ఏపీఎస్ఆర్టీసీ మెగా ప్లాన్.. విజయవాడ టూ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 40 ప్రత్యేక బస్సులు

ఏపీఎస్ఆర్టీసీ కొత్తగా మెగా ప్లాన్ సిద్ధం చేసుకుంది. కొత్తగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా తీసుకురానుంది. అంతేకాదు విజయవాడ టూ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 40 ప్రత్యేక బస్సులు నడపాలని భావిస్తోంది.

Published on: May 31, 2026, 17:32:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రవాణా రంగంలో సరికొత్త విప్లవానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC)ను భారీ స్థాయిలో ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు.

ఏపీఎస్ఆర్టీసీ
ఏపీఎస్ఆర్టీసీ

మొదటి విడతగా 700 ఎలక్ట్రిక్ బస్సులు

ఆర్టీసీ ఆధునీకరణలో భాగంగా రాబోయే రెండు నెలల్లోనే మొదటి విడత కింద 700 ఎలక్ట్రిక్ బస్సులను రవాణా శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'పీఎం ఇ-బస్ సేవ' (PM e-Bus Sewa) పథకం కింద 300 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయి. ఇవి కాకుండా అదనంగా మరో 500 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ప్రక్రియ ఇప్పటికే విజయవంతంగా పూర్తయింది.

ఈ బ్యాటరీ బస్సుల నిర్వహణ, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం రాష్ట్రంలోని 6 ప్రధాన డిపోలను సిద్ధం చేస్తున్నారు. ఈ పనులన్నీ రాబోయే జూలై నాటికి పూర్తికానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విడతల వారీగా మొత్తం 3,000 ఎలక్ట్రిక్ బస్సులను నడపడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ట్రాన్స్‌పోర్ట్ టెక్నాలజీల వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

ఏడాది పూర్తి చేసుకున్న ‘స్త్రీ శక్తి’ పథకం

గత ఐదేళ్ల కాలంలో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఏపీఎస్ఆర్టీసీని కూటమి ప్రభుత్వం విజయవంతంగా పునరుద్ధరించిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే ప్రతిష్టాత్మక ‘స్త్రీ శక్తి’ పథకం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుందని ఆయన వెల్లడించారు. ఈ పథకాన్ని ప్రభుత్వం ఒక బాధ్యతగా భావిస్తోందని, దీనివల్ల ఆర్టీసీపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం నిధులు సమకూరుస్తోందని భరోసా ఇచ్చారు.

భోగాపురం విమానాశ్రయానికి ప్రత్యేక సర్వీసులు

త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్న అంతర్జాతీయ స్థాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ప్రకటించింది. విజయవాడ నుండి భోగాపురం విమానాశ్రయానికి నేరుగా 40 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.

పర్యావరణానికి మేలు చేయడంతో పాటు డీజిల్ ఖర్చులను భారీగా తగ్గించుకోవడానికి ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకి ఎంతో దోహదపడనున్నాయి. ముఖ్యంగా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల మధ్య ఈ సర్వీసులు ఎక్కువగా నడవనున్నాయి. ప్రయాణికుల భద్రత కోసం ఈ కొత్త బస్సులలో జీపీఎస్(GPS) ట్రాకింగ్, సీసీటీవీ కెమెరాలు, అత్యవసర అలర్ట్ బటన్లు వంటి అత్యాధునిక సాంకేతికతను జోడిస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More