని చేర్చారు. ఈ అధికారిక గుర్తింపుతో భోగాపురం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమైనప్పుడు విదేశాలకు వెళ్లే, విదేశాల నుండి వచ్చే ప్రయాణికుల పాస్‌పోర్ట్, వీసా వెరిఫికేషన్ ప్రక్రియలను ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇక్కడే పూర్తి చేయడానికి మార్గం సుగమమైంది.

ఇమ్మిగ్రేషన్ హోదా కీలకం…

నిబంధనల ప్రకారం ఏదైనా విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడపాలంటే కేంద్ర ప్రభుత్వం దానికి ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్ హోదా కల్పించడం అత్యంత కీలకం. ఈ చట్టబద్ధమైన ప్రక్రియ పూర్తి కావడంతో భోగాపురం ఎయిర్‌పోర్ట్ అంతర్జాతీయ విమానాలకు సర్వసిద్ధంగా మారుతోంది. విశాఖపట్నం సమీపంలో నిర్మిస్తున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం భవిష్యత్తులో ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న విశాఖ విమానాశ్రయానికి అదనంగా, ఈ ప్రాంతంలో పెరుగుతున్న దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా భోగాపురాన్ని ప్రధాన ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు.

మరోవైపు…. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రానున్న కాలంలో వాణిజ్య విమాన సర్వీసులను ప్రారంభించేందుకు వీలుగా మౌలిక వసతుల కల్పన చివరి దశకు చేరుకుంది. ఏటా దాదాపు 40 మిలియన్ల (4 కోట్లు) ప్రయాణికులకు సేవలు అందించేలా ఈ విమానాశ్రయాన్ని డిజైన్ చేశారు.

ముఖ్యంగా 78 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్న టెర్మినల్ భవనాన్ని 'ఎగిరే చేప' (ఫ్లయింగ్ ఫిష్) ఆకృతిలో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ విమానాశ్రయం లోపలి, వెలుపలి భాగాలు ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉంటూనే, దేశంలోని మెట్రో నగరాల ఎయిర్‌పోర్ట్‌లకు ధీటుగా అత్యాధునిక వసతులుంటాయి.

గత వారమే కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి అధికారిక 'ఏరోడ్రోమ్ లైసెన్స్' మంజూరు చేసింది. ప్రాజెక్టు తుది దశకు చేరుకోవడంలో ఇదొక మైలురాయిగా నిలిచింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ లైసెన్స్ పత్రాలను ఢిల్లీలో జీఎంఆర్ (GMR) ఎయిర్‌పోర్ట్స్ ప్రతినిధులకు స్వయంగా అందజేశారు. ఈ లైసెన్స్ రావడంతో భోగాపురం విమానాశ్రయం వాణిజ్య విమానాల రాకపోకలకు పూర్తిగా సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More