ఇప్పటివరకు 40 లక్షల పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ పారదర్శకంగా పట్టాదార్ పాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు.

Published on: Oct 9, 2026, 19:20:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి రైతుకూ పూర్తి పారదర్శకతతో భూ హక్కులు కల్పిస్తూ పట్టాదార్ పాస్‌పుస్తకాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 40.5 లక్షల పట్టాదార్ పాస్‌పుస్తకాలను అధికారిక ముద్రతో పంపిణీ చేశామని, రాబోయే రోజుల్లో నెలకు తగిన లక్ష్యాలను నిర్దేశించుకుని మరో 51 లక్షల పాస్‌పుస్తకాలను అందజేస్తామని ప్రకటించారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని నర్సింగోలు గ్రామంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

ఇప్పటివరకు 40 లక్షల పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ: సీఎం చంద్రబాబు (Ritik Sharma)
ఇప్పటివరకు 40 లక్షల పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ: సీఎం చంద్రబాబు (Ritik Sharma)

అక్టోబర్ నెలలోనే 790 గ్రామాల్లో దాదాపు నాలుగు లక్షలకు పైగా పాస్‌పుస్తకాలను పంపిణీ చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. "రైతులు అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదు. మీ భూమికి మీరే యజమానులు. ఎలాంటి భూ వివాదాలకు తావులేకుండా సమగ్ర రీ-సర్వే పూర్తి చేసి పాస్‌పుస్తకాలు ఇస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని భూ వివాదాలను పరిష్కరించి రైతులకు హక్కు పత్రాలు అందజేశారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై సభలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు చంద్రబాబు. తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రజలకు చెందిన 16.4 లక్షల ఎకరాల భూములను గత పాలకులు నిరోధిత జాబితాలో (సెక్షన్ 22ఏ) పెట్టారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో భూములకు రక్షణ లేకుండా పోయిందని, ప్రజలు ఇళ్లల్లోనూ, బయట కూడా భయంతో బతికారన్నారు.

బీసీ రిజర్వేషన్లు & స్థానిక సంస్థల ఎన్నికలు

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల జీవోను సుప్రీంకోర్టు రద్దు చేసినప్పటికీ, తమ పార్టీ (టీడీపీ) తరఫున బీసీలకు 34 శాతం సీట్లు కేటాయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గతంలో టీడీపీ ప్రభుత్వం తెచ్చిన 34 శాతం బీసీ రిజర్వేషన్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం 24 శాతానికి తగ్గించిందని, దాన్ని కూటమి ప్రభుత్వం రాగానే మళ్లీ 34 శాతానికి పెంచితే కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) నెపంతో స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేసేందుకు ప్రతిపక్షం కుట్ర చేస్తోందని ఆరోపించారు.

'మీ భూమి - మీ హక్కు', అభివృద్ధి పనులకు శంకుస్థాపన

'మీ భూమి - మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముప్పాళ్ల గ్రామంలో రూ.28 కోట్లతో నిర్మించనున్న వారధి నిర్మాణానికి పునాది రాయి వేశారు. అలాగే రూ.166 కోట్ల వ్యయంతో పోతుల చెంచయ్య పాలేరు జలాశయం ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే ఈ ప్రాంతంలో 9,500 ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా 15 గ్రామాల్లోని 35,000 మందికి తాగునీరు అందుతుందని చంద్రబాబు నాయుడు తెలిపారు.

సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులపై ప్రణాళికలు

ఇటీవల చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ.. విజయవాడ, విశాఖపట్నం, మంగళగిరి ప్రాంతాల్లో రూ.52,000 కోట్ల విలువైన నివాస స్థలాల హక్కులను 60,000 మందికి కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేశామని, త్వరలోనే మరో ఆరు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. వంశధార నుంచి పెన్నా వరకు 40 చిన్న, పెద్ద నదులను అనుసంధానిస్తూ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని, గోదావరి - కావేరి నదుల అనుసంధానం ద్వారా నాలుగు రాష్ట్రాల నీటి ఎద్దడి తీరుతుందన్నారు. వచ్చే మూడేళ్లలో రూ.35,000 కోట్ల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More