ఇక నరసాపురం వరకు వందేభారత్‌ ట్రైన్ - ఈనెల 15 నుంచే ప్రారంభం, ఆగే స్టేషన్‌లు ఇవే

చెన్నై సెంట్రల్‌- విజయవాడ మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ను నర్సాపురం వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సర్వీసులు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు ట్రైన్ టైమింగ్ వివరాలను పేర్కొంది.

Published on: Dec 11, 2025 2:07 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వందే భారత్ ట్రైన్ సర్వీసులపై గోదావరి జిల్లాల ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ చెన్నై-విజయవాడ మధ్య తిరుగుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్…. ఇకపై నరసాపురం వరకూ ప్రయాణించనుంది. అయితే ఈ సర్వీస్ ప్రారంభ తేదీలపై రైల్వే శాఖ తాజాగా ప్రకటన చేసింది.

నరసాపురం వరకు వందేభారత్‌ ట్రైన్
నరసాపురం వరకు వందేభారత్‌ ట్రైన్

ఈనెల 15 నుంచి ప్రారంభం…

ఈ నెల 15వ తేదీ నుంచి నరసాపురం వరకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చెన్నై లో 5.30 గంటలకు బయలుదేరి ( ట్రైన్ నెంబర్ - 20677) రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్లో ఆగుతుంది. విజయవాడలో 11.45 గంటలకు, మధ్యాహ్నం 12:34 గంటలకు గుడివాడ, 1:29 గంటలకు భీమవరం టౌన్ చేరుకుని మధ్యాహ్నం 2:10 గంటలకు నర్సాపురం చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలోరైలు (ట్రైన్ నెంబర్ 20678) నర్సాపురం నుంచి మధ్యాహ్నం 2:50 గంటలకు బయలుదేరి 3:19 గంటలకు భీమవరం టౌన్ చేరుకుంటుంది. అక్కడ్నుంచి 4:09 గంటలకు గుడివాడ, 4:50 గంటలకు విజయవాడకు, రాత్రి 11.45 గంటలకు చెన్నైకి చేరుకుంటుంది.

వందేభారత్ ట్రైన్ ను నర్సాపురం వరకు పొడిగించిన నేపథ్యంలో…. ఈ మార్గంలో గుడివాడ, భీమవరం టౌన్ స్టేషన్లలో ఆగుతుంది. ట్రైన్ నంబర్ 20677 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి నర్సాపురం వరకు, అలాగే రైలు నంబర్ 20678 నర్సాపురం నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు నడవనుంది.

కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి (నర్సాపురం ఎంపీ) భూపతిరాజు ​శ్రీనివాస వర్మ చాలా రోజులుగా ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ కోసం పట్టుబడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ కూడా హామీనిచ్చారు. నర్సాపురానికి వందే భారత్ ట్రైన్ తీసుకువస్తాని చెప్పారు. ఆ తర్వాత నర్సాపురం నుంచి విజయం సాధించిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ…. పలుమార్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు.

సర్వీస్ పొడిగింపుపై కసరత్తు పూర్తి చేసిన రైల్వేశాఖ అధికారులు… తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో నరసాపురం వరకు వందే భారత్ ట్రైన్ రాకపోకలు కొనసాగించనుంది. ఈనెల 15వ తేదీ నుంచి అధికారికంగా ఈ సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. వందే భారత్ ట్రైన్ సర్వీసులు అందుబాటులోకి వస్తుండటంపై గోదావరి జిల్లాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.