'రాష్ట్రాన్ని జంగిల్‌ రాజ్‌లా మార్చారు'.... పుంగనూరు దాడి ఘటనపై జగన్ తీవ్ర ఆగ్రహం

ఎంపీ మిథున్‌రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. దాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ క్షీణించిందని విమర్శించారు. 

Published on: Oct 16, 2026, 14:57:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందని వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూడ్చిపెట్టి 'జంగిల్ రాజ్' పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్ష నేత, రాజంపేట ఎంపీ మిథున్‌ రెడ్డిపై శుక్రవారం జరిగిన దాడి ఘటనపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ఎంపీ మిథున్‌రెడ్డికి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. పుంగనూరు పర్యటనలో జరిగిన దాడి వివరాలను, అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అడిగి తెలుసుకుని ఎంపీకి ధైర్యం చెప్పారు.

వైసీపీ అధినేత జగన్
వైసీపీ అధినేత జగన్

ఓటమి భయంతోనే….

ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం ఎంతమాత్రం ఇష్టం లేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ల పరిపాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని…. దాంతో ఓటమి భయంతోనే వైఎస్సార్‌సీపీ నాయకులు, పోటీ చేస్తున్న అభ్యర్థులపై భౌతిక దాడులు, బెదిరింపులకు ఒడిగడుతున్నారని విమర్శించారు. "హింసాత్మక రాజకీయం చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ఆయన రాష్ట్రాన్ని పూర్తిగా జంగిల్ రాజ్‌లా మార్చేశారు," అని జగన్ తీవ్రంగా ఆక్షేపించారు.

ఎంపీకే రక్షణ లేదు - వైఎస్ జగన్

రాష్ట్రంలో శాంతిభద్రతల వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని మాజీ సీఎం ధ్వజమెత్తారు. చివరకు లోక్‌సభలో ఒక పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న ఎంపీకే రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు తన అధికార దుర్వినియోగానికి తెగబడుతూ, ఎన్నికల్లో అక్రమాలు చేయడానికి పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారని ఆరోపించారు. కళ్లముందే దాడులు జరుగుతున్నా పోలీసులు చేష్టలుడిగి నిస్తేజంగా ఉండిపోతున్నారని మండిపడ్డారు.

ఈ అన్యాయాలు, అక్రమాలను వైఎస్సార్‌సీపీ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని జగన్ స్పష్టం చేశారు. తమ పార్టీ చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా అన్ని రకాలుగా పోరాటం చేస్తుందని తెలిపారు. పార్టీ శ్రేణులంతా ధైర్యం, సహనం మరియు పట్టుదలతో ఈ పరిస్థితులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం సాగిస్తున్న అక్రమాలు, పోలీసుల పక్షపాత వైఖరి పరిస్థితులను ఆధారాలతో సహా కోర్టుల ముందు ఉంచుతామని వెల్లడించారు.

రాష్ట్రంలో పారామిలటరీ బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించినప్పుడే పారదర్శకంగా, సజావుగా సాగుతాయని, ఇదే డిమాండ్‌ను న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తామని జగన్ పేర్కొన్నారు. తమది ప్రజలకు సంక్షేమం, మంచి చేసిన చరిత్ర అని, కానీ చంద్రబాబుది మాత్రం హింస, విధ్వంసాల చరిత్ర అని ఆయన వ్యాఖ్యానించారు.

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో పాల్గొనేందుకు పుంగనూరు వెళ్లిన రాజంపేట ఎంపీ పి.వి. మిథున్‌రెడ్డిపై టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రతినిధి షరీఫ్ ఆరోపించారు. ఇది స్పష్టంగా ఎంపీపై జరిగిన హత్యాయత్నమని… వేలాది మంది కూటమి మద్దతుదారులు ఎంపీ కాన్వాయ్‌ను చుట్టుముట్టారని తెలిపారు. పోటీలో ఉన్న తమ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు.

రాయచోటిలోని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కార్యాలయంపై కూడా దాడి చేసి, వాహనాలకు నిప్పంటించారని ఆయన గుర్తుచేశారు. ఏపీలో పోలీసులు కూటమి ప్రభుత్వ అజెండా ప్రకారమే నడుచుకుంటున్నారని, శాంతిభద్రతలు క్షీణించిన ప్రస్తుత వాతావరణంలో నిష్పాక్షిక ఎన్నికలు సాధ్యం కావు కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తక్షణమే జోక్యం చేసుకుని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని షరీఫ్ డిమాండ్ చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More