ఏపీలో అంగన్‌వాడీ కేంద్రాల వేళల్లో మార్పు.. జూలై 28 వరకు కొత్త టైమింగ్స్ వర్తింపు!

ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ కేంద్రాల వేళల్లో మార్పులు జరిగాయి. జూలై 28 వరకు కొత్త టైమింగ్స్ వర్తించనున్నట్టుగా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

Published on: Jun 29, 2026, 22:19:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ సమయాల్లో ప్రభుత్వం తాత్కాలిక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బూత్ లెవల్ ఆఫీసర్లుగా (BLO) అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అంగన్‌వాడీ కేంద్రం(ప్రతీకాత్మక చిత్రం)
అంగన్‌వాడీ కేంద్రం(ప్రతీకాత్మక చిత్రం)

రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ, ఇతర ఎన్నికల సంబంధిత విధుల నిర్వహణలో అంగన్‌వాడీ టీచర్లు చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. దీనివల్ల అటు కేంద్రాల నిర్వహణ, ఇటు బీఎల్‌ఓ విధుల సమన్వయం కష్టతరంగా అవుతోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు, పరిష్కరించడానికి ప్రభుత్వం తాత్కాలికంగా నెల రోజుల పాటు సమయాలను సవరించినట్టుగా ప్రకటించింది.

ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం.. బీఎల్‌ఓ విధుల్లో ఉన్న అంగన్‌వాడీ టీచర్ల కేంద్రాలు మాత్రమే ఇక మీదట ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 03:00 గంటల వరకు పనిచేస్తాయన్న మాట. ఈ కొత్త వేళలు జూన్ 29 నుండి ప్రారంభమై, జూలై 28 వరకు అమలులో ఉంటాయి.

కేవలం ఎన్నికల విధులు ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రమే ఈ సమయ మార్పు వర్తిస్తుంది. మిగిలిన కేంద్రాలు యథావిధిగా పాత వేళల్లోనే నడుస్తాయి. సమయం తగ్గించినా కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు అందించే బాలామృతం, గుడ్లు, పాలు వంటి పౌష్టికాహార పంపిణీకి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

జూన్, జూలై నెలల్లో వర్షాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్న పిల్లల ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమయ మార్పుపై క్షేత్రస్థాయిలో ఉన్న లబ్ధిదారులకు ముందే సమాచారం అందించి అవగాహన కల్పించాలని అంగన్‌వాడీ సూపర్‌వైజర్లకు ఆదేశాలు వెళ్లాయి.

ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. మరణించిన వారి పేర్లు, నకిలీ ఓట్లు, వలస వెళ్లిన వారి పేర్లను తొలగించి, కొత్త ఓటర్లను చేర్చడం ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. సర్వే సమయంలో బూత్ లెవల్ అధికారులు ఇంటికి వచ్చినప్పుడు ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు వంటి సరైన వివరాలను వారికి అందించాలి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More